ఆంధ్రప్రదేశ్ రాజకీయ రణరంగంలో చంద్రబాబు కులాధిపత్యం, డబ్బు, మాఫియా, మద్యంతో ముంచెత్తుతున్నారు.అక్రమ మార్గంలో నల్లడబ్బును రాజకీయాల్లోకి ప్రవహింప జేస్తున్నారు. నీతి, నియమాలను పక్కనబెట్టి అబద్ధా లకు రంగులు పూసి గాలి పటాలు ఎగురవేస్తున్నాడు. తమకు ఓటు వేయని వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. చంద్రబాబు కులాధిపత్య భావం పుత్రవ్యామోహం, ధన కాంక్ష, నియంతృత్వ స్వభావం, అనృత భాషణ ఆంధ్ర ప్రజలు అర్ధం చేసుకొంటున్నారు. ఈ మోసపూరిత ప్రభుత్వాన్ని దించి వేయాలని కంకణం కట్టుకొంటున్నారు. ఏపీలోని సంపదనంతా మల్టీనేషనల్ కంపెనీలకు అమ్ముకొంటున్న చంద్రబాబు.. కోస్తాతీరాన్ని ఇసుక మాఫియా చేతుల్లో పెట్టిన చంద్రబాబు, కులతత్వం ఊబిలోకి గ్రామాలను నెట్టిన చంద్రబాబు.. రౌడీలకు స్వేచ్ఛనిచ్చి స్త్రీల మానప్రాణాలను తీసిన చంద్రబాబు ఇక పాలించడానికి తగడని ప్రజలు నిర్ణయించారు.
చంద్రబాబు అన్ని వ్యవస్థల్ని సొంత సామాజిక వర్గానికి ధారాదత్తం చేస్తున్నారని దళితులకు బోధపడింది. ముఖ్యంగా దళితుల పట్ల ఉన్న వ్యతిరేకతను బడ్జెట్‌లో చూపించాడు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ కేటాయింపుల్లో ప్రభుత్వం అంకెల గారడీ చూపిం చింది. ఈ బడ్జెట్‌లో ఎస్సీ సబ్‌ప్లాన్‌కు 27.96 శాతం పెంచి రూ.14,367 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు 28.97 శాతం పెంచి రూ.5,385 కోట్లు, బీసీ సబ్‌ప్లాన్‌కు 33 శాతం పెంచి రూ.16,226 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 18.57 శాతం పెంచి రూ.1304 కోట్లు కేటాయిం చారు. అయితే గడిచిన నాలుగేళ్లలో ఎస్సీ/ఎస్టీ/బీసీ సబ్‌ప్లాన్‌ల నిధులు ఖర్చు చేసింది చాలా తక్కువేనని ఆర్ధిక మంత్రే రాష్ట్ర శాసన సభలో ప్రకటించారు. గత బడ్జెట్‌లోని కేటాయింపుల్లో దాదాపు రూ.5 వేల కోట్లు మిగిలి ఉన్నాయనేది ఒక వాస్తవం. కాబట్టి బడ్జెట్‌లోని కేటాయింపులంతా ఆయా వర్గాలను మభ్యపెట్టడానికి తప్ప వారి సంక్షేమానికి కాదనేది స్పష్టమవుతున్నది.
ఈ రోజు చంద్రబాబు పతనావస్థకు రావడానికి కారణం దళితులను పక్కన పెట్టడమే. దళితులను అవమానించడమే. ఎవరైనా దళితులుగా పుట్టాలనుకుంటారా? అంటూ అపహాస్యం చేయడమే కాదు.. దళితులపై దాడిచేసిన చింతమనేని ప్రభాకర్, కరణం బలరామ్ వంటి వారికి టికెట్లు ఇవ్వడమే కాక తమ సొంత ఊరు హైస్కూల్లో అస్పృశ్యులను వేరుగా కూర్చోపెట్టి అన్నం పెట్టిస్తున్న కోడెల శివప్రసాద్‌కు టికెట్టు ఇవ్వడం, పొన్నూరు నడిబొడ్డులో మందు షాపు పెట్టిన ధూళిపాళ్ళ నరేంద్రకు టికెట్టు ఇవ్వడం, నీరుచెట్టు పేరుతో దళితుల భూములు ఆక్రమించిన ప్రత్తిపాటి పుల్లారావుకు టిక్కెట్ ఇవ్వ డం ఇవన్నీ బాబు దళిత వ్యతిరేకతకు సంకేతాలే.
బీసీ పార్టీ అని ప్రచారం చేసుకొంటూ సుమారు 70 సీట్లు రావాల్సిన బీసీలకు 26 మాత్రమే కట్టబెట్టి అదికూడా బీసీల్లో ఆధిపత్యం ఉన్న కులాలకు ఆ సీట్లు ఇచ్చి నిజమైన వృత్తికారుల్ని, సామాజిక తరగతుల్ని నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు వారి ఓట్లను పొందే పరిస్థితుల్లో లేడు. నిజానికి పశ్చిమ గోదావరిని పరిశీలిస్తే కాపులు, శెట్టిబలిజలు, ఎస్సీలు, అగ్నికుల క్షత్రియులు, మిగిలిన బీసీ వర్గాలు ఎక్కువగా ఉంటారు. కానీ ఇక్కడ కూడా కమ్మవారికి సీట్లు ఇవ్వడం ఆశ్చర్యం. ఆంధ్రదేశాన్ని అంతా సొంత కుల జాగీరుగా మార్చాలని చూస్తున్నాడు. పోలీసు, రెవెన్యూ, అధికారుల్ని ఎన్నికల్లో వాడాలని చూస్తున్నారు. దానికి వ్యూహాలు పొందుతున్నారు. బీసీ లను సామాజిక సాంస్కృతిక దేశ నిర్మాణ శక్తులుగా బాబు గమనించడం లేదు.
అందువల్లే 2019 ఎన్నికలలో చంద్రబాబు ఓటమి భయంతో ఊగిసలాడుతున్నాడు. అటు రాయలసీమలో దివాకర్ రెడ్డి కొడుక్కి, కోట్ల విజయ్‌బాస్కర్ రెడ్డి కొడుక్కి, ఇటు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి రాత్రికి రాత్రి సీట్లు ఇవ్వడంతో సొంత పార్టీల వాళ్ళే ఎంపీలుగా నిలబడటానికి వెనకాడారని అర్థమౌతుంది. ఇవాళ ఆంధ్ర ప్రజలు కోరుకొంటుంది ఏమిటంటే రెండు కోట్ల ఎకరాల భూమి ఉంది దాన్ని భూమి లేని పేద ప్రజలకు పంచాలనేది. అధికార పక్షం గాని, ప్రతిపక్షం గాని కేవలం సంక్షేమ పథకాలే కాకుండా మానవ శ్రమకు మానవ వనరులకు అనుసంధానం కలిగించి ఆంధ్రరాష్ట్రాన్ని ఉత్పత్తి కేంద్రంగా మలచాలనేది ముఖ్యమైన విషయం.
చంద్రబాబు దిగిపోవడం తథ్యం అనుకున్న సందర్భంలో చంద్రబాబు నాయుడుకు ప్రత్యామ్నాయమైన ఎజెండాతో కూడిన నూతన పరిపాలనా విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకొంటున్నారు. కేవలం సంక్షేమమే కాకుండా సమాజం మార్పుకు దోహదం చేసే ఎజెండాను ప్రకటించాల్సి ఉంది. ఈ దిశగా లౌకిక ప్రజాస్వామ్య సామ్యవాద శక్తులన్ని ఓటును సాధనంగా మలచుకొని నూతన సామాజిక రాజకీయ విప్లవానికి పునాది వేస్తారని ఆశిద్దాం.
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త సామాజిక తత్వవేత్త,
నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు
మొబైల్ : 98497 41695
Comments
Please login to add a commentAdd a comment