వివిధ ప్రాంతాలలో మారథాన్‌లో పాల్గొన్న శ్రీపతిరెడ్డి
అంతులేని ఆత్మవిశ్వాసం..మొక్కవోని అకుంఠిత దీక్ష .. సమాజానికి కొంతైనా సాయపడాలన్న ఉన్నత లక్ష్యం.. అతన్ని సాహసం వైపు పరుగులు పెట్టించాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు ఖండాలలో మారథాన్ పూర్తిచేసి అరుదైన వ్యక్తులకు మాత్రమే సాధ్యమయ్యే కాంటినెంటల్ క్లబ్‌లో తెలుగువారి ఖ్యాతిని నమోదు చేశాడు. పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపించిన ఆయనే అనంతపురం జిల్లాకు చెందిన కేతు శ్రీపతిరెడ్డి. సరదాగా ప్రారంభమైన మారథాన్‌ను సమాజ శ్రేయస్సు కోసం మార్చుకున్న శ్రీపతి రెడ్డి స్పూర్తిదాయక విజయ గాథలపై కథనం.
బాల్యంలోనే విజ్ఞానానికి అడుగులు
అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యులు, రచయిత డాక్టర్ కేతు బుచ్చిరెడ్డి కుమారుడైన శ్రీపతిరెడ్డి మెడిసిన్ చదివాడు. తనకున్న విజ్ఞాన ప్రతిభతో వెస్ట్‌ఇండీస్‌కు వెళ్లి కొంత కాలం పనిచేశారు. 1995లో గాస్ట్రో ఇంట్రాలజీ ట్రై నింగ్ చేసి భార్య శిరీష కూడా డాక్టర్ కావడంతో గత 24 ఏళ్లుగా అమెరికాలోనే వైద్య సేవలందిస్తున్నారు. ఇది క్లుప్తంగా ఆయన జీవితమైనా ప్రపంచానికి అతన్ని పరిచయం చేసింది, తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింపజేసింది మాత్రం మారథాన్ రన్నర్‌గానే.
కుటుంబ సభ్యులతో శ్రీపతిరెడ్డి
మారథాన్ ఎందుకు ?
మారథాన్ అంటే 26.2 మైళ్లు (దాదాపు 42 కిలోమీటర్లు) పరిగెత్తడం. బిజీగా ఉన్న లైఫ్‌లో పరుగులు పెట్టడం దేనికని అందరిలా ఆలోచించకుండా శ్రీపతిరెడ్డి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా డాక్టర్లు బిజీగా ఉంటూ ఎన్నో ఆరోగ్య రహస్యాలు తెలిసినప్పటికీ పాటించడానికి తగిన సమయం దొరకక అనారోగ్యాన్ని అందరిలానే కొనితెచ్చుకుంటుంటారు. అలా కాకుండా డాక్టర్లకు స్ఫూర్తినింపడానికి మాత్రమే మారథాన్ ప్రారంభించిన ఆయన త్వరలోనే కొత్త లక్ష్యాన్ని పెట్టుకుని పరుగులు పెట్టడం నేర్చుకున్నారు. అదే కాన్సర్ పేషంట్ల సహాయనిధికి తోడుగా నిలవడం. మారథాన్ చేయడం ద్వారా నిధులను సేకరించి సహాయనిధికి ఇవ్వడం కోసం ఆయన దాదాపు ఏడు ఖండాలలో మారథాన్ చేశారు.
ఎముకలు కొరికే చలిలో సైతం
2016లో డెల్లాస్ (అమెరికా)లో మారథాన్‌ను ప్రారంభించారు. అన్ని ఖండాలలోనూ ఇదే తరహా మారథాన్‌ను నిర్వహించి అక్కడి వారి సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకోవాలన్న ఆలోచనతో ఆయన చాలెంజింగ్ పరిస్థితుల్లో పరుగులు పెట్టారు. మేజర్ మారథాన్ 2017లో బెర్లిన్ (యూరప్) నగరంలో జరిగింది. అక్కడ వివిధ ఖండాల నుండి విచ్చేసే స్పోర్ట్స్‌మెన్‌తో కలిసి చేసిన పరుగులు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి. అదే సంవత్సరం మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా)లో జరిగిన మారథాన్‌లో పాల్గొన్నారు. అలాగే 2018లో కౌలాలంపూర్ (ఆసియా)లో మారథాన్ సాగింది.
ఇక అన్నింటికన్నా 2019 జనవరిలో అంటార్కిటికాలో జరిగిన మారథాన్ అతన్ని నిజంగానే విజేతను చేసింది. ఎముకలు కొరికే చలిలో మైనస్ డిగ్రీల వాతావరణంలో, శ్వాస పీల్చుకోవడమే కష్టమయ్యే పరిస్ధితుల్లో 62మంది విదేశీయులతో కలిసి చేసిన మారథాన్ శ్రీపతిరెడ్డిని విలక్షణ వ్యక్తిగా నిలబెట్టింది. ఇలా అన్ని ఖండాలలోనూ మారథాన్ నిర్వహించిన భారతీయుల్లో ఇద్దరు మాత్రమే ఉంటే, డాక్టర్లలో ఆయన మాత్రమే ఆ స్థానాన్ని పొందిన మొదటి వ్యక్తిగా పేరుగాంచారు. లక్ష్యం పెద్దదయి, అందుకు తగిన శ్రమతోడైతే సాధ్యం కానిదేముంటుందని నిరూపించిన ఆయన అనుభవాలు యువతలో కొత్త స్పూర్తిని నింపుతాయనడంలో సందేహం లేదు.– గుంటి మురళీ కృష్ణ,సాక్షి కల్చరల్ రిపోర్టర్, అనంతపురం
లక్ష్యంగా ఉన్నతంగా ఉండాలి
జీవితమన్న తర్వాత సారవంతంగా ఉండేట్టు చూసుకోవడం మనందరి కర్తవ్యం. యువతలో ఎంతో శక్తి తెలివితేటలు ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే వారికేకాదు సమాజానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. లక్ష్యం ఉన్నతంగా ఉండాలి. అందుకు తగ్గ శ్రమ తోడైతే విజయాలు అవంతటవే వచ్చి వరిస్తాయి. దాని వెనకే డబ్బు, కీర్తి వచ్చేస్తాయి. ప్రారంభంలోనే ఏదో ఆశించి చేయడం మంచిది కాదనేది పరాజితుల నుండి నేర్చుకోవాలి. సరదాగా ప్రారంభమైన నా రన్నింగ్ చికాగోలోని కాన్సర్ సహాయనిధి వైపు పరుగులు పెడుతోంది. సేవా కార్యక్రమాలలో ఎంతో సంతృప్తి దాగుంటుంది. దానిని ఆస్వాదించే అలవాటు నేర్చుకోవాలి.– డాక్టర్ కేతు శ్రీపతిరెడ్డి,మారథాన్ విన్నర్
Comments
Please login to add a commentAdd a comment