పేపర్ తెరిచినా, టీవీ ఆన్ చేసినా.. ఇన్సూరెన్స్ డబ్బు కోసం భర్తను చంపిన భార్య అని ఒక వార్త, భార్య తనంతట తానుగా విడాకులు కోరితే భరణం ఇచ్చే బాధ తప్పుతుందనే కుయుక్తి పన్నే భర్త.. తరచూ ఇలాంటి వార్తలే కనిపిస్తున్నాయి. సమాజంలో బంధాలు బలహీనపడుతున్నాయని ఆవేదనను మిగులుస్తూ పేజీ తిప్పేస్తాం. ఇలాంటి స్వార్థాల మధ్య రాతికి పూచిన పువ్వులా పరిమళించిందో ప్రేమ. ‘బంధం’ అంటే ఇదీ, ఇలా ఉండాలి.. అని సంతోషపడే సంఘటన ఇది. ఏడడుగుల బంధం, ఏడు జన్మల బంధం.. ఇద్దరు మనుషులను ఒకరి కోసం మరొకరు బతికేలా చేస్తుందని నిరూపించిన సినిమా కథలాంటి వాస్తవం. విజేంద్ర సింగ్ రాథోడ్‌ది రాజస్తాన్ రాష్ట్రంలోని అజ్మీర్. అతడి ఉద్యోగం ట్రావెల్స్ ఆఫీస్‌లో. ఉద్యోగరీత్యా విజేంద్ర అనేక పుణ్యక్షేత్రాలు, ఇతర పర్యాటక ప్రదేశాలకు వెళ్లాడు. అయితే కేదార్‌నాథ్ (చార్‌ధామ్) యాత్రకు మాత్రం తన భార్య లీలను కూడా తీసుకెళ్లాలనుకున్నాడు. అలాగే ఆమెకోసం టికెట్ తీసుకున్నాడు. ఇది జరిగింది 2013లో.
విలయం విడదీసింది
జూన్ నెల 12వ తేదీ.. ఐదేళ్ల క్రితం కేదార్‌నాథ్‌ను ఊహించని రీతిలో భారీ వరదలు ముంచెత్తిన రోజది. కొండ చరియలు విరిగి పడి, భవనాలు కూలిపోయి, రోడ్లు కొట్టుకుపోయి, మనుషులను చెట్టుకొకర్ని పుట్టకొకర్ని విసిరేసిన విపత్తు అది. నాలుగు రోజుల పాటు విజేంద్ర, లీల ఒకరి చేతిని ఒకరు వదలకుండా కాపాడుకోగలిగారు. ఆ తర్వాత... ఆ ప్రళయం లీలను విజేంద్ర నుంచి దూరం చేసి ఏ తీరానికి చేర్చిందనేది ఆ ఇద్దరికీ తెలియదు. తానెక్కడున్నదీ తెలియక, జీవిత భాగస్వామి ఎక్కడున్నదీ ఆచూకీ లేక ఇద్దరూ తల్లడిల్లిపోయారు. విజేంద్ర భార్య కోసం వెతుకుతున్నాడు. అతడి చేతిలో ఉన్న ఏకైక ఆధారం లీల ఫొటో మాత్రమే. కనిపించిన ప్రతి ఒక్కరికీ ఆమె ఫొటో చూపిస్తూ ‘‘ఈమెను చూశారా, తెలిస్తే చెప్పండి’’ అని అభ్యర్థిస్తున్నాడు. రోజులు, వారాలు, నెలలు గడిచిపోతున్నాయి కానీ లీల ఆచూకీ లేదు. వరద తగ్గుముఖం పట్టి మామూలు పరిస్థితికి వచ్చింది.
లక్షల్ని తృణీకరించాడు
ఉత్తరాఖండ్ ప్రభుత్వాధికారులు కనిపించకుండా పోయిన వారిని మరణించి ఉండవచ్చనే నిర్ధారణకు వచ్చేశారు. వాళ్ల వాళ్లకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించేశారు. ఆ జాబితాలో లీల పేరు కూడా ఉంది. లీల పేరుతో ఎక్స్‌గ్రేషియా తొమ్మిది లక్షలు తీసుకుని అజ్మీర్‌కి వెళ్లి పొమ్మని విజేంద్ర బాధ చూడలేక మనసు కదిలిపోయిన వాళ్లంతా చెప్పారు. లీల బతికి లేదని నమ్మడానికి అతడు ఇష్టపడలేదు, ఆమె పేరుతో ఇచ్చే డబ్బు తాకడానికి అతనికి మనసొప్పలేదు. తన భార్య బతికే ఉంటుందనీ, తనకు ఎక్స్‌గ్రేషియా అక్కర్లేదనీ ఆమెను వెతకడానికి మరో ఊరికి వెళ్లిపోయాడు. అలా వెయ్యి గ్రామాలకు తక్కువ కాకుండా తిరిగాడు. విజేంద్రను ఇంటికి వచ్చేయమని పిల్లలు ప్రాధేయపడ్డారు.
ఆస్తుల్ని అమ్మేశాడు
చివరికి వారి మాట విని ఇంటికి వెళ్లాడు విజేంద్ర. కానీ అక్కడ ఉండిపోవడానికి కాదు. స్థిరాస్తులు అమ్మేసి పిల్లలు బతకడానికి ఓ మార్గాన్ని చూపించి, కొంత డబ్బు తీసుకుని మళ్లీ భార్యను వెతకడానికి బయలుదేరాడు. ఊళ్లో వాళ్లు, బంధువులు, ఇంట్లో వాళ్లు కూడా అతడికి మతిపోయిందనే నిర్ధారణకు వచ్చేశారు. విజేంద్ర మాత్రం తన నమ్మకాన్ని కోల్పోలేదు. ఊరూరూ తిరగ్గా తిరగ్గా ఉత్తరాఖండ్, గొంగోలీ గ్రామంలో ఒకరు చెప్పిన మాటతో అతడికి ప్రాణం లేచివచ్చింది. ఆనవాళ్లననుసరించి లీల ఉన్న చోటకు వెళ్లాడు. ఆ ఒకరు చెప్పినట్లే లీల మతిస్థిమితం లేని కండిషన్‌లో కనిపించింది. మౌనంగా కూర్చుని ఉంది. ఎవరైనా పలకరిస్తే పలుకుతుంది, అది కూడా ఒకటి– రెండు మాటలే. ఎవరైనా ఏదైనా పెడితే తింటుంది. ఎవరూ పెట్టకపోతే అలాగే ఉంటుంది. ఇవీ ఆమె గురించి ఆ గ్రామస్థులు చెప్పిన మాటలు.వరదలు, ఒంటరితనం, భయంతో కూడిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదామె.
బంధానికి కొత్త నిర్వచనం
వెంటనే లీలను అజ్మీర్‌కి తీసుకొచ్చాడు విజేంద్ర. ఇన్నేళ్లు ఏమైపోయిందనే ప్రశ్నలు అడిగితే ఆమె మెదడులో కల్లోలం ఏర్పడుతుందేమోననే ఆందోళనతో... ఇంట్లో వాళ్లు ఎవరూ ఏమీ అడగడం లేదామెను.వేళకు భోజనం పెట్టి తినమని, నీళ్లు పెట్టి స్నానం చేయమని పిల్లలకు చెప్పినట్లు ఆమెకు చెబుతున్నారు. ఆమె మానసిక స్థితి మెరుగుపడుతుందని, ముఖంలో నవ్వు విరుస్తుందనే నమ్మకంతో ఎదురు చూస్తున్నాడిప్పుడు విజేంద్ర. భార్యాభర్తల బంధానికి కొత్త నిర్వచనం చెప్పిన భర్త విజేంద్ర. అతడి గురించి తెలిసిన బాలీవుడ్ నిర్మాత సిద్ధార్థ రాయ్ కపూర్ ఇప్పుడు సినిమా తీయడానికి సిద్ధమవుతున్నారు.
– మంజీర
నమ్మను.. నా భార్య బతికే ఉంటుంది
Published Fri, Nov 9 2018 12:15 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment