'ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి టీ. బిల్లు పంపుతాం'
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి తెలంగాణ బిల్లు పంపిస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఈ నెల చివరికల్లా రాష్ట్ర ఏర్పాటు అంశంపై జీఓఎం నివేదిక సమర్పిస్తుందని ఆయన తెలిపారు. జీఓఎం సమావేశానికి హాజరై ముందు షిండే మీడియాతో మాట్లాడారు. తెలంగాణ విభజన బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి తప్పక పంపుతామని తెలిపారు. హైదరాబాద్ నగర అంశాన్ని కూడా ఇందులోనే పొందుపరిచి బిల్లును పంపుతామన్నారు. సీమాంధ్ర అభివృద్ధికి మంచి ప్యాకేజీని కేంద్రం ఇస్తుందని షిండే తెలిపారు.
అంతకు ముందు పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన జేడీ శీలం విభజనకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతల నుంచి తప్పక సహకారం లభిస్తుందని తెలిపారు. ఆమోదకరమైన ప్యాకేజీని ఇచ్చి సీమాంధ్ర ప్రజలను విభజనకు ఒప్పిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై యూపీఏ సమన్వయ కమిటీ తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదని తెలిపారు.