ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయినప్పటికీ తెలుగువారంతా సమానమేనని సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు.
షోలాపూర్, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయినప్పటికీ తెలుగువారంతా సమానమేనని సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి అక్కల్‌కోట్ రోడ్‌వైపున ఉన్న పూజాల్ క్రీడా మైదానంలో నిర్వహించిన ఓ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో తాను ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా విధులు నిర్వహించానని, ఆ రాష్ర్టం రెండుగా చీలిపోవడంలో తన పాత్ర కూడా ఉండడం కొంత బాధాకరంగా ఉందని విచారం వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా కొనసాగుతున్న తెలంగాణ డిమాండ్ మేరకే రాష్ట్రాన్ని విభజించినట్లు ఆయన తెలిపారు.
అయితే విభజన విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నా తన దృష్టిలో తెలుగువారంతా సమానమేనని ఆయన తెలిపారు. నీలకంఠ, జండ్రా, కురుహిణ్‌శేట్, కోష్టి సమాజాల మహాసంఘం నిర్వహించిన ఈ సదస్సులో శ్రీమద్గురు నీలకంఠ పట్టాయచాన్య సమక్షంలో సదరు నాలుగు కులాల వారు దీక్ష బూనారు. తమ కులవృత్తి, గోత్రాలు, కులదైవం ఒక్కటే అయినా వేర్వేరు కులాలుగా ఉండే బదులు ఒకే కులం పేరుతో ఉందామని ప్రతిజ్ఞ బూనారు.
కాగా, రామకృష్ణ భగుడే అతిథులకు స్వాగతం పలకగా, నాగేష్ మల్వాల్ ప్రాస్తవికోపన్యాసం గావించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రణతి షిండే, మహేష్‌కోటే, ధర్మన్న సాదులు, విజయకుమార్ ద్యావరకొండ, శివకుమార్ బండా, బాలాజీ అబాత్తిని తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ, రాయలసీమ అలాగే కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి 150 ఏళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం ఇక్కడికి వచ్చి శాశ్వతంగా స్థిరపడ్డవారు ఎక్కువ మంది ఉన్నారు.