తొలియత్నం: ఈ సినిమాకి స్క్రీన్‌ప్లేనే బలం! | Screen Play will play main role for this Movie, says Neelakanta | Sakshi
Sakshi News home page

తొలియత్నం: ఈ సినిమాకి స్క్రీన్‌ప్లేనే బలం!

Published Sun, Sep 22 2013 2:24 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM

తొలియత్నం: ఈ సినిమాకి స్క్రీన్‌ప్లేనే బలం!

తొలియత్నం: ఈ సినిమాకి స్క్రీన్‌ప్లేనే బలం!

‘షో’... చిన్న సినిమానా, పెద్ద సినిమానా? ఆర్ట్ సినిమానా, కమర్షియల్ సినిమానా? రొటీన్ సినిమానా, డిఫరెంట్ సినిమానా? ఏదైతేనేం... థియేటర్ల నుంచి ఫిలిం ఫెస్టివల్స్ దాకా ప్రశంసలు అందుకుంది. నేషనల్ అవార్డునూ గెలుచుకుంది. నీలకంఠ లాంటి ఓ అద్భుతమైన దర్శకుడుని సినీ ప్రపంచానికి పరిచయం చేసిన ఆ ‘షో’ తాలూకు వెలుగు నీడలివి...
 
 నేను డెరైక్టర్ కావడానికి ప్రేరణ బాలచందర్‌గారు. ఆయన తన సినిమాల్లోని పాత్రల తాలూకు అంతరంగాన్ని అద్భుతంగా చిత్రిస్తారు. నేనూ ఆయనలానే సినిమాలు తీయాలన్న ఉద్దేశంతో చిత్రరంగంలోకి అడుగుపెట్టాను. మరోవైపు సత్యజిత్ రే, బసు ఛటర్జీ, హృషికేశ్ ముఖర్జీ, శ్యామ్ బెనగళ్, బిమల్‌రాయ్‌ల సినిమాలు... దర్శకత్వం పట్ల నా అవగాహనను మరింత మెరుగుపరిచాయి. కళాత్మక విలువలతో నిండిన బాపు, విశ్వనాథ్, బాలచందర్ సినిమాలు కమర్షియల్‌గా కూడా పెద్ద సక్సెస్ అయ్యాయి. కానీ ప్రేక్షకులు మాత్రం సినిమాలను ఆర్ట్, కమర్షియల్ సినిమాలుగా ఎందుకు విడదీసి చూస్తారో అని ఆశ్చర్యపోయేవాడిని. ఇలాంటి ఆలోచనలతో సినిమా రంగంలోకి ప్రవేశించి కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేశాను. ఆ తర్వాత సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి నిర్మాతగా నేనే సినిమాలు తీయాలనుకున్నాను.
 
 మొదట కృష్ణగారు హీరోగా భారతీరాజాతో ‘జమదగ్ని’ సినిమాను నిర్మించాను. కానీ ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. నిర్మాతగా నన్ను నిరుత్సాహపరిచిన ఆ సినిమా... నిర్మాణాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు మాత్రం సహకరించింది. కొంత గ్యాప్ తరువాత తమిళంలో రేవతి హీరోయిన్‌గా ప్రియాంక సినిమాకు దర్శకత్వం వహించాను. హిందీ దామినికి రీమేక్‌గా తీసిన ప్రియాంక ఒక మాదిరిగా నడిచింది. కానీ రేవతికి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డ్ దక్కింది. తరువాత చాలామంది దాన్ని రీమేక్ చేయమని అడిగారు. కానీ రీమేక్ సినిమా డెరైక్టర్‌గా మిగిలిపోవడం నాకిష్టం లేదు. దాంతో చేయలేదు. అలా అన్ని అవకాశాలనూ కాదనుకున్నందుకు దాదాపు ఏడేళ్ల గ్యాప్ వచ్చింది. ఈసారి తెలుగులో నా అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నాను. నాదైన సొంత కథతో, విభిన్నంగా, వినూత్నంగా ఉండాలని ముందే నిర్ణయించుకున్నాను. అలా ఆలోచిస్తున్నప్పుడు ఒక సందర్భంలో పరమహంస యోగానంద ఆత్మకథ చదివాను. అందులో ఆయన లైఫ్ ఈజ్ ఎ డ్రామా అనే విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. అది చదివి చాలా ఉత్సుకతకు లోనయ్యాను. ఆయన ఆలోచనల నుంచి ఒక రకమైన స్ఫూర్తి పొందాను.
 
 ఆ తరువాత సినిమా కథ గురించి ఆలోచిస్తున్న క్రమంలో కేవలం రెండు పాత్రలతో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాను. ఒకరోజు మంజులను కలిసినప్పుడు తను ఒక లో-బడ్జెట్ సినిమా చేయాలనుకుంటున్నానని చెప్పారు. అప్పటికే ఆవిడ టీవీ సీరియల్స్ ప్రొడక్షన్‌లో ఉన్నారు. ‘షో’ ఐడియా చెప్పగానే తనకు బాగా నచ్చి, సినిమా చేద్దామని ముందుకొచ్చింది. అప్పుడు స్క్రిప్ట్ మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించాను. కథ మొదట ఒక మర్డర్ మిస్టరీలా, థ్రిల్లర్ మాదిరిగా తయారైంది. దానివల్ల కొన్ని లిమిటేషన్స్ ఏర్పడ్డాయి. అప్పుడు నాకది రెగ్యులర్ ఫిలిమ్‌లా అనిపించింది. తరువాత కథను సోషల్ డ్రామాలా మార్చాను. దానివల్ల పాత్రలకు ఒక బ్యాక్‌గ్రౌండ్ వచ్చింది. స్క్రిప్ట్‌లో చాలా లేయర్స్ కనిపించేట్టు జాగ్రత్త తీసుకున్నాను. ఈ స్క్రిప్ట్ ప్రత్యేకత ఏమిటంటే... సినిమాని, రంగస్థలాన్ని ఒకే దగ్గరకు తీసుకురావడం. ఈ ప్రక్రియ నాకు తెలిసి అంతవరకూ ఎక్కడా లేదు. కథ విన్న ఒకరిద్దరు మిత్రులు రెండు పాత్రలతో సినిమా అంటే ఇరవై నిమిషాల తరువాత బోర్ కొడుతుంది అన్నారు. నేను రెండు గంటల సేపు బోర్ కొట్టకుండా తీయగలనని, అదొక ఎమోషనల్ ట్రావెల్‌లా ఉంటుందని చెప్పాను.
 
 తరువాత అధ్యాయం ఆర్టిస్టుల అన్వేషణ. స్క్రిప్ట్‌కు న్యాయం జరగాలంటే దానికి తగిన ఆర్టిస్టులు  దొరకాలి. అప్పుడే మన స్వప్నం నిజమవుతుంది. మంజులకు కథ చెబుతున్నప్పుడు రిధిమ పాత్రకు తను హండ్రెడ్ పర్సంట్ ఫిట్ అవుతుందనిపించింది. మాధవ్ పాత్రకు కొత్త ముఖాన్ని తీసుకోవాలని ఆలోచించాను. ఆ క్రమంలో సూర్య నటించిన ఒక సినిమా చూసి తనే ఆ పాత్రకు న్యాయం చేయగలడనిపించింది. ఎందుకంటే మాధవ్ పాత్ర మొదట మంచి మనిషిగా, తరువాత ఒక సైకోగా, అటు నుంచి ఒక ఫ్రస్ట్రేటెడ్ మ్యాన్‌గా... మూడు షేడ్స్‌లో కనిపించాలి. అలాంటి విభిన్నమైన పాత్రకు పర్‌ఫార్మెన్స్‌తో పాటు లుక్ కూడా ఉండాలి.
 
 విచిత్రమేమిటంటే ఈ సినిమాకు నేననుకున్న ప్రతిదీ ఏదో అదృశ్య శక్తి సమకూర్చినట్టుగానే జరిగిపోయేది. స్క్రిప్ట్ ఒక లొకేషన్‌లో అనుకున్నాను. ఒక ఇల్లు, అందులో తోట, కొలను, ఇంటి మధ్యలో మెట్లు... ఇలా ఉంటే బాగుంటుందని రాసుకున్నాను. అలాంటి లొకేషన్ కోసం హైదరాబాద్‌లో వెదకసాగాను. అంతలో నా మిత్రుడు మదనపల్లిలో ఒక లొకేషన్ చెప్పాడు. నేనా ఇల్లు చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఒక క్యారెక్టర్ జర్మనీలో పనిచేసి రిటైరై, ఇండియాకు వచ్చిన ప్రొఫెసర్ అని రాసుకున్నాను. నేను కథలో రాసుకున్న క్యారెక్టర్ వచ్చి నా కళ్ల ముందు నిలబడ్డట్టు జర్మనీలో పనిచేసి వచ్చిన సైంటిస్ట్ రాజారెడ్డి ఇల్లు నాకు మదనపల్లిలో దొరికింది. ఇక సినిమా జరిగేటప్పుడు ప్రొడ్యూసర్‌గా, నటిగా మంజుల ఇచ్చిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఆవిడ సహకారం వల్లే లొకేషన్‌లో నాకు ఎలాంటి సమస్యా ఎదురుకాలేదు. కథ ప్రకారం సినిమా ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది. స్క్రిప్ట్‌లో రాసుకున్నట్టే సీన్స్ ఒక ఆర్డర్ ప్రకారం షూట్ చేశాను. అది షూటింగ్‌కు సంబంధించిన బెస్ట్ పార్ట్.
 
 కొలను దగ్గర తీయాల్సిన కొన్ని సీన్స్ ‘తడ’ ఫారెస్ట్‌లో చేశాను. సినిమా మొత్తం 22 రోజుల్లో 26 లక్షల బడ్జెట్‌తో పూర్తి చేశాం. సినిమా చేస్తున్నప్పుడు ఎవరో ‘యాదే’ చూశావా, అందులో సినిమా అంతా ఒకే పాత్రతో నడుస్తుంది అని అన్నారు. వాస్తవంగా నేనా సినిమా చూడలేదు. సినిమా చేస్తున్నప్పుడు కొంతమంది కొన్ని సందేహాలు వ్యక్తం చేసినా నేను మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మంజుల పర్‌ఫార్మెన్స్ చాలా సహజంగా, వాస్తవికతకు దగ్గరగా ఉంది. మంజుల, సూర్య బ్యాలన్స్‌డ్‌గా నటించారు. ఇది ఈ సినిమాకు ప్రధాన బలం. సినిమాలో మరో రెండు క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రొఫెసర్, అతని అసిస్టెంట్ ఒక సీన్‌లో కన్పిస్తారు. కానీ సినిమా తొంభై తొమ్మిది శాతం రెండు క్యారెక్టర్స్ మధ్యే నడవడం వల్ల రెండు క్యారెక్టర్స్‌తోనే సినిమా అని అందరూ ఫీలయ్యారు. కెమెరామెన్ రవియాదవ్... నా ఆలోచనల్ని అర్థం చేసుకుని సినిమాటోగ్రఫీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నేషనల్ బెస్ట్ ఎడిటర్‌గా అవార్డ్ తీసుకున్న అనిల్ మల్నాడ్ ఈ సినిమాకు పనిచేశారు. ఆయన అనుభవం సినిమాను మరింత ఆసక్తిగా మలచడానికి తోడ్పడింది. కృష్ణగారి కుటుంబమంతా సినిమా చూసి సంతోషం వ్యక్తం చేసి నన్ను అభినందించారు.
 
 ఇక ‘షో’ అనే టైటిల్ పెట్టడం వెనుక కారణం ఏమిటంటే, మామూలుగా సినిమా ఫస్ట్ షో, సెకండ్ షో అంటుంటాం. అందులో ఒక్క ‘షో’ అన్న మాటను తీసి టైటిల్‌గా పెడితే ఎలా ఉంటుందా అని ఆలోచించాను. చాలామంది మిత్రులు బాగుందనడంతో దానికి ఫిక్సయ్యాను. ఈ సినిమాకు నేను స్క్రిప్ట్‌లో రాసుకున్నట్టే అన్నీ అమరడంతో ముందు టైటిల్స్‌లో సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్తకు ఈ ‘షో’ అంకితం అని వేశాను. సినిమా చివరిలో ‘ఆ జగన్నాటక సూత్రధారి, కేవలం మన వినోదం కోసం సృష్టించిన అద్భుత నాటకమే... ఈ జీవితం’ అని నాకు స్ఫూర్తినిచ్చిన పరమహంస యోగానంద వాక్యం పెట్టాను. ఎన్నో ఆలోచనల పొరలు దాటుకుని రూపం దాల్చిన ‘షో’ సినిమా 2002లో తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానే కాక, బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్‌గా నాకు పేరు తెచ్చిపెట్టింది. అవార్డులనూ అందుకుంది. ఇప్పుడు ఎప్పుడైనా ‘షో’ సినిమా చూస్తుంటూ... స్టైలింగ్‌లో ఇంకో పది శాతం మార్పులు చేస్తే సినిమా ఇంకొంచెం బెటర్‌గా ఉండేదేమో అనిపిస్తూ ఉంటుంది!
 - కె.క్రాంతికుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement