
ఆన్‌లైన్ వ్యాపారానికి మార్గదర్శకుడు!
ఒక వ్యక్తి డబ్బు సంపాదించాలంటే సొంతంగా ఉత్పత్తి చేసే శక్తి ఉండాలి లేదా వేరే వారు ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసే టాలెంట్ ఉండాలి.
స్ఫూర్తి
ఒక వ్యక్తి డబ్బు సంపాదించాలంటే సొంతంగా ఉత్పత్తి చేసే శక్తి ఉండాలి లేదా వేరే వారు ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసే టాలెంట్ ఉండాలి. లేదంటే ఉత్పత్తి దారుల దగ్గర సలహాదారుగానో, ఉద్యోగిగానో ఉండాలి. అది కూడా కాదంటే సేల్స్‌మెన్ అయ్యుండాలి లేదా షాప్‌కీపర్ అయ్యుండాలి. కానీ ఈ పనులేమీ చేయకుండా ఒక వస్తువును అమ్మి లాభాన్ని తీసుకోవడం ఎలా? సమాధానం మామూలు బుర్రలకు తట్టదు. కానీ జెఫ్‌కు తట్టింది. అది అతణ్ని తిరుగులేని వ్యాపారవేత్తను చేసింది!
డబ్బు, పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొంటూ ఎదగడానికి ఒక్కొక్కరు ఒక్కో రంగాన్ని ఎంచుకొంటారు. అలా ఎంచుకొన్న రంగంలో గుర్తింపు తెచ్చుకొనేవారు కొందరుంటారు. అలాగే తాము ఎంచుకొన్న రంగానికి గుర్తింపును తీసుకొచ్చేవాళ్లూ ఉంటారు. వీరిని మార్గదర్శకులుగా కీర్తించవచ్చు. వారు ఒక దారిలో నడిచి, ఆ దారికి గుర్తింపు తీసుకొచ్చి, అనేకమంది అనుసరణకు అవకాశం ఇస్తారు. జెఫ్ బెజోస్ సరిగ్గా అలాంటివారే. ఆయన స్థాపించిన అమెజాన్ డాట్ కామ్... కొన్ని వేలమందికి మార్గం చూపింది.
ఇంటర్నెట్ పరిణామక్రమంలో మనిషికి అందివచ్చిన గొప్ప సౌకర్యం ఇ-కామర్స్. ఇది కొనుక్కోవాలనే వారికి సౌకర్యంగానూ, సంపాదించాలనుకునేవారికి సదుపాయంగానూ మారింది. ఆ సదుపాయాన్ని ఉపయోగించుకొంటూ, ఇంటర్నెట్ మాధ్యమంగా వ్యాపారం చేస్తూ కోట్ల డాలర్లు సంపాదించిన వారిలో ప్రముఖుడు జెఫ్. ఆయన ఆలోచనలకు రూపమైన అమెజాన్ డాట్‌కామ్... ఆన్‌లైన్‌లో రిటైల్ షాపింగ్‌లో తొలి సంచలనం. పెద్ద పెద్ద రచయితల పుస్తకాల దగ్గర నుంచి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల వరకూ దొరుకుతాయి ఆ వెబ్‌సైట్‌లో. ప్రస్తుతం ప్రపంచంలో అతి పెద్ద ఆన్‌లైన్ రిటైలర్ సైట్ అదే. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్ ఇండియాతో సహా అనేక దేశాల్లో అమెజాన్ ఆన్‌లైన్ సామ్రాజ్యం విస్తరించింది. ఈ సైట్ ద్వారా ప్రతి నిమిషం కొన్ని వేల డాలర్ల వ్యాపారం జరుగుతోంది. అందులో కొంత వాటా జెఫ్ బ్యాంక్ అకౌంట్‌లోకి చేరుతుంది.
ప్రపంచంలోనే అతి పొడవైన నదుల్లో ఒకటైన అమెజాన్ స్ఫూర్తితో తన వెబ్‌సైట్‌కు ఆ పేరు పెట్టాడట జెఫ్. పేరుకు తగ్గట్టుగానే ఆ వెబ్‌సైట్ కూడా అత్యంత విస్తృతమైన పరిధిని కలిగి ఉంది. దీని తర్వాత ఆన్‌లైన్ రిటైల్ బిజినెస్‌లోకి అనేక వెబ్‌సైట్లు వచ్చాయి. కానీ అవి అమెజాన్ స్థాయిని అందుకోలేకపోయాయి. జెఫ్ నిర్వహణ అలా ఉంటుంది మరి!
ప్రపంచంలోనే అతి పొడవైన నదుల్లో ఒకటైన అమెజాన్ స్ఫూర్తితో తన వెబ్‌సైట్‌కు ఆ పేరు పెట్టాడట జెఫ్. పేరుకు తగ్గట్టుగానే ఆ వెబ్‌సైట్ కూడా విస్తృతమైనది.