కీచక సంహారం కోసం....
మాటలు: రామ్‌ప్రసాద్ యాదవ్; పాటలు: వెన్నెలకంటి, రామజోగయ్య శాస్త్రి, గోరటి వెంకన్న; సంగీతం: డాక్టర్ జోస్యభట్ల; కెమెరా: కమలాకర్; నిర్మాత: పర్వతరెడ్డి కిశోర్‌కుమార్; కథ- స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: ఎన్.వి.బి. చౌదరి
ఆడవారిని కేవలం ఆటవస్తువులుగా చూసే మనస్తత్త్వం నుంచి బయటపడని పురుషాధిక్య ప్రపంచం మనది. ఆడవారి పట్ల భరించలేనివెన్నో జరుగుతూ ఉంటాయి. యథార్థగాథలైనప్పటికీ అతి జుగుప్సాకరమైన అలాంటి అంశాలను సినిమా లాంటి మాస్‌మీడియవ్‌ులో ఎంతవరకు చూపించాలి?... వాటిని న్యూస్ రిపోర్ట్ స్థాయి నుంచి మూవీ ఆర్ట్ స్థాయికి ఎంతవరకు తేవాలంటే ఎప్పుడూ చర్చే. ఆ చర్చకు మరోసారి తావిస్తూ వచ్చిన సినిమా ‘కీచక’.
కథగా చెప్పాలంటే... సుజాత (యామినీ భాస్కర్) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేరింజనీర్. టీమ్‌తో కలసి చేపట్టిన ప్రాజెక్టుల్ని విజయవంతంగా పూర్తి చేసే ఆమె ఈసారి ఒంటరిగా ఒక ప్రాజెక్ట్‌ను తలకెత్తుకుంటుంది. అది ఏమిటంటే - ఊళ్ళోని గాంధీనగర్ బస్తీలో ‘కీచకుడి’గా తిరుగుతున్న కోటి (జ్వాలా కోటి)ని ఎలాగైనా చంపేయడం! ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ, కోటి ఉండే పేరుమోసిన బస్తీకి వస్తుంది. ఆ బస్తీకి 20 ఏళ్ళుగా మకుటం లేని మహారాజు - కోటి. వంద మర్డర్లు, 300 రేప్‌లు చేసిన చరిత్ర అతనిది. అయితే, భయంతో బస్తీవాసులు, రాజకీయ నాయకుల ప్రమేయం వల్ల పోలీసులు - అతణ్ణి ఏమీ చేయలేకపోతుంటారు. బస్తీకి ఒక సామాన్య మహిళగా వచ్చిన హీరోయిన్‌కు అతని మీద అంత పగ ఎందుకు అన్నది చిన్న ఫ్లాష్‌బ్యాక్‌లో చూపిస్తారు. మరోపక్క ఆమెను ఎలాగైనా అనుభవించాలనుకుంటాడు విలన్. అతణ్ణి ఏమారుస్తూనే, బస్తీలో అందరి ఎదుటే అతణ్ణి ఎదిరిస్తుంది హీరోయిన్. ఆమె ఇచ్చిన ధైర్యంతో జనమేం చేశారన్నది మిగతా స్టోరీ.
ఈ సినిమాకు కీలకమైన హీరోయిన్, విలన్... పాత్రధారులిద్దరూ ఆ పాత్రలకు తగ్గట్లు, చూడడానికి బాగున్నారు. క్రూరమైన విలన్ పాత్రకు జ్వాలా కోటి సరిగ్గా సరిపోయారు. సైకిల్ మీద క్యారియర్‌లో ఇడ్లీలమ్మే దాసు పాత్రలో రఘుబాబు అలవాటైన తన కామెడీకి భిన్నంగా సెంటిమెంటల్‌గా కనిపిస్తారు. ఆ పాత్ర ముగింపు, ఆయన నటన బాగున్నాయి. పరిమితమైన వనరులతో తీసిన ఈ సినిమాకు ఉన్నంతలో కెమేరా, రీరికార్డింగ్ వర్‌క బాగున్నాయి.
సినిమా మొదలైన కాసేపటికే హీరోయిన్ లక్ష్యమేమిటో, దానికి కారణమేమిటో కూడా చెప్పేశారు. దాంతో, తరువాతంతా లక్ష్యాన్ని ఆమె ఎలా చేరుకుందన్నదే! దాన్ని ఆసక్తిగా చెప్పాల్సింది. మళ్ళీ మళ్ళీ అవే తరహా రేప్ దృశ్యాలు, నేపథ్య గీతాలు, ఒక ప్రత్యేక నృత్య గీతం, ఇంకా విలన్ ముఠా మాటలు, చేష్టలతో సినిమాను 111 నిమిషాల నిడివికి చేర్చారు.
చిత్రంగా, విలన్‌ను చంపడమే ధ్యేయంగా కత్తి పట్టుకు తిరిగిన కథానాయిక ఆఖరుకి అదే కత్తితో విలన్ చేతిలో పోట్లు తింటుంది. అంతటి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బస్తీకి పోగానే, ఆటోడ్రైవర్‌తో ప్రేమలో మునగడంలో లాజిక్ వెతకడం కన్నా సినిమాటిక్ సృజన అని తృప్తిపడిపోతే గొడవుండదు. అత్యాచారానికి గురైన స్త్రీ ఆ దుర్మార్గానికి పాల్పడిన విలన్‌పై పగ తీర్చుకోవడమనే ఫార్ములా తాతల కాలం నాటిదే. కాకపోతే దాన్ని నిజజీవిత ఘటనకూ, స్త్రీ చైతన్యానికీ ముడిపెట్టడమే తాజాదనం. సీను సీనుకీ రేప్ దృశ్యం, సైకో తరహా శాడిజమ్, అనేకానేక ఆడియో కట్స్‌తో మనసును డిస్ట్రబ్ చేసే సంఘటనల సమాహారం ‘కీచక’.
నాగపూర్ ప్రాంతంలో అక్కూ యాదవ్ అనే వీధి రౌడీ జీవితం స్ఫూర్తితో ఈ సినిమా కథను అల్లుకున్నారట. ఈ చిత్ర దర్శకుడు ఒకప్పుడు టీవీ చానల్స్‌లో పనిచేసిన జర్నలిస్టు