
సినిమా ఇండస్ట్రీలో ‘నెపోటిజం’ అనే పదం తరచూ వినిపిస్తూ, వివాదాస్పద చర్చలకు కారణమవుతోంది. ప్రముఖ నటులు, దర్శకుల పిల్లలకు ఈ నెపోటిజం ఒక వరంగా కనిపించినా, అది వారికి శాపంగా మారుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. స్టార్ కుటుంబాల నుంచి వచ్చే యువ ప్రతిభావంతులు తమ టాలెంట్‌తో ముందుకు వచ్చినప్పటికీ, వారి లాంచింగ్ సమయంలో వారిపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇండస్ట్రీకి చెందిన స్టార్ కిడ్స్‌కి తమ తల్లిదండ్రుల పేరు, పరిచయాల ద్వారా సులభంగా అవకాశాలు పొందవచ్చనే అభిప్రాయం ఉన్నప్పటికీ, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని, తమ స్వంత గుర్తింపు సాధించడం అంత సులభం కాదు. టాలెంట్ ఉన్నవారు కూడా, తమను తాము నిరూపించుకోవాల్సిన ఒత్తిడితో పాటు, ప్రేక్షకులు పెట్టుకునే భారీ అంచనాలను సైతం అందుకోవాల్సి వస్తోంది.
అయితే తనను మాత్ర నెపోకిడ్‌గా చూడడానికి అవకాశం ఇవ్వబోను అంటోంది అవంతిక సుందర్. తమిళ హీరోయిన్ ఖుష్భూ, స్టార్ డైరెక్టర్ సుందర్ దంపతులు పెద్ద కూతురే ఈ అవంతిక సుందర్. లండన్‌లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ త్వరలోనే వెండితెర ఎంట్రీ చేయబోతుంది. మంచి కథ కోసం ఎదురు చూస్తోంది. సొంత నిర్మాణ సంస్థ ఉన్నప్పటికీ ఖుష్భూ-సుందర్ దంపతులు తమ కూతురు డెబ్యూ ఫిల్మ్‌ని నిర్మించడానికి సుముఖంగా లేరట. అంతేకాదు కథల ఎంపిక విషయంలోనూ జోక్యం చేసుకోబోమని చెప్పారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా అవంతికనే చెప్పింది.
నాకు అది ఇష్టం లేదు కానీ...
నా తల్లిదండ్రులు నన్ను లాంచ్ చేయాలని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అంతేకాదు నేను ఏ సినిమా చేయాలో ఏది చేయకూడదో కూడా చెప్పబోమని నాతో అన్నారు. నాకు ఏది సౌకర్యంగా అనిపిస్తుందో అదే చేయమని మాత్రమే సలహా ఇచ్చారు. వాళ్ల సపోర్ట్ తీసుకోవడం వ్యక్తిగతంగా నాకు అది ఇష్టం లేదు. నా సొంతంగానే రాణించాలనుకుంటున్నాను. కానీ నా పెరెంట్స్ కారణంగా ఇండస్ట్రీలో నాకొక స్పెసల్ స్థానం ఏర్పడిందనేది వాస్తవం. కనీసం ఇండస్ట్రీకి చెందినవారిని పరిచయం చేసుకోవాలన్నా తల్లిదండ్రుల సపోర్ట్ కావాలి. నాకున్న అడ్వాంటేజ్ అదొక్కటే. దాని వాడుకోకుండా సొంతంగానే ఇండస్ట్రీలోకి వస్తానని చెప్పడం తప్పే అవుతుంది. ఒక స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం అనేది ఎంత ఒత్తిడితో కూడుకున్నదో నాకు తెలుసు. అయితే నేను వాళ్లకంటే ఎక్కువగా సక్సెస్ సాధిస్తానని చెప్పలేను. కానీ ఖచ్చితంగా సక్సెస్ ని సాధించడానికి నా వంతు ప్రయత్నం చేయగలను’ అని అవంతిక చెప్పుకొచ్చింది.
అదే నా మైనస్
నేను ఏ భాషలోనైనా సరే నటించడానికి రెడీగా ఉన్నాను. మంచి కథల కోసం ఎదురుచూస్తున్నాను. అయితే నా మూవీ జర్నీకి నా హైట్ ఒక అడ్డంకిగా మారుతుందని నాకు తెలుసు. ఇలా ఎక్కువగా హైట్ ఉండడం వల్ల నా ఫస్ట్ ఛాన్స్ కోసం చాలా కాలం వేచి ఉండాల్సి వస్తుంది. టీనేజ్‌లో నేను అధిక బరువుతో, కళ్లద్దాలు పెట్టుకుని ఉండేదాన్ని. దీంతో హీరోయిన్లలా కనిపించడం కష్టమని చాలా బాధపడ్డాను. కానీ కరోనా తర్వాత నా శరీరాన్ని మార్చుకుని నా కలను సాధించాలనుకున్నాను.. ఇప్పుడు నాకు అన్ని రకాల పాత్రలను పోషించాలని ఉంది’ అని అవంతిక అన్నారు.