సినిమా రివ్యూ: మాయ | Neelakanta's Maaya away from Magic | Sakshi
Sakshi News home page

సినిమా రివ్యూ: మాయ

Published Fri, Aug 1 2014 8:26 AM | Last Updated on Sat, Sep 2 2017 11:10 AM

సినిమా రివ్యూ: మాయ

సినిమా రివ్యూ: మాయ

నటీనటులు: హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మా రాజ్, నాగబాబు, ఝాన్సీ
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి 
నిర్మాత: మధుర శ్రీధర్
దర్శకుడు: నీలకంఠ
ప్లస్ పాయింట్స్: కథనం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్: సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాల్లో ఉండే వేగం లేకపోవడం, వినోదం లేకపోవడం
 
షో చిత్రంతో జాతీయ అవార్డు, మిస్సమ్మ చిత్రంతో ప్రేక్షకులు అభిమానాన్ని, విమర్శకుల ప్రశంసలందుకున్న దర్శకుడు నీలకంఠ తాజాగా హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మ, నందిని రాయ్ లతో 'మాయ'చిత్రాన్ని రూపొందించారు. సస్పెన్స్, థ్రిలర్ రూపొందిన ఈ చిత్రం మాయ చేసిందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. 
 
ఓ టెలివిజన్ రిపోర్టర్ గా పనిచేసే మేఘన (అవంతిక మిశ్రా) చిన్నతనం నుంచి జరగబోయే సంఘటనలు ముందే తెలిసే ఈఎస్పీ (ఎక్స్ ట్రా సెన్సరీ పర్ సెప్షన్) అనే వ్యాధితో బాధపడుతుంటుంది. వృత్తిలో భాగంగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సిద్దార్థ్ వర్మ (హర్షవర్ధన్ రాణే)తో కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో సిద్ధూ, మేఘన ఒకర్నిమరొకరు ప్రేమించుకుంటారు. అయితే తన చిన్ననాటి స్నేహితురాలు పూజా(సుష్మా రాజ్)కు సిద్దూకి పెళ్లి కుదిరిందనే నిజం తెలుస్తుంది. అంతేకాకుండా సిద్దూ ఫస్ట్ లవర్ వైశాలి (నందిని రాయ్) రోడ్డు ప్రమాదంలో అనుమానస్పద  స్థితిలో మృతి చెందుతుంది. వైశాలి మృతి విషయంలో సిద్దూపై అనేక అనుమానాలు తలెత్తుతాయి. ఇలా ఉండగా పూజాను సిద్దూ చంపబోతున్నట్టు మేఘనకు ముందే తెలుస్తుంది. పూజాను సిద్దూ నిజంగానే చంపుతాడా? పూజాను సిద్దూ ఎందుకు చంపాల్సి వస్తుంది? తన స్నేహితురాలు పూజాను మేఘన రక్షించుకుంటుందా? వైశాలి మృతి వెనుక కారణాలేంటి? వైశాలి మృతి విషయంలో సిద్దూపై ఎందుకు అనుమానాలు తెలుత్తాయి అనే ప్రశ్నలకు సమాధానమే 'మాయ'. 
 
మేఘన పాత్రలో అవంతిక మిశ్రాకు ఈ చిత్రంలో కీలకపాత్ర లభించింది. గ్లామరస్ గా కనిపించింది. కొంత నటనకు స్కోప్ ఉన్న పాత్రను పర్వాలేదనిపించే స్థాయిలో పోషించింది.
 
ఫ్యాషన్ డిజైనర్ పాత్రను పోషించిన హర్షవర్ధన్ రాణేకు ప్రాధాన్యత ఉన్న పాత్రనే దక్కించుకున్నారు. కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ పలికించడంలో తడబాటుకు గురైనాడు. కాని మిగితా చిత్రాలతో పొల్చుకుంటే హర్షకు ఇంపార్టెంట్ పాత్రనే ఈ చిత్రంలో లభించింది. యాక్టింగ్, హావభావాలు పలికించడంలోను మరికొంత మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉంది. 
 
ఈ చిత్రంలో పూజా పాత్రలో సుష్మా రాజ్ కనిపించింది. చిత్రంలో మరో కీలక పాత్రలో సుష్మా తన మార్కును ప్రదర్శించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆకట్టుకుంది. సిద్దూకి ప్రియురాళిగా నటించిన నందిని రాయ్ ది అంతగా ప్రాధాన్యత లేని పాత్రే. నాగబాబు, ఝాన్సీ అతిధి పాత్రలకే పరిమితమయ్యారు. 
 
టెక్నికల్: 
 
ఓ హారర్, థ్రిల్లర్ చిత్రాలకు అవసరమయ్యే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను అందించి శేఖర్ చంద్ర ఆకట్టుకున్నారు. పాటలు అంతగా గుర్తుంచుకునేలా లేకపోవడం ఈ చిత్రానికి మైనస్ అని చెప్పవచ్చు. బాల్ రెడ్డి ఫోటోగ్రఫి క్వాలిటీ పరంగా బాగుంది. మధుర శ్రీధర్ రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి. 
 
ఎప్పుడూ విభిన్న కథాంశంతో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు నీలకంఠ తాజాగా మరో ప్రయోగం మాయతో ముందుకొచ్చారు. తొలి సీన్ లోనే థ్రిల్ కలిగించి నీలకంఠ ఆకట్టుకున్నారు.  ఆతర్వాత కథ నత్తనడక సాగడంతో తొలి భాగం కొంత విసుగు పుట్టించే విధంగా ఉంటుంది. ఇక రెండవ భాగంలో హీరోపై అనుమానాలు రేకెత్తించి కొంత ఆసక్తిని రేపాడు.  క్లైమాక్స్ లో ఊహించని విధంగా కథను కీలక మలుపు తిప్పి నీలకంఠ తన మార్కును చూపించారు. ఎడిటింగ్ విభాగంపై మరికొంత దృష్టి పెట్టి ఉంటే కొంత వేగం పెరిగి ఉండేది. ప్రేక్షకుడ్ని థియేటర్ కు రప్పించే బలమైన అంశాలు లేకపోవడం కొంత నిరాశే. ఓవరాల్ గా వినోదమే ప్రధానంగా రూపొందుతున్న ప్రస్తుత ట్రెండ్ లో నీలకంఠ తాజా థ్రిల్లర్ చిత్రం 'మాయ' చేస్తుందా అనే విషయం తెలుసుకోవాలంటే కొద్ది రోజులాగాల్సిందే. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement