ఈ వారం you tube హిట్స్ | inthis week youtube hits | Sakshi
Sakshi News home page

ఈ వారం you tube హిట్స్

Published Sun, Oct 25 2015 10:53 PM | Last Updated on Sun, Sep 3 2017 11:28 AM

ఈ వారం you tube   హిట్స్

ఈ వారం you tube హిట్స్

స్టార్ వార్స్ : ది ఫోర్స్ అవేకెన్స్ ట్రైలర్

నిడివి : 2 ని. 35 సె.
హిట్స్ : 4,53,89,879

స్టార్ వార్స్ ఫిల్మ్ సిరీస్‌లో ఇది ఏడవది. ట్రైలర్ గతవారమే విడుదలైంది. ఈ అమెరికన్ ఎపిక్ స్పేస్ అపేరా చిత్రానికి  జె.ఎ.అబ్రామ్స్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 14న రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. 23 ఏళ్ల ఇంగ్లండ్ నటి డైసీ రిడ్లే ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎడారి గ్రహం జక్కులో ఈమె మొదట స్కావెంజర్. తర్వాత సాహస వనితగా అవతరిస్తారు. 1983లో వచ్చిన స్టార్ వార్స్ సిక్స్ ‘రిటర్స్ ఆఫ్ ది జెడీ’ తర్వాత దాదాపు 30 ఏళ్లకు వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. స్టార్‌వార్స్ సీరీస్‌లో తొలిచిత్రం 1977లో విడుదలైంది.
 
మార్వెల్స్ జెస్సికా జోన్స్ : ట్రైలర్
 
నిడివి : 2 ని. 28 సె.
హిట్స్ : 26,47,608

నవంబర్ 20 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్’ నెట్ వర్క్ ద్వారా ప్రపంచమంతటా ప్రసారం కాబోతున్న అమెరికన్ వెబ్ టెలివిజన్ సిరీస్.. మార్వెల్వ్ జెస్సికా జోన్స్. మార్వెల్స్ కామిక్స్ ఆధారంగా ఈ ఎపిసోడ్స్ తయారయ్యాయి. కథానాయిక జోన్స్ పాత్రను క్రిస్టెన్ రిటెన్ నటిస్తున్నారు. కథలో ఆమె ఒక సూపర్ హీరో. ఆ తర్వాత ఒక డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంది. సూపర్‌హీరోగా ఆమె కెరీర్ అర్ధంతరంగా అంతం కావడం వెనుక ఒక విషాదం ఉంటుంది. ఆ విషాదం నుండి తేరుకుని జెస్సికా తనని తను మలుచుకుంటుంది. తనేమిటో ప్రపంచానికి నిరూపిస్తుంది.
 
దివానీ మస్తానీ : వీడియో సాంగ్
 
నిడివి : 2 ని. 44 సె.
హిట్స్ : 33,20,290

రాజమందిరపు నృత్యగీతాన్ని వీక్షించదలచినవారు గతవారమే విడుదలైన ‘దివానీ మస్తానే’ అనే ఈ వీడియో సాంగ్‌ని ఎంపిక చేసుకోవచ్చు. దీపికా పడుకొనే, రణవీర్ సింగ్, ప్రియాంక నటించిన ‘బాజీరావ్ మస్తానీ’లోని  ఈ పాటను ఎంతో రిచ్‌గా దృశ్యీకరించారు. సిద్ధార్థ్ గరిమ రాసిన ఈ పాటకు సంజయ్‌లీలా బన్సాలీ సంగీతం అందించారు. శ్రేయా గోషల్, గణేశ్ చందన్‌శివ గాత్రమిచ్చారు. మరాఠా యోధుడు మొదటి పీష్వా బాజీరావ్, ఆయన రెండవ భార్య మస్తానీల ప్రణయగాథ ఆధారంగా తీసిన ఈ చిత్రం డిసెంబర్ 18 న విడుదలౌతోంది.
 
జస్టిన్ బీబర్ - సారీ (డాన్స్ వీడియో)

నిడివి : 3 ని. 25 సె.
హిట్స్ : 1,65,46,107

కెనడియన్ సింగర్ జస్టిన్ బీబర్ భగ్న ప్రేమగీతం ‘సారీ’. బీబర్ రెండవ సింగిల్ సాంగ్ అయిన ‘సారీ’ విడుదలైన మూడు రోజులకే కోటికి పైగా హిట్లు వచ్చాయి. గత ఆగస్టులో రిలీజ్ అయిన బీబర్ మొదటి సింగిల్ డెబ్యూ ‘వాట్ డు యు మీన్?’ కూడా ఇదేస్థాయి ఆదరణ పొంది, బిల్‌బోర్డ్ హాట్ 100 చార్ట్‌లో నిలిచింది. ఫాస్ట్ బీట్‌తో నడిచే తాజా డాన్స్ పాప్ సాంగ్ ‘సారీ’ యువతరాన్ని అలరిస్తోంది. జూలియా మైఖేల్స్, జస్టిన్ ట్రాంటర్, జస్టిన్ బీబర్ కలిసి రాసిన ఈ గీతంలో  ‘నిన్నెంతో బాధపెట్టాను. ఇప్పుడు సారీ చెప్పడం ఆలస్యమేమో కదా’ అని ప్రీ కోరస్ వినిపిస్తూ ఉంటుంది.
 
20 ఇయర్స్ ఆఫ్ డి.డి.ఎల్.జె.
 
నిడివి : 2 ని. 49 సె.
హిట్స్ : 25,42,644

 దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే (డి.డి.ఎల్.జే) విడుదలై ఈ అక్టోబర్ 20కి ఇరవై ఏళ్లు. ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఫిల్మ్ ఇప్పటికీ ఒక సంచలనమే. షారుఖ్ ఖాన్, కాజోల్ ఈ చిత్రంతోనే మేడ్ ఫర్ ఈచ్ అదర్ హీరో హీరోయిన్లుగా బాలీవుడ్‌లో ప్రసిద్ధి చెందారు. ఎన్నారై అమ్మాయి, అబ్బాయి మధ్య నడిచే ప్రేమకథ ఇది. విషయం ఏమిటంటే డి.డి.ఎల్.జే. విడుదలై రెండు దశాబ్దాలు అయిన సందర్భంగా బాలీవుడ్ డెరైక్టర్ రోహిత్‌శెట్టి, దిల్‌వాలే టీమ్ కలిసి ఈ జ్ఞాపకాల వేడుకల వీడియోను రూపొందించారు. తప్పక చూడండి.
 
హ్యూమన్స్ ఇన్ 1000 ఇయర్స్
 
నిడివి : 4 ని. 06 సె.
హిట్స్ : 13,16,655

వచ్చే వెయ్యేళ్లలో మానవ జీవితం ఎలా ఉండబోతోందో, వివిధ రంగాలలో క్షణక్షణానికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ప్రభావం వల్ల మానవుల రూపురేఖల్లో, మానవ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో అంచనా వేస్తూ ‘అసాప్‌సైన్స్’ అనే యూట్యూబ్ చానెల్ ఈ వీడియోను రూపొందించింది! అసాప్‌సైన్స్ చెబుతున్న దానిని బట్టి మనిషి కళ్లు ఎర్రగా అవుతాయట. మనుషులు బక్కగా, చక్కగా, ఎత్తుగా, అందంగా మారిపోతారట. వాతావరణ మార్పులు, కృత్రిమ మేధస్సు కలిసి ఈ భూగోళం స్వరూపాన్నే మార్చేస్తాయట. ఇంకా చాలా విశేషాలున్నాయి. వీడియో చూడండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement