సరికొత్త రకం అరటిపండు
జపాన్ శాస్త్రవేత్తలు సరికొత్త రకం అరటిపండు వంగడాన్ని తయారు చేశారు. దీని తొక్క ఎంత పలచగా ఉంటుందీ అంటే.. ఒలవకుండానే నమిలి మింగేసేటంత! మాంగీ బనానా అని పిలుస్తున్న ఈ వినూత్న అరటిపండు ఒక్కొక్కదాని ఖరీదు రూ.400 వరకూ ఉంటోందట! ఉష్ణమండల ప్రాంతాల్లో మాత్రమే పండే అరటిపండును ప్రత్యేక పద్ధతుల ద్వారా ఇలా మార్చేసినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డి అండ్ టీ ఫారమ్స్ అనే సంస్థ జపాన్‌లో వీటిని పండిస్తోంది. ఉష్ణమండల ప్రాంతాల్లో ఈ పంటను సుమారు 26 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద పండిస్తూంటే.. జపనీయులు మాత్రం ముందుగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మొక్కలు పెరిగేలా చేసి ఆ తరువాత ఉష్ణోగ్రతలను 26 డిగ్రీలకు చేరుస్తున్నారు. ఫ్రీజ్.. థా అవేకనింగ్ అనే ఈ పద్ధతి కారణంగా పంట చాలా వేగంగా పెరుగుతుందట.
అంతేకాకుండా తొక్క పూర్తిస్థాయిలో ఎదగకుండా పలచగానే ఉండిపోతుంది. ఇంకోలా చెప్పాలంటే.. తొక్క మగ్గక ముందే.. లోపలి పండు పక్వానికి వస్తుందన్నమాట. జన్యుపరమైన మార్పులేవీ చేయకుండా.. క్రిమికీటక నాశినులను అస్సలు వాడకుండా తాము ఈ కొత్త రకం అరటిపండును పండిస్తున్నామని డీ అండ్ టీ ఫారమ్స్ చెబుతోంది. అరటిపండుతోపాటు దాని తొక్కలోనూ బోలెడన్ని పోషకాలు ఉంటాయని అందరికీ తెలిసినప్పటికీ మనం తొక్కను తినేందుకు ఇష్టపడం. జింక్, మెగ్నీషియం, విటమిన్ బీ6, ట్రైప్టోఫాన్‌లతోపాటు ఒక్కో పండులో దాదాపు 24.8 గ్రాముల చక్కెరలు ఉంటాయని.. సాధారణ అరటిపండులోని చక్కెరలు కేవలం 18 గ్రాములు మాత్రమేనని శాస్త్రవేత్తలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment