కొత్త సీఎం ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించే విషయంపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకుంటారన్నది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని షిండే చెప్పారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందాక ముఖ్యమంత్రి పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం, గవర్నర్ ఆమోదించిన సంగతి తెలిసిందే.
ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని షిండే చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నది ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని తెలిపారు. కాగా ఎన్నికలు జరగడానికి ఇంకా మూడు నెలలు సమయం ఉండటంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమున్నట్టు కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలావుండగా, తెలంగాణ, సీమాంధ్రకు వేర్వేరు పీసీసీలతో పాటు రెండు ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. మరో వైపు కాంగ్రెస్ నుంచి వలసలు ఊపందుకోవడంతో రాష్ట్రపతి పాలన తప్పదనే వాదనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని షిండే చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం పీఠం కోసం ఇరు ప్రాంతాలకు చెందిన పలువురు నాయకులు ప్రయత్నిస్తున్నారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఆదివారం హస్తినబాట పట్టారు.