
కథ.. జరిగిందే కానక్కర్లేదు... జరగబోయేది కూడా కథే. జయం కోసం పోరాడిన కథ అంతులేని కథ అవుతుంది. జయప్రదం అయిన కథ జయకథ అవుతుంది. నాలుగు సినిమాల్లో కనపడబోతోంది. శ్రీదేవితో పోటీ పడబోతోంది. జయసుధకు సానుభూతి తెలుపుతోంది. ‘కోమలంగా ఉంటాను.. కమిలిపోతాను’ అనుకోవద్దు.. సవాళ్లు ఎదురైతే ‘బస్తీ మే సవాల్’ అంటుంది! అబ్బో... చాలా రోజుల తర్వాత కనిపించింది మనకి ఎంతో సంతోషంగా కనబడింది. ఎంతో ఆనందంగా మాట్లాడింది. ఎంజాయ్... జయకథ!
► మీ ఏజ్ ఫిఫ్టీ ప్లస్.. కెరీర్ ఏజ్ ఫార్టీ. రాజమండ్రి టు చైన్నై.. చెన్నై టు హైదరాబాద్, యూపీ.. లైఫ్‌లో బోలెడన్ని మలుపులు. ఆలోచిస్తే ఏమనిపిస్తోంది?
ఆర్టిస్ట్ అవ్వాలని అనుకోలేదు. అసలు ఏం అవాలో కూడా ప్లాన్ చేసుకోలేని ఏజ్‌లో అనుకోకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చీ రావడంతోనే సక్సెస్. స్టార్స్‌తో సినిమాలు, మంచి మంచి క్యారెక్టర్లు.. 40 ఇయర్స్ క్రితం స్టార్ట్ అయిన జర్నీ ఇప్పటికీ గ్యాప్ లేకుండా కంటిన్యూ అవుతోంది. నటిగా, రాజకీయ నాయకురాలిగా ప్రజలు నా పట్ల చూపించిన ప్రేమాభిమానాలు వెల కట్టలేనివి. ఆ దేవుడి దయ, నా కష్టమే నన్నింతదాకా తీసుకొచ్చాయి. ఐయామ్ హ్యాపీ.
► మీరంటే ముందు గుర్తొచ్చేది ‘సాగర సంగమం’. మీ కెరీర్‌లో కీ రోల్ ప్లే చేసిన ఆ సినిమా ఒప్పుకున్నప్పుడు ‘వద్దు’ అన్నవాళ్లు ఉన్నారా?
అప్పటికి నేను కమర్షియల్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాను. ‘ఇలాంటి టైమ్‌లో నువ్వు మాధవి (‘సాగర సంగమం’లో జయప్రద పాత్ర పేరు) లాంటి పాత్ర ఒప్పుకుంటే కెరీర్‌కి డ్యామేజ్ అవుతుంది’ అని కొందరు అన్నారు. కానీ, నేనా మాటలను పట్టించుకోలేదు. అప్పటికే విశ్వనాథ్ గారితో ‘సిరిసిరి మువ్వ’ సినిమా చేశా. ఆ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. విశ్వనాథ్‌గారిని నేను వెల్‌విషర్‌లా భావిస్తా.
అందుకని, ఆయన నా కెరీర్‌కు ఉపయోగపడే క్యారెక్టరే ఇస్తారని నమ్మకం. ఆ నమ్మకంతో ‘సాగర సంగమం’ చేశాను. నా లైఫ్‌లో ‘స్పెషల్ మూవీస్’ చాలా ఉన్నాయి. వాటిలో ఈ సినిమా ఒకటి.. క్లాసిక్. ఇప్పటికి 30 ఏళ్లకు పైనే అయినా ఇంకా మాట్లాడుతున్నారంటే అది ఆ సినిమా గొప్పదనం. మొన్నా మధ్య అమెరికా వెళ్లాను. అక్కడవాళ్లు ఈ సినిమా గురించే మాట్లాడారు. యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. నేను చేసినవాటిలో ‘మాధవి ఈజ్ వన్నాఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్’.
► విశ్వనాథ్‌గారు ‘శంకరాభరణం’ మొదలుపెట్టినప్పుడు మంజు భార్గవి రోల్‌కి మిమ్మల్ని తీసుకోలేదని బాధపడ్డారట?
అవును. ‘శంకరాభరణం’ కోసం ఫోటోషూట్ చేసి, విశ్వనాథ్‌గారు నాకు చూపించినప్పుడు పది నిమిషాలు కామ్‌గా ఉండిపోయాను. మంజు భార్గవి చేసిన పాత్రకు డైరెక్టర్‌గారు మనల్ని ఎందుకు అనుకోలేదు? అని బాధపడ్డాను. ‘సార్.. ప్లీజ్ ఇంకోసారి ఆలోచిస్తారా?’ అన్నాను. ఆ సినిమా నాకు రాకపోవడం ఏదో మిస్ అయిపోయినట్టు అనిపించింది. కానీ, అప్పటికే అన్నీ ఫిక్స్ అయిపోయాయి.
చేసే సినిమా మీద మన పేరు రాసి పెట్టి ఉండాలేమో అనుకుని, సర్ది చెప్పుకున్నా. కానీ, నేను బాలీవుడ్‌కు వెళ్లినప్పుడు అక్కడ ‘సుర్ సంగమం’ పేరుతో ‘శంకరాభరణం’ను రీమేక్ చేశారు. అందులో నటించడం ద్వారా ‘శంకరాభరణం’లో క్యారెక్టర్ చేయాలనే నా కోరిక తీరిపోయింది. అలాగే ‘జీవన జ్యోతి’లో వాణిశ్రీగారి క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. అయితే ఆ పాత్ర చేసేంత ఏజ్ నాకప్పుడు లేదు. సినిమాలో వాణిశ్రీగారు ఆ బొమ్మను పట్టుకుని వెళ్లడం నాకు నచ్చేది.
ఆమె బ్రిలియెంట్ యాక్ట్రస్. ఆ సినిమా చేయలేదని బాధగా ఉండేది. అనుకోకుండా ఆ సినిమాను హిందీలోకి విశ్వనాథ్‌గారు రీమేక్ చేయడం, అందులో నేను నటించడంతో ఆ కొరత కూడా తీరిపోయింది. ఇక్కడ వయసు సరిపోక వదిలేసిన ఆ క్యారెక్టర్‌ను కొంచెం ఏజ్ పెరిగాక చేశాను.
► సో.. మీరేదైనా బలంగా కోరుకుంటే అది నెరవేరుతుందేమో.. ఇంకా ఇలాంటివి ఏవైనా జరిగాయా?
అవును.. బలంగా అనుకుంటే జరుగుతుంది. ఇంకో ఉదాహరణ ఏంటంటే.. హిందీ సినిమా ‘ఖల్‌నాయక్’ షూటింగ్ కొన్నాళ్లు ఢిల్లీలో జరిగింది. షూటింగ్ స్పాట్‌కి పార్లమెంట్ ముందు నుంచి వెళ్లేవాళ్లం. ఆ ప్లేస్ రాగానే కారు ఆపి, పార్లమెంట్‌కి దండం పెట్టేదాన్ని. ఎంతోమంది మహానుభావులు ఉండే చోటు కాబట్టి, అలా చేసేదాన్ని. నాతో పాటు నా బ్రదర్ రాజబాబు ఉండేవాడు.
నేను దండం పెట్టిన ప్రతిసారీ ‘ఏదో రోజు నువ్వు కూడా తప్పకుండా పార్లమెంట్‌కు వెళతావు’ అనేవాడు. అప్పుడు ఏదో మూల ‘సమాజానికి మన వంతుగా ఏదైనా చేయాలి’ అనే ఫీల్ కలిగేది. అది కూడా జరిగింది. మొదటిసారి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టినప్పుడు నమ్మలేకపోయాను. పార్లమెంట్‌ను టచ్ చేసిన వెంటనే నా ఒంట్లో ఒక తెలియని గగుర్పాటు కలిగింది. థ్రిల్ ఫీలయ్యాను.
‘చాలామందికి రాని అవకాశం మనకు వచ్చింది. ఎంతో బాధ్యతగా ఉండాలి’ అనుకున్నా. పార్లమెంట్‌లో ‘కిత్తూరు చెన్నమ్మ’ స్టాచ్యూ ఉంది. కన్నడ దేశానికి చెందిన చెన్నమ్మ స్వాతంత్య్రం కోసం పోరాడిన మొదటి వీర వనిత. ఆన్‌స్క్రీన్‌లో ఆమె క్యారెక్టర్ చేసే చాన్స్ వస్తే బాగుండు అనుకున్నా. అది కూడా నెరవేరింది. ఐదేళ్ల క్రితం కన్నడంలో వచ్చిన ‘సంగోలి రాయన్న’లో ఆ క్యారెక్టర్ చేశా. బ్రిటిషర్స్‌తో ఫైట్ చేసిన ఒక దేశభక్తురాలి పాత్ర చేయడం నా అదృష్టం.
► పైకి సాఫ్ట్‌గా కనిపిస్తారు. సమస్యలు ఎదురైనప్పుడు, ఎవరైనా తేలికగా మాట్లాడినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది?
సినిమాల్లోకి రాకముందు.. వచ్చాక చాలా సంవత్సరాలు నేను సాఫ్ట్ పర్సన్‌నే. బాగా సిగ్గుపడేదాన్ని. ఎవరితో అయినా మాట్లాడటమంటే నాకు అది పెద్ద విషయం. తడబడిపోయేదాన్ని. భయస్తురాల్ని.
ఎంత భయం అంటే.. పక్క గదిలో లైట్ వేయమని అమ్మ చెబితే. ‘అమ్మా నువ్వు ఉన్నావా? ఇక్కడే ఉన్నావా?’ అంటూ ఆమెతో మాట్లాడుతూ వెళ్లి లైట్ వేసేదాన్ని. ఒకవేళ అమ్మ నుంచి సమాధానం రాలేదంటే పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చేసేదాన్ని. అది అప్పటి జయప్రద. ఇప్పటి జయప్రద వేరు. మొన్నా మధ్య యూపీలో అజమ్ ఖాన్ (రాజకీయ నాయకుడు)పై ఎలా విరుచుకుపడ్డానో చూశారుగా! అనవసరంగా నన్నంటే అలానే చేస్తా.
సినిమాల్లో ఓవర్ వర్క్ ఓ స్ట్రెస్. రాజకీయాల్లోకి వెళ్లడం ఓ స్ట్రెస్. క్రిమినల్ పీపుల్‌తో ఫైట్ చేయడం ఇంకో స్ట్రెస్. ‘ఇలాంటి వాతావరణంలోనే నువ్వు పని చేయాలి’ అన్నప్పుడు రాటుదేలాలి. నా ప్లేస్‌లో ఇంకో అమ్మాయి ఉండి ఉంటే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయేదేమో. రాజకీయాలకు దూరంగా ఉండేదేమో. కానీ, అనుభవాలు నాలో పరిణతి తెచ్చాయి. ఇప్పుడు నేను ఏ సమస్యనైనా అధిగమించగలను. ఎవరినైనా ఎదుర్కోగలను.
► ‘అంతు లేని కథ’లో అన్నాచెల్లెళ్లను.. మొత్తం కుటుంబాన్ని ఈదే అమ్మాయిగా నటించారు. రియల్ లైఫ్‌లో బ్రదర్, సిస్టర్స్, .. ఇలా కుటుంబానికి అండగా ఉన్నారేమో..?
నా బ్రదర్, సిస్టర్స్ సపోర్ట్ లేకపోతే నేను లేను. వాళ్లు నా కోపాన్ని భరిస్తారు. నాన్సెన్స్ మాట్లాడితే సహిస్తారు. నా కష్టసుఖాలను పంచుకోవడానికి నా మనుషులు ఉండాలి. నా కుటుంబం నాకు పెద్ద అండ. మా అమ్మగారు వండర్‌ఫుల్. ప్రతి రోజూ షూటింగ్ వెళ్లేటప్పుడు ఆమె ఆశీర్వాదాలు తీసుకుంటేనే నాకు ఆ రోజు పరిపూర్ణం అనిపిస్తుంది.
కెరీర్ స్టార్టింగ్‌లో తను కూడా నాతో వచ్చేది. ఎండల్లో నాతో పాటు లొకేషన్లో ఉండేది. ఇదిగో ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు కూడా నాతో కబుర్లు చెబుతూ కూర్చుంది. సినిమాలు, పాలిటిక్స్ కోసం నేను వేరే రాష్ట్రాలు వెళతాను కదా. అప్పుడు నా ఫొటో దగ్గర నిలబడి ‘ఎప్పుడు వస్తావ్. ఎన్నాళ్లయింది చూసి’ అంటుంటుంది. నా లైఫ్‌లో మా ఫ్యామిలీ మెంబర్స్‌ది కీ రోల్.
వేరే ఇంటి నుంచి మా ఇంట్లోకి కోడళ్లుగా, మరదళ్లుగా అడుగుపెట్టిన ఆడపిల్లలను మేం మా ఇంటి పిల్లలానే చూస్తాం. నా వాళ్లను చూడటం బర్డన్‌లా ఫీలవ్వడంలేదు. బాధ్యత అనుకుంటున్నా. ఆ బాధ్యత ఆనందంగా ఉంటుంది. ఢిల్లీలో మాకు ఫ్యాక్టరీలు ఉన్నాయి. యూపీలో కాలేజీలు, ట్రస్ట్ వ్యవహారాలు. ఇవన్నీ మావాళ్లు కూడా చూసుకుంటారు.
► ఒకప్పుడు మీరు, జయసుధగారు, శ్రీదేవిగారు.. పోటాపోటీగా సినిమాలు చేశారు.. చాలా గ్యాప్ తర్వాత శ్రీదేవిగారు కూడా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడూ పోటీ ఉందా?
ఇప్పుడూ పోటీయే. అది లేకపోతే మజా ఉండదు. అప్పట్లో మేం పోటీపడింది వృత్తిపరంగానే. వ్యక్తిగత పోటీలు ఉండవు. ఒకవేళ మళ్లీ వాళ్లతో కలసి సినిమాలు చేసే అవకాశం వస్తే, ‘ఐయామ్ రెడీ’.
► తెలుగు అమ్మాయి యూపీలో స్టార్ పొలిటీషియన్ కావడం గ్రేట్. రాజకీయాలను డీల్ చేయడం అంత ఈజీ కాదు కదా?
కచ్చితంగా కాదు. నా లైఫ్‌లో అన్నీ ప్లస్‌లు అని చెప్పలేను. మైనస్‌లు అని చెప్పలేను. నేను ప్లాన్ చేసుకుని పాలిటిక్స్‌లోకి వెళ్లలేదు. 1994లో ఎన్టీఆర్‌గారు ఆహ్వానించారు. నా ఐదేళ్ల వయసులో ఆయన్ను స్క్రీన్ మీద చూసి, ఫ్యాన్ అయ్యాను. ఆయనతో మంచి మంచి సినిమాలు చేశాను. ఎన్టీఆర్‌గారంటే నాకు చాలా గౌరవం.
మా మధ్య మంచి బాండింగ్ ఉండేది. అందుకే వెళ్లాను. ఎంతో బాధ్యతగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఎన్టీఆర్‌గారు సీయం కావడంలో నా వంతు పాత్ర ఉంది. ఆయన పిలిచినప్పుడు నేను ఏ పదవీ ఆశించి వెళ్లలేదు. ఎన్టీఆర్‌గారికి నా మీద ఉన్నంత అభిమానాన్ని నేను చంద్రబాబు నాయుడుగారి నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేను. అయితే గుర్తింపు రాకపోతే బాధ ఉంటుంది. బేసిక్‌గా నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది.
కావాలంటే 24 గంటలు కష్టపడతా. కానీ, దానికి తగ్గ గుర్తింపు రాకపోతే మాత్రం హర్ట్ అవుతా. అలాంటి బాధలోనే ఇక్కడ డ్రాప్ అయ్యి, యూపీ వెళ్లాను. యూపీలో పాలిటిక్స్ నాకు బోనస్. అక్కడ రెండుసార్లు పబ్లిక్ నుంచి గెలవడం ఆనందంగా ఉంది. నా నియోజకవర్గంలో ముస్లిమ్స్ ఎక్కువ. వాళ్లు కూడా నన్ను వాళ్ల ఆడపడుచులా భావించి, గెలిపించారు. అది ఆనందపడాల్సిన విషయం.
► అమ్మవారి పాత్రలు చేశారు కదా.. మరి దసరా సందర్భంగా అమ్మవారిని ఏ విధంగా పూజించారు?
నాకు దైవభక్తి ఎక్కువ. శివుడు అంటే చాలా ఇష్టం. అలాగే, కాళీమాతను ఎక్కువగా పూజిస్తుంటాను. కోల్‌కత్తా దగ్గర దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్‌కి వెళుతుంటాను. కాళీ ఘాట్‌కి వెళతాను. ఢిల్లీలో కాళీ మాత టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్లి అమ్మవారిని పూజిస్తాను. నవరాత్రుల్లో నేను తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటాను. రోజంతా ఓన్లీ ఫ్రూట్స్. అది కూడా మితంగానే. తొమ్మిదో రోజు చండీ హోమం కంపల్సరీ.
► రాజకీయాల్లో ఇప్పుడు మీరేంటి?
నేను లేను అని చెప్పను గానీ... ఐ యామ్ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ పార్టీ! ఈలోపు మంచి సినిమాలు చేయాలనుకుంటున్నా. 2019లో కదా (ఎన్నికలు)! ఇంకా టైముంది.
► మీరు చేరబోయే పార్టీ తెలుగు పార్టీ అయితే బాగుంటుందని మీ అభిమానులు కోరుకుంటున్నారు. వాళ్లకు దగ్గరగా ఉంటారని!!
నాక్కూడా ఇక్కడ ఉండడమే ఇష్టం. అక్కడి (ఉత్తర ప్రదేశ్)కి వెళ్లి, మళ్లీ ఆజమ్‌ఖాన్ (రాజకీయ నేత)తో గొడవలు, ఏడుపులు... అబ్బబ్బా! ఇక చాలు. అతనితో చాలా పోరాడాను. సో, ఐ డోంట్ నో! ఇప్పుడు మళ్లీ నేనేదైనా చెబితే హెడ్‌లైన్స్‌కి ఎక్కుతుంది.
కొంచెం ఆలోచించుకోనివ్వండి. నాకు మంచి ఆలోచనలు ఉన్నాయి. తప్పకుండా అంతా మంచే జరుగుతుంది. రాజకీయాల్లో ఉన్నప్పటికీ, నేను సీరియస్‌గా సిన్మాలు చేయడం ప్రారంభించాను. మళ్లీ తెలుగులో మంచి సినిమాలు చేయాలనేది నా కోరిక.
► అసలు తెలుగులో ఎందుకు గ్యాప్ తీసుకున్నారు?
మలయాళం, కన్నడ, తమిళ సినిమాలు చేస్తున్నాను. ఈ సంవత్సరం సౌత్‌తోపాటు బెంగాలీ, పంజాబీ సినిమాలు కూడా చేస్తున్నాను. అక్టోబరులో నేను చేసిన నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. హిందీలో రెండు సినిమాలు చేస్తున్నా. కానీ, తెలుగులోనే గ్యాప్. మన తెలుగుపిల్లని మనం ఆదరించాలి అనే ఫీలింగ్ ఇండస్ట్రీలో లేదేమో అనిపించింది.
అయినా జనరేషన్ ఛేంజ్ అవుతోంది. నన్నెందుకు తీసుకోవాలనుకుంటారు. ఆశించడం తప్పే. కాకపోతే వేరే భాషల్లో సినిమాలు చేస్తున్నప్పుడు మన తెలుగు సినిమాలు చేయాలని ఉంటుంది. ఒక మంచి సినిమాతో ఒక తెలుగు అమ్మాయిగా నా క్యారెక్టర్‌ను తెలుగు ప్రేక్షకకులు మెచ్చుకోవాలనే తపన ఉంటుంది కదా. సరిగ్గా అప్పుడే ‘శరభ’కి అడిగారు. ఇందులో నాది మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్.
ఒక అమ్మాయిని ఎలా పెంచాలి? దుష్టశక్తుల నుంచి ఎలా కాపాడాలి? అనేది మెయిన్ పాయింట్. అందరికీ నచ్చే సినిమా అవుతుంది. డైరెక్టర్ నరసింహారావుగారు మంచి కథతో అద్భుతంగా తీశారు. ఎక్కువ బడ్జెట్ అయింది. అయినా రాజీపడలేదు. మంచి స్టోరీ, క్యారెక్టరైజేషన్స్, గ్రాఫిక్స్‌తో సినిమా ఫుల్‌మీల్స్‌లా ఉంటుంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా నేర్చుకున్నా.
► ఇండస్ట్రీలో మీకు జయసుధగారు క్లోజ్ ఫ్రెండ్. ఈ మధ్య ఆమె భర్త చనిపోయినప్పుడు మీరు వెళ్లి పరామర్శించారా?
విషయం వినగానే వెళ్లాను. మా ఇద్దరి మధ్య ఉన్నది జస్ట్ ఫ్రెండ్‌షిప్ మాత్రమే కాదు. మాటల్లో చెప్పలేని ఓ ఎటాచ్‌మెంట్ ఉంది. నితిన్ కపూర్ (జయసుధ భర్త) మంచి హ్యూమన్‌బీయింగ్. అయితే, ఆయన లైఫ్‌ను అర్థం చేసుకోలేదేమో అనిపించింది. ఇంకొక్క అవకాశం ఆయన ఇచ్చి ఉండాల్సింది అనేది నా ఫీలింగ్. బాధపడాల్సిన విషయం ఏంటంటే... జయసుధ తప్పు లేకుండా ఆమె లైఫ్‌లో ఏదో కోల్పోయింది.
► మీరు చివరిసారిగా నితిన్‌గారిని ఎప్పుడు కలిశారు?
ఆయన చనిపోవడానికి నెల ముందు మాట్లాడాను. చాలాసేపు మాట్లాడుకున్నాం. జీవితంలో అందరూ సుఖంగా ఉండలేరు. ఎత్తుపల్లాలు ఉంటాయి. ఆ మూమెంట్‌లో మనకి సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకపోతే ఇలాంటి పరిణామాలే వస్తాయి. అలాంటప్పుడు మనం ఓవర్ బిజీగా ఉండాలి. దేవుణ్ణి తలచుకోవాలి. సమస్యలను దాటాలి.
► అదేంటీ.. వంద సినిమాలు చేశారు. ఇప్పుడు స్టూడెంట్‌లా నేర్చుకున్నారా?
మనం ఎప్పటికీ స్టూడెంట్స్‌మే అని నా ఫీలింగ్. ‘ఇది నేర్చుకున్నాం.. ఇంకా నేర్చుకోవడానికి ఏమీ లేదు’ అనేది ఉండదు. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎడిటింగ్ అంటే ఏంటో తెలుసుకున్నా. టెక్నాలజీ గురించి చాలా విషయాలు తెలిశాయి. భవిష్యత్తులో దర్శకత్వంవైపు అడుగులు వేస్తే నాకు హెల్ప్ అవుతుంది.
► అంటే.. డైరెక్టర్ కావాలనే ఆలోచన ఉందా?
మంచి కథ కోసం వెయిటింగ్. దొరకగానే చేస్తాను.
► ఫిల్మ్స్ అండ్ పాలిటిక్సేనా.. వేరే ఏమైనా ఆలోచనలు?
ఆల్రెడీ ప్రొడక్షన్‌లో ఉన్నాం. చిన్నప్పుడు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నా. డ్యాన్స్‌ని, నన్నూ వేరు చేయలేం. ఓ డ్యాన్స్ బ్యాలే ఉంది. యూపీలో రెండు కాలేజీలు ఉన్నాయి. జయప్రద ఛారిటబుల్ ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ద్వారా సహాయ కార్యక్రమాలు చేస్తాం. ప్రస్తుతానికి ఇవే.
► ఫైనల్లీ... ఇంతకు ముందు మాట్లాడుతున్నప్పుడు మీరేదైనా బలంగా అనుకుంటే అది జరుగుతుందని చెప్పుకున్నాం కదా.. మరి.. ఇంకా మనసులో ఏమైనా బలమైన లక్ష్యాలు?
పెద్ద పెద్ద లక్ష్యాలు లేవు. నేను బాలసుబ్రహ్మణ్యంగారికి గ్రేట్ ఫ్యాన్. పాటలు పాడటానికి ఆయన రాజమండ్రి వచ్చేవారు. అప్పట్లో ఆయనకు ‘ది ఎంగెస్ట్ ఫ్యాన్స్’ అంటే నేనూ, నా బ్రదర్. రెండు గులాబీ పూలు పట్టుకుని ఆయనకివ్వడానికి స్టేషన్ దగ్గర వెయిట్ చేసేవాళ్లం.
‘నేను మీతో పాడాలి. అది కూడా స్టేజ్ మీదే పాడాలి’ అని ఆయనతో అనేదాన్ని. పెద్దయ్యాక పాడుదువుగాని అని ఓదార్చేవారు. చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నా. టీనేజ్‌లో సినిమాల్లోకొచ్చేసాను కాబట్టి, సంగీతం ప్రాక్టీస్ చేయడానికి తక్కువ టైమ్ దొరికింది. అప్పట్లో ‘సీతారాములు’లో ఓ పాటలో కొన్ని మాటలు మాట్లాడాను.
ఆ మధ్య మేం తెలుగు ‘ఇష్క్’ని తమిళంలో రీమేక్ చేశాం. ఆ సినిమాలో ఒక పాట పాడాను. ఇప్పుడు పాట పాడటం అప్పటి రోజులతో పోలిస్తే పెద్ద కష్టమేం కాదు. టెక్నాలజీ సాయంతో ఏ పాటైనా మనం పాడుకోవచ్చు. తెలుగు సినిమాకి పాడాలనే కోరిక బలంగా ఉంది.
► ఇది కూడా నెరవేరుతుంది మేడమ్..
అవును. నాకూ ఆ నమ్మకం ఉంది (నవ్వేస్తూ).
– డి.జి. భవాని
Comments
Please login to add a commentAdd a comment