షోలాపూర్, న్యూస్‌లైన్:
కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే సొంత ఊరైన షోలాపూర్ పట్టణంలో పేలుడు పదార్థాలు లభించడం కలకలం సృష్టించింది. ఈ కేసులో క్రైం బ్రాంచ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితులు ఉగ్రవాదులా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులని మహ్మద్ సాదిక్ అబ్దుల్ వహబ్ (32), ఉమర్ అబ్దుల్ హఫీజ్ దండోతి (35)లుగా గుర్తించారు.
ఈ కేసు వివరాలను బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో పట్టణ పోలీసు కమిషనర్ ప్రదీప్ రాసుకర్‌తో పాటు ఔరంగాబాద్ ఏటీఎస్ చీఫ్ నవీన్ చంద్రారెడ్డి వివరించారు. తగిన సమాచారం మేరకు సాదిక్ ఇంటిపై దాడిచేయగా 81 జిలెటిన్ క్యాండీలు, 102 డిటోనేటర్లు, రివాల్వర్, ఏడు బుల్లెట్లు, కంప్యూటర్, స్కానర్ ప్రింటర్, మెమరీకార్డులు, 200 సిమ్‌కార్డులు, పెన్‌డ్రైవ్‌లు దొరికాయన్నారు. తర్వాత ఉమర్ దండోతి ఇంటిపై దాడి చేయగా, మందుగుండు సామగ్రి లభించిందన్నారు. మరో ముగ్గురి ఇళ్లపై కూడా దాడులు చేసినా అక్కడ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని వివరించారు.
ఇదిలావుండగా ఉగ్రవాదుల కోసం ఏటీఎస్ బృందం దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా పక్కా సమాచారం మేరకు అబ్దుల్ ఫజల్, పట్టణానికి చెందిన సిమి కార్యకర్త ఖలీద్ ముచాలేలను ఖండ్వా బార్డర్‌లో ఈ బృందం అరెస్టు చేసింది. ఖలీద్‌కు ఒక నేరం విషయంలో ఇండోర్ న్యాయస్థానం గతంలో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
నాలుగేళ్లు శిక్ష అనుభవించిన తర్వాత ఖలీద్ విడుదలయ్యాడు. అక్కడి నుంచి పట్టణానికి వచ్చి తన సోదరులతో నహిజిందగి ప్రాంతంలో ఉన్నాడు. అయితే కొన్నాళ్ల తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అయితే ఖండ్వా బార్డర్ సమీపంలో ఏటీఎస్‌కు పట్టుబడ్డాడని కమిషనర్ వివరించారు. అతడిని విచారించగా ఉగ్రవాదులకు సాయం చేసేవారు పట్టణంలో ఇంకా ఉన్నారని తేలడంతో పోలీసులు అక్కడ దాడులు నిర్వహించారు. ఇదిలా ఉండగా, కొన్ని రోజుల పాటు పట్టణంలో ఉన్న ఖలీద్‌కు సాదిక్‌తో పరిచయం ఏర్పడింది. బోగస్ డ్రైవింగ్ లెసైన్సులు, ఎన్నికల గుర్తింపు కార్డులు అందజేస్తూ ఖలీద్‌కు సాదిక్ సాయం చేసేవాడని పోలీసులు తెలిపారు.
షిండే సొంతూరులో బాంబుల కలకలం
Published Wed, Dec 25 2013 11:06 PM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM
Advertisement