న్యూరాలజీ కౌన్సెలింగ్
మా అబ్బాయి వయసు 15 ఏళ్లు. ఒక ఏడాది నుంచి చాలా నీరసంగా కనిపిస్తున్నాడు. ఏ పని చేయాలన్నీ చాలా సమయం తీసుకుంటున్నాడు. ఒక్కోసారి చేతులు, మెడ ఒంకర్లు పోతున్నాయి. దీనికి పరిష్కారం ఎలా? - రమేశ్‌కుమార్, నిడదవోలు
ఈ వయసు పిల్లల్లో ‘విల్సన్స్ డిసీజ్’ అనే జబ్బు రావచ్చు. ఈ జబ్బుతో ఉన్నవారిలో చేతులు, కాళ్లు ఒంకర్లు పోవడం, మాట స్పష్టంగా రాకపోవడం, పోను పోను నీళ్లు కూడా మింగలేకపోవడం జరగవచ్చు. ఈ జబ్బును స్లిట్‌ల్యాంప్ పరీక్ష, కొన్ని రక్తపరీక్షలు, ఎమ్మారై స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ జబ్బు వల్ల మన శరీరంలోని ‘కాపర్’ అనే ఖనిజం ఎక్కువగా పేరుకుపోతుంది. దీనిని పెనిసిల్లమిన్ వంటి మందుల ద్వారా తగ్గించవచ్చు. చేతులు, కాళ్లు వంకర్లు తగ్గించడానికి కూడా మందులు వాడాలి. కొన్ని నెలల నుంచి సంవత్సరాల పాటు మందులు వాడాల్సి రావచ్చు. ఇది జన్యుపరమైన జబ్బు. కాబట్టి ఒకే కుటుంబంలో చాలా మంది పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మున్ముందు మేనరికపు సంబంధాల జోలికి వెళ్లకపోవడం మంచిది.
మా అబ్బాయి వయసు పదేళ్లు. ఆరో ఏడాది నుంచి నడవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు నేల మీద కూర్చొని పైకి లేవలేడు. కాళ్ల పిక్కలు రెండూ బాగా లావుగా అయ్యాయి. మా బాబు సమస్య ఏమిటి? అతడికి నయమయ్యే అవకాశం ఉందా? నాది, మా ఆయనది చాలా దగ్గరి సంబంధం. మాది మేనరికం. దాని వల్లనే ఈ సమస్య వచ్చిందంటున్నారు. మాకు తగిన సలహా ఇవ్వండి. - సువర్ణ, కోదాడ
మీ అబ్బాయి డీఎమ్‌డీ అనే జబ్బుతో బాధపడుతున్నాడు. ఇది చిన్నవయసులోనే ప్రారంభమై పదిహేను సంవత్సరాలకల్లా పూర్తిగా బలహీనమైపోయేలా చేస్తుంది. దీనికి సరైన మందులంటూ ఏవీ లేవు. ఇది మేనరికం వంటి దగ్గరి సంబంధాలు చేసుకున్నవారిలో జన్యుపరమైన కారణాల వల్ల వస్తుంది. జబ్బు తీవ్రత తగ్గించేందుకు కొంతమందిలో స్టెరాయిడ్స్ వాడవచ్చు. అయితే వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. ఫిజియోథెరపీ ద్వారా కండరాలు బలహీనం కాకుండా చేయవచ్చు. అయితే దగ్గరి సంబంధాలు చేసుకోకుండా ఈ జబ్బును నివారించాలి తప్ప, ఇది జన్యుపరమైన సమస్య కావడంతో ఒకసారి జబ్బు వచ్చిన తర్వాత నయం చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు.
డాక్టర్ మురళీధర్‌రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
దీర్ఘకాలం వాడితే ప్రతికూల ప్రభావం
రుమటాలజీ కౌన్సెలింగ్
నా వయసు 52 ఏళ్లు. నేను తొమ్మిది సంవత్సరాల నుంచి రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నాను. నొప్పి, వాపు తగ్గడం కోసం ప్రిడ్నిసలోన్ అనే మందును చాలా కాలం నుంచీ వాడుతున్నాను. రెండేళ్ల నుంచి నొప్పి పెరిగింది. ప్రతి నెలా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఉపయోగిస్తున్నాను. నెల కిందట నా ఎడమ కాలు ఎముక విరిగి, ఇంట్లో పనులు చేసుకోడానికి ఇబ్బంది కలుగుతోంది. ఉద్యోగం కూడా మానేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యాధికి స్టెరాయిడ్స్ కాకుండా మెరుగైన చికిత్స ఏదైనా ఉందా? - నాగేశ్వరరావు, హైదరాబాద్
రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే మన ఒంట్లో ఉండే రక్షణ వ్యవస్థ మన కణాలనే గుర్తించే సమర్థతను కోల్పోయి మన శరీర అవయవాలపైనే దాడి చేస్తుంది. దాంతో ఈ వ్యాధి వస్తుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధి. దీనిని ప్రారంభదశలోనే గుర్తించి సకాలంలో చికిత్సను ప్రారంభించాలి. నిపుణులు వ్యాధి తీరును బట్టి, తీవ్రతను బట్టి చికిత్స ప్రారంభిస్తారు. అనేక చికిత్స విధానాలు ఉన్నాయి. స్టెరాయిడ్స్ అనేవి చికిత్స విధానాలలో ఒక భాగం. వీటిని దీర్ఘకాలం వాడితే చాలా రకాల ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి షుగర్, నొప్పి, ఎముకలు బలహీనంగా కావడం... దాంతో తేలిగ్గా విరిగిపోవడం, కంటి శుక్లం, అంటువ్యాధులకు తేలిగ్గా లోనుకావడం వంటివి ముఖ్యమైనవి.
కాబట్టి చికిత్స చేసే డాక్టర్లు స్టెరాయిడ్ స్పేరింగ్ డ్రగ్స్ మందులను ఉపయోగిస్తారు. వ్యాధి నిర్ధారణ జరగగానే వీటిని ఉపయోగించాలి. వీటితో పాటు చిన్న చిన్న మోతాదుల్లోనే స్టెరాయిడ్స్‌ను మూడు నుంచి ఆర్నెల్ల వరకు మాత్రమే ఉపయోగించాలి. ఈ స్టెరాయిడ్ స్పేరింగ్ మందుల వల్ల వ్యాధి తీవ్రతను, తీవ్రమైన వ్యాధి వల్ల కలిగే నొప్పి, వాపు, క్లిష్టమైన సమస్యలను అరికట్టవచ్చు. ఇటీవల అనేక ఆధునిక చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని బయొలాజిక్స్ అంటారు. తొలి ప్రాథమ్య ఔషధాలకు లొంగని వ్యాధిగ్రస్తుల్లో వీటిని ఉపయోగిస్తారు. ఈ మందుల వల్ల సత్వర ఉపశమనం కలుగుతుంది. త్వరగా స్టెరాయిడ్స్ వాడకాన్ని తగ్గించుకునే అవకాశం లభిస్తుంది.
డాక్టర్ విజయ ప్రసన్న పరిమి, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్
కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్