ఆలయంలో వాహనాలు దర్శించిన భక్తులు తర్వాత తప్పక దర్శించాల్సిన ప్రదేశం కల్యాణమండపం. లోకకల్యాణం కోసం స్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం.. లేక వార్షిక కల్యాణం కోసం ఈశాన్యంలో ఎత్తైన మండపాన్ని... కొన్ని చోట్ల రెండవ ప్రాకారంలో కల్యాణమండపాన్ని నిర్మిస్తారు. కల్యాణమండపం మధ్యలో నాలుగు స్తంభాలతో కల్యాణవేదిక ఉంటుంది. నాలుగు వేదాలకు.. యుగాలకు ప్రతీకలు ఆ నాలుగు స్తంభాలు. కల్యాణం జరిగే ఎత్తైన వేదికపై ఉత్సవమూర్తులనుంచి జరిపే కల్యాణాన్ని దర్శించడం ప్రతి భక్తుడి విధి.
ఎందుకంటే ఆ కల్యాణం లోకశాంతి గురించి జరుగుతుంది కనుక. పరోపకారం..పరహిత చింతన మనం అలవర్చుకోవాల్సిందిక్కడే. ఆలయంలో అనేక మండపాలు నిర్మించాలని ఆగమ, శిల్పశాస్త్రాలు చెబుతున్నాయి. స్వామివారి అభిషేకానికి స్నపనమంటపం.. నాట్యం జరిపే నత్తమంటపం.. దేవతా గీతాలను ఆలపించే గేయమంటపం.. సుశ్రావ్యంగా వాద్యాలను మ్రోగించే వాద్యమంటపం.. దేవస్థానంలోని స్వామి వైభోగానికి తగినట్లు ఆస్థానమంటపం.. నిత్యం అగ్నిపూర్వకంగా హవిస్సులు సమర్పించే యాగమంటపం.. పూజా, ఉత్సవాలకు మాలలు కూర్చే పుష్పమంటపం.. ప్రత్యేక సందర్భాలలో వేంచేసే విజయమంటపం.. నైవేద్యం జరుగుతోందన్న విషయాన్ని తెలిపే ఘంటామండపం.
గుడిని చుట్టే భక్తులకు ప్రదక్షిణమంటపం.. ప్రత్యేక సందర్భాలలో జపతపాది కార్యాలకు జపతపోమంటపం.. స్వామివారు ఊరేగింపు మధ్యలో ఉపశమనం కోసం ఏర్పరచే ఉద్యానమంటపం... పూజాదికాలకు ఉపయోగించే శ్రీచూర్ణ, కష్ణగంధ,సుగంధాలను నూర్చే పరిమళ మండపం.. ఆగమాలను పఠించే జరిపే ఆగమమండపం.. శాస్త్రాలను చదివి భక్తులకు తెలియజెప్పే అధ్యయనమండపం.. ఇంతేగాక ఉత్సవమూర్తులను అలంకరించే అలంకారమంటపం.. వసంతోత్సవం కోసం వసంతమంటపం.. ప్రత్యేక ఉపచారాల నిమిత్తం ఉపచారమంటపం.. ఊయలపై ఊగే డోలారోహణమంటపం.. భక్తులను ఆధ్యాత్మిక పరులుగా తీర్చిదిద్దే దీక్షామంటపం
ఉత్సవాల్లో ధ్వజాన్ని ఎగురవేసే ధ్వజారోహణమంటపం.. భక్తులు తమ బరువంత ద్రవ్యాన్ని మొక్కుకుని తూగి సమర్పించే తులాభారమండపం.. దేవతావస్త్రాలను భద్రపరిచే వస్త్రమండపం.. భక్తులు భజనలు చేసుకునే భజనామండపం.. ఆయుధాగారమండపం.. అదేవిధంగా నూరుస్తంభాల.. వేయిస్తంభాలమండపాలు..సాలుమండపాలు మొదలైనవి భక్తులవసతి కోసం ఏర్పరచేవి ఇంకా చాలా మండపాలు ఉన్నాయి. ఈ మండపాలన్నీ భక్తుల సౌకర్యార్థం విశాలంగా.. అన్నివైపులా భక్తులు చూసే విధంగా ఎటువంటి గోడలు లేక కేవలం స్తంభాలతో ఏర్పాటు చేయమని.. మండపస్తంభాలపై భక్తిభావం పెంపొందించే దేవతామూర్తులను.. పురాణఘట్టాలను.. చెక్కి భక్తులకు కనువిందు చేయమని ఆగమ, శిల్పశాస్త్రాలు ప్రబోధిస్తున్నాయి. ఇలా మండపం భక్తులకు మరో ఆలయమే.
కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య
ఆగమ, శిల్పశాస్త్ర పండితులు
Comments
Please login to add a commentAdd a comment