
వృథా చేయడం ఆడంబరమా?
ఆత్మీయం
వేటినైనా అవసరానికి మించి పోగు చేసి, వాడుకోకుండా పాడు చేయడమే వృథా. కొందరికి వృథా చేయడం అలవాటు. కొందరు సమయాన్ని వృథా చేస్తే, కొందరు డబ్బును వృథా చేస్తారు. నగరాలలో ఒక పక్క మంచినీటిని సరఫరా చేసే పైపులైన్లకు రంధ్రాలు పడి నీళ్లు వృథాగా పోతుంటాయి. మరోపక్క బిందెడు నీటికోసం వీధికుళాయిల వద్ద యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ధనవంతుల ఇళ్లల్లో జరిగే వేడుకలలో ఆహార పదార్థాలు, లైటింగ్‌కు ఎంతో విద్యుత్తు వృథా అయిపోతుంటుంది.
పెళ్ళిళ్లు, పేరంటాలు, విందువినోదాలలో ఆహారపదార్థాలు వృథా అవుతుంటాయి. ఆడంబరానికి పోయి అనేకరకాలైన పదార్థాలను తయారు చేయించడం, వడ్డించడం వల్ల అతిథులు సగం తిని సగం వదిలేస్తుంటారు. ఓ పక్క తిండి లేక ఆకలితో అలమటించే వాళ్లు... మరో పక్క లెక్కకుమించి వండి పారేసేవాళ్లు. ఆడంబరానికి పోయి వనరులను వృథా చేయడం క్షమించరాని నేరం.
రమణ మహర్షికి, గాంధీ మహాత్ముడికి దేనినైనా వృథా చేయడమంటే ఇష్టం ఉండేది కాదు. గాంధీ మహాత్ముడు పెన్సిల్‌ను పూర్తిగా అరిగి పోయేదాకా వాడేవారట. రాసేసిన నోటు పుస్తకాలలో పంక్తికీ పంక్తికీ మధ్య ఉన్న సందులలో రాసుకునేవారట. మన వద్ద వృథాగా పడి ఉన్న వస్తువు లేదా ఉపకరణం మరొకరి అవసరం తీర్చే పెన్నిధి కావొచ్చేమో ఎవరికి తెలుసు?