సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
విజయవాడ స్పోర్ట్స్: రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా చేస్తానని అందుకు సహకరించాలని ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమరావతిని ప్రపంచంలో మొదటి ఐదు అద్భుత నగరాల్లో ఒకటిగా నిలుపుతామని చెప్పారు. విజయవాడలో ఆదివారం నిర్వహించిన మూడో అమరావతి మారథాన్–2018 ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ, ప్రజలు రోజుకు ఒక గంట చొప్పు వ్యాయామం చేయాలన్నారు. నాకోసం కాకుండా...మీకోసం క్రీడల్లో పాల్గొని జీవితం ఆనందమయం చేసుకోవాలన్నారు. 21కే రన్‌లో పాల్గొన్న గుంటూరు జిల్లా పూర్వ కలెక్టర్ కాంతీలాల్ దండేను ప్రత్యేకంగా అభినందించారు. రన్‌లో 7500 మంది పాల్గొన్నట్లు సీఎం ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ అథ్లెట్లు పాల్గొనడం శుభపరిణామమన్నారు. హైదరాబాద్‌లో తానే 20 ఏళ్ల క్రితం 10కే రన్‌ను నిర్వహించానని గుర్తు చేశారు. మారథాన్‌కు అమరావతిలో ఓ వేదిక ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న సుందర ప్రదేశాలు ఎక్కడా లేవని, వాటిని ఉపయోగించుకొని స్పోర్ట్స్, సీఆర్‌డీఏ, టూరిజం శాఖలును కలుపుతూ స్పోర్ట్స్ క్యాలెండ్ ఇయర్ రూపొందించి ప్రతి గ్రామంలో క్రీడా కార్యక్రమాలు చేపడతామన్నారు.
విజేతలు: 21కే, 10కే, 5కే రన్‌లో గెలుపొందిన వారికి రూ.20 లక్షల ప్రైజ్ మనీని సీఎం అందజేశారు. 10కే రన్ పురుషుల విభాగంలో విజయకుమార్, రమేష్, జయదేవ్, మహిళల విభాగంలో సౌజన్య, ప్రియదర్శిని, శివానీ, కీర్తిక, 21కే రన్ పురుషుల విభాగంలో లింగన్న, వెంకటేశ్వరరావు, బాబూ రావు, మహేంద్ర, మహిళల విభాగంలో ఉషా రాణి, 21కే రన్ సీనియర్ పురుషుల విభాగంలో మహ్మద్, శ్రీనివాసరెడ్డి, సునీల్, శ్రీకాంత్, 10కే రన్ సీనియర్ పురుషుల విభాగంలో పార్థసారధి, బాబూరావు, ఈశ్వరరావు, సూర్యాలకు సీఎం నగదు చెక్కులు, జియో ఫోన్లు అందజేశారు. ప్రారంభ కార్యక్రమంలో మేయర్ కోనేరు శ్రీధర్, మహిళా కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ పంచుమర్తి అనురాధ, ఎంపీ కేశినేని నాని, చెస్ గ్రాండ్ మాస్టర్ ఎంఆర్ లలిత్‌బాబు, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, మునిసిపల్ కమిషనర్ జె.నివాస్, శాప్ ఎండీ ఎన్.బంగారురాజు పాల్గొన్నారు.
రన్ తక్కువ.... రాబడి ఎక్కువ
విజయవాడ స్పోర్ట్స్: అమరావతి మారథాన్‌లో పాల్గొనేవారి సంఖ్య ఈ ఏడాది భారీగా తగ్గింది. రన్‌లో పాల్గొన్న వారంతా సీఎం సమావేశ సమయానికి వెళ్లిపోవడం... తరలించిన విద్యార్థులు మా త్రమే స్టేడియంలో మిగిలి ఉండడం ఈ ఏడాదీ జరిగింది. మారథాన్ తొలిసారిగా నిర్వహించినప్పుడు... వచ్చే సొమ్ముతో అమరావతి రాజధాని నిర్మాణానికి బ్రిక్స్ (ఇటుకలు) కొంటామని అప్పటి కలెక్టర్ బాబు.ఏ ప్రకటించారు. ఇప్పటికి ఎన్ని ఇటుకలు కొన్నారో నిర్వాహకులు, అధి కారులకే తెలియాలి. నిర్వాహకులు మాత్రం రన్‌లో పాల్గొన్నవారికి మాత్రమే మంచినీరు, ఆహార పదార్థాలు ఇచ్చారుకానీ, తరలించిన విద్యార్థులకు మంచినీరు కూడా ఇవ్వకపోవడంతో ఇబ్బందికి గురయ్యారు. తనకు పెన్షన్, ఇల్లు కేటాయించాలంటూ విజయనగరం జిల్లాకు చెందిన ఓ మహిళ చంద్రబాబు ప్రసంగం మధ్యలో కలకలం సృష్టించింది. పంచుమర్తి అనురాధ నచ్చజెప్పినా ఆమె శాంతించలేదు. ఆమెను సూర్యారావుపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment