Yamini Bhaskar
-
Yamini Bhaskar: గ్లామర్ తో మతులు పోగొడుతున్న యంగ్ బ్యూటీ..
-
నా అభిమాన తార సమంత.. ఎందుకంటే..
‘కీచక’ సినిమాతో వెండితెరకు పరిచయమైన యామిని భాస్కర్ పదహారణాల తెలుగు అమ్మాయి. ‘నర్తనశాల’ సినిమాలో సత్యభామగా ఆకట్టుకుంది. ‘‘నా తెలుగు మూలాలే నా బలం’’ అంటున్న యామిని తన గురించి తాను చెప్పుకున్న విషయాలు.... నేను లోకల్ .. విజయవాడలో పుట్టిపెరిగాను. సినిమా ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు. కాలేజీకి బంక్ కొట్టి సినిమాకు వెళ్లిన సందర్భాలు ఎప్పుడూ లేవు. సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు మాత్రం సినిమాలంటే ప్యాషనేట్‌గా ఉన్నాను. దేవదాస్ కనకాలగారి దగ్గర నటనలో ఓనమాలు నేర్చుకున్నాను. ఎంత ఇష్టమంటే... కథానాయికలలో నా అభిమాన తార సమంత. క్యూట్ అండ్ గ్రేట్ పర్ఫార్మెన్స్. చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన కామెడీ డైలాగులు బాగా ఎంజాయ్ చేస్తాను. నవ్వించడమైనా, ఏడ్పించడమైనా, డ్యాన్స్ అయినా ఎంత బాగా చేస్తారో! ఆయన్ని ఆరాధించేంత అభిమానం. నా డ్రీమ్‌రోల్.. నా డ్రీమ్‌రోల్స్ చాలా ఉన్నాయి. ‘నరసింహ’ సినిమాలో రమ్యకృష్ణ చేసిన ‘నీలాంబరి’లాంటి బలమైన పాత్ర చేయాలని ఉంది. మరి అలాంటి సినిమా వస్తుందో లేదో తెలియదుగాని చేయాలని మాత్రం ఉంది. ఎప్పుడు ఎలాంటి పాత్ర వస్తుందో తెలియదు. అలాని ‘డెస్టినీ’ గురించి పెద్దగా ఆలోచించను. ‘జస్ట్ హ్యాపన్’ అనే అనుకుంటాను. వరం.. ప్రేమ అన్నిసార్లూ దొరకదు. అది దొరికితే జీవితాంతం ఉంటుంది. అది పేరెంట్స్ నుంచి దొరకవచ్చు, ఫ్రెండ్స్ నుంచి దొరకవచ్చు. దేవుడు ప్రత్యక్షమై ‘వరం కోరుకో’ అని అడిగితే...‘‘ఈ సమాజంలో ఎన్నో అంతరాలు ఉన్నాయి. అలాంటివి లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా అందరూ సుఖశాంతులతో ఉండే సమాజం కావాలి’’ అని అడుగుతాను. చిన్నప్పుడు .. చిన్నప్పుడు మా ఇంట్లో అద్దం మీద మహేష్‌బాబు ఫొటో ఉండేది. పన్నెండేళ్ల వయసులోనే కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్నాను. నన్ను నటిగా చూడాలనేది మా నాన్న కల. నా ఇష్టమైన వంటకం...అన్నం, పప్పు, ఆవకాయ. ఇష్టమైన ప్రదేశం... స్విట్జర్లాండ్. -
హద్దు దాటలేదు
‘‘నటనలో శిక్షణ తీసుకోలేదు. కానీ సినిమాల పట్ల ఆసక్తితోనే హీరోగా చేశా. రియలిస్టిక్ సినిమాలంటే ఇష్టపడతా’’ అని ప్రియాంత్ అన్నారు. రమణ మొగిలి దర్శకత్వంలో ప్రియాంత్, యామినీ భాస్కర్ జంటగా తెరకెక్కిన ‘కొత్తగా మా ప్రయాణం’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రియాంత్ మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు డాక్టర్. నేను సీఎస్ (కంపెనీ సెక్రటరీ) చేశాను. ప్రస్తుతం బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నా. ఇప్పటి సాఫ్ట్వేర్ కల్చర్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. ఉద్యోగరీత్యా సొంత కుటుంబాలకు దూరంగా జీవిస్తున్న నేటి యువత ప్రవర్తన ఎలా ఉంది? అన్నదే కథాంశం. సినిమాలో అనవసరమైన రొమాన్స్ సీన్స్‌ను పెట్టలేదు. ఎక్కడా హద్దు దాటలేదు. మా సినిమాతో పాటు ‘మిస్టర్. మజ్ను, మణికర్ణిక: ఝాన్సీ రాణి ’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒక ఆడియన్‌గా నేనూ పెద్ద సినిమాలే చూడాలని కోరుకుంటాను. కానీ మా సినిమాలోని డిఫరెంట్ పాయింట్ ప్రేక్షకులకు చేరువయ్యేలా చేస్తుంది. హైదరాబాద్ లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో ప్రసాద్ అనే కొత్త దర్శకుడితో నా నెక్ట్స్ సినిమా ఉంటుంది’’ అన్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రేమకథ
‘ఈ వర్షం సాక్షిగా’ ఫేం రమణ దర్శకత్వం వహించిన చిత్రం ‘కొత్తగా మా ప్రయాణం’. ఈ సినిమాతో ప్రియాంత్ హీరోగా పరిచయం అవుతున్నారు. యామినీ భాస్కర్ కథానాయిక. నిశ్చయ్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. రమణ మాట్లాడుతూ– ‘‘నెలకు 2లక్షల జీతం తీసుకుంటూ పదిమందికీ సాయపడుతూ ఓపెన్ మైండెడ్‌గా ఉండే ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రేమకథ ఇది. అందరికీ సాయపడే తత్వం ఉన్నా ప్రేమ, పెళ్లి, కుటుంబం వంటి విలువలపై అతనికి అంతగా నమ్మకం ఉండదు. అలాంటివాడు మన సంప్రదాయం గొప్పతనం తెలుసుకున్న తర్వాత ఎలా మారాడు? అన్నది ఈ చిత్రంలో చూపించాం. ప్రియాంత్‌కి తొలి సినిమానే అయినా చక్కగా నటించాడు. త్వరలో ఆడియో రిలీజ్ చేయనున్నాం. నిర్మాణానంతర పనులు పూర్తవుతున్నాయి. ఈ చిత్రాన్ని త్వరలో రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, సాయి కార్తీక్, కెమెరా: అరుణ్ కుమార్. -
సాఫ్ట్వేర్ కుర్రాడి ప్రేమకథ
నెలకు రెండు లక్షల రూపాయలు జీతంగా తీసుకునే ఓ సాఫ్ట్వేర్ కుర్రాడికి ప్రేమ, పెళ్లిపై నమ్మకం ఉండదు. అలాంటివాడు పెళ్లికి ఎలా అంగీకరించాడు? అతనిలో మార్పుకు కారణం ఎవరు? అనే ఆసక్తికర అంశాల ఆధారంగా రూపొందిన చిత్రం ‘కొత్తగా మా ప్రయాణం’. ప్రయాంత్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో యామినీ భాస్కర్ కథానాయికగా నటించారు. నిశ్చయ్ ప్రొడక్షన్స్ పతాకంపై రమణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘‘నలుగురికీ సాయపడుతూ ఓపెన్ మైండెడ్‌గా ఉండే ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రేమకథ ఇది. తొలి సినిమానే అయినప్పటికీ ప్రయాంత్ బాగా నటించాడు. యామినీ భాస్కర్ అందచందాలు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. యూత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసిన ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు రమణ. భాను, గిరి, సాయి, జీవా, కారుణ్య తదితరులు నటించిన ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. -
సినిమా తీయడం ఈజీ..రిలీజ్ కష్టం
‘‘మా బ్యానర్లో విడుదల చేసిన ‘భలేమంచి చౌకబేరమ్’ చిన్న సినిమా అయినా ప్రేక్షకాదరణ బాగుంది. కథ బాగుండటం వల్లే సినిమాను బాగా ఆదరిస్తున్నారు. రోజు రోజుకూ కలెక్షన్లు పెరుగుతున్నాయి. వసూళ్లు ఇంకా పెరిగి, మా సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నా’’ అని చిత్ర సమర్పకులు కె.కె. రాధామోహన్ అన్నారు. నవీద్, నూకరాజు, యామినీ భాస్కర్ కీలక పాత్రల్లో మురళీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భలేమంచి చౌకబేరమ్’. ఆరోళ్ల సతీష్ నిర్మించిన ఈ సినిమా సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ చిత్రానికి కాన్సెప్ట్ అందించిన డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా తీయడం తేలిక.. కానీ, విడుదల కష్టం. మౌత్ టాక్‌తో రీచ్ అయ్యేలా చేయడం చాలా కష్టం. శనివారం సాయంత్రానికి మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మా టార్గెట్‌ని రీచ్ అయ్యాం’’ అన్నారు. ‘‘చిన్న సినిమా పెద్ద విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు మురళీకృష్ణ. ‘‘టిక్కెట్టుకి 100 రూపాయలు పెడితే 1000 రూపాయల వినోదం ఇచ్చే చిత్రం ‘భలేమంచి చౌకబేరమ్’’ అన్నారు నవీద్. ‘‘సినిమా విడుదల రోజు(శుక్రవారం) ఉదయం ఆటకు మా సినిమా ఓపెనింగ్స్ చూసి నిరుత్సాహపడ్డాం. అదేరోజు సాయంత్రానికి థియేటర్లు ఫుల్ అయ్యాయి’’ అన్నారు నూకరాజు. ‘‘టఫ్ సిచ్యువేషన్లో కాన్ఫిడెన్స్‌తో మా సినిమా విడుదల చేశాం. టాక్ బావుంది’’ అన్నారు సతీష్. యామినీ భాస్కర్, నటులు రాజా రవీంద్ర, ముస్తఫా, ఉద్ధవ్, పూర్ణాచారి పాల్గొన్నారు. -
పక్కా కమర్షియల్ చిత్రమిది
‘‘భలే మంచి చౌక బేరమ్’ చిన్న సినిమా. చిన్న సినిమాల కాన్సెప్ట్‌లు చాలా బాగుంటాయి. కానీ, ప్రేక్షకులు థియేటర్‌కి రారు. సినిమాలు చూడాలంటే అందులో ఏదో సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉండాలి. ఈ చిత్రంలో అలాంటి వైవిధ్యమైన పాయింట్ ఉంటుంది’’ అని దర్శకుడు మారుతి అన్నారు. నవీద్, ‘కేరింత’ నూకరాజు హీరోలుగా, యామినీ భాస్కర్ హీరోయిన్గా మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భలే మంచి చౌక బేరమ్’. కె.కె.రాధామోహన్ సమర్పణలో అరోళ్ళ సతీష్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ చిత్రానికి కాన్సెప్ట్ అందించిన మారుతి చెప్పిన విశేషాలు. ► కృష్ణానగర్‌లో తిరిగే ఇద్దరు బ్యాచిలర్స్కి దేశ రహస్యాలకు సంబంధించిన ఒక కవర్ దొరుకుతుంది. వాళ్లు దాన్ని ఎలా బేరం ఆడారు? అనేది ‘భలే మంచి చౌక బేరమ్’ మెయిన్ కాన్సెప్ట్. ఇందులో మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ► ఇదొక కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్. నేను చెప్పిన ఐడియాకి రవి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి డైలాగ్స్ రాశారు. ‘రోజులు మారాయి’ టీమ్ సెట్ అయ్యింది. కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ట్విస్ట్ ఉంటుంది. సెకండాఫ్ సీరియస్‌గా, కన్ఫ్యూజన్ కామెడీతో ఉండే పక్కా కమర్షియల్ చిత్రమిది. ► కె.కె. రాధామోహన్‌గారు మంచి టేస్ట్ ఉన్న నిర్మాత. మా సినిమా ఫస్ట్‌కాపీ చూసి, బాగా ఇంప్రెస్ అయిన ఆయన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ► ఇకపై పెద్ద చిత్రాలపైనే శ్రద్ధ పెట్టాలనుకుంటున్నా. ప్రస్తుతం చిన్న చిత్రాలు చేయదల్చుకోలేదు. నా సైకిల్ ప్రయాణం స్మూత్‌గా సాగుతోంది. నా తర్వాతి చిత్రం ‘భలే భలే మగాడివోయ్’లా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. -
చిన్న సినిమాల వల్లే ఈ స్థాయిలో ఉన్నా
‘‘చిన్న సినిమా అంటే పూర్తి రిస్క్ ఉంటుంది. ఆ చిన్న సినిమాల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. అందుకే దాన్ని వదులుకోవడం లేదు. చిన్న ఆలోచన నుంచి వచ్చిన కథ ‘భలే మంచి చౌక బేరమ్’. ఇది ఇన్నోవేటివ్ కాన్సెప్ట్. అందరికీ నచ్చుతుంది’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. నవీద్, ‘కేరింత’ నూకరాజు, యామినీ భాస్కర్, రాజారవీంద్ర, భద్రం, ముజ్తబా అలీఖాన్ ముఖ్య తారలుగా మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భలే మంచి చౌక బేరమ్’. కె.కె.రాధామోహన్ సమర్పణలో అరోళ్ళ సతీష్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సినిమా ట్రైలర్లను నటులు పృథ్వీ, సప్తగిరి విడుదల చేయగా, బిగ్ సీడీని డైరెక్టర్ వీవీ వినాయక్ రిలీజ్ చేస్తూ, ‘‘ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. టీమ్‌కి మంచి పేరు రావాలి’’ అన్నారు. ‘‘మా అరోళ్ళ గ్రూప్ నుంచి వస్తున్న తొలి సినిమా ఇది. ఈ కాన్సెప్ట్ ఇచ్చిన మారుతిగారికి ధన్యవాదాలు. ఈ సినిమా రిలీజ్‌కి రాధామోహన్‌గారు ఆక్సిజన్‌లాగా పని చేశారు’’ అన్నారు సతీష్‌కుమార్. ‘‘భలే మంచి చౌక బేరమ్’ సినిమాను రెండు సార్లు చూశా. కాన్సెప్ట్ నచ్చింది. ఈ సినిమా మొత్తం తయారు చేసి, సిల్వర్ ప్లేట్లో పెట్టి నా చేతికిచ్చి రిలీజ్ చేయమన్నారు. అంతకన్నా చౌకబేరమ్ దొరకదు. ఇదే నాకు ‘భలే మంచి చౌక బేరమ్’’ అన్నారు కేకే రాధామోహన్. ‘‘రవి, లక్కీ ఇద్దరూ నాకు చెరో చేయిలాంటివారు. నేను దర్శకత్వం వహించిన ‘రోజులు మారాయి’ చూసిన మారుతిగారు నమ్మి, ఈ సినిమా కథ ఇచ్చారు’’ అన్నారు మురళీకృష్ణ. సంగీత దర్శకుడు జేబీ, పాటల రచయిత పూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు. -
యామినీ.. అందాల రమణి
గుంటూరు, తుమ్మలపాలెం (ప్రత్తిపాడు): మండల పరిధిలోని తుమ్మలపాలెం మిట్టపల్లి ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం ‘భలే మంచి చౌకబేరం’ చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేసింది. కళాశాలలోని సెమినార్ హాలులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులతో హీరో నవీద్, హీరోయిన్ యామినిభాస్కర్ ముచ్చటించారు. విద్యార్థులతో కలిసి స్టెప్పులేస్తూ సందడి చేశారు. అక్టోబరు 5న విడుదల కానున్న సినిమాను ఆదరించాలని కోరారు.అనంతరం విద్యార్థులు నటీనటులతో సెల్ఫీలు దిగేందుకు పోటీబడ్డారు. -
నేను మీ అమ్మాయినే అండీ
‘‘జీవితం ప్రతి రోజూ ఓ పాఠం నేర్పుతుంది. ఇప్పటివరకు నా సినీ జర్నీలో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. స్క్రిప్ట్స్‌ను ఎంచుకోవడంలో పరిణితిగా ఆలోచిస్తున్నాను. సక్సెస్ నా చేతిలో లేదు. నేను ఒప్పుకున్న సినిమాలో నా క్యారెక్టర్ కోసం ఎంతైనా కష్టపడతాను’’ అన్నారు యామినీ భాస్కర్. నవీద్, ‘కేరింత’ నూకరాజు, యామినీ భాస్కర్ ముఖ్య తారలుగా మురళీ కృష్ణ ముడిదాని దర్శకత్వంలో సతీష్ కుమార్ నిర్మించిన చిత్రం ‘భలే మంచి చౌక బేరమ్’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను కె.కె. రాధామోహన్ వచ్చే నెల 5న రిలీజ్ చేస్తున్నారు. అలాగే గురువారం యామిని బర్త్‌డేని పురస్కరించుకుని యూనిట్ సభ్యులు బుధవారం ఆమెతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా యామిని చెప్పిన విశేషాలు... ►నన్ను కొంత మంది నార్త్ అమ్మాయి అనుకుంటున్నారట. కానీ నేను పక్కా తెలుగు అమ్మాయిని. మాది విజయవాడ. ‘భలే మంచి చౌక బేరమ్’లో ఎదుటివారి బాధను చూడలేని ఆదర్షి అనే మంచితనం ఉన్న అమ్మాయిగా నటించాను. కానీ నా మంచితనాన్ని వాడుకుని ఈ సినిమాలో నన్ను హీరో మోసం చేస్తాడు. తర్వాత ఏంటీ? అనేది సినిమాలో తెలుస్తుంది. దర్శకుడు మురళీగారు సినిమాను బాగా తీశారు. షూటింగ్ టైమ్‌లో బాగా ఎంజాయ్ చేశాం. కాన్సెప్ట్ ఇచ్చిన డైరెక్టర్ మారుతీగారికి, సినిమాను తొందరగా రిలీజ్ చేస్తున్న రాధామోహన్‌గారికి ధన్యవాదాలు. ►‘నర్తనశాల’ కథ నచ్చే చేశాను. ఒక సినిమా సక్సెస్ ఆడియన్స్ చేతిలో ఉంటుంది. నెక్ట్స్ ఏ సినిమా కమిట్ కాలేదు. కథలు వింటున్నాను. తమిళంలోనూ ఆఫర్స్ వస్తున్నాయి. కానీ పెద్ద బ్యానర్లో యాక్ట్ చేయాలని, మంచి కథ కుదరాలని వెయిట్ చేస్తున్నాను. -
భలే మంచి చౌక బేరమ్
‘ఈరోజుల్లో, బస్టాప్, ప్రేమకథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు’ వంటి హిట్ చిత్రాలతో దర్శకుడు మారుతి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పరచుకున్నారు. ఆయన కథ అందించిన చిత్రాలు కూడా మంచి ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా ఆయన ఇచ్చిన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘భలే మంచి చౌక బేరమ్’. నవీద్, ‘కేరింత’ నూకరాజు, యామినీ భాస్కర్, రాజారవీంద్ర, భద్రం, ముజ్తబా అలీఖాన్ ముఖ్య తారలు. మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో అరోళ్ల సతీష్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది. ‘అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్, పంతం’ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ‘భలే మంచి చౌక బేరమ్’ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చూశా. చాలా ఎంటర్టైనింగ్గా, ఇంట్రెస్టింగ్గా ఉంది. అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది. అందుకే మా బేనర్లో విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, నేపథ్య సంగీతం: జె.బి, కెమెరా: బాల్‌రెడ్డి పి, సహ నిర్మాత: గుడ్ సినిమా గ్రూప్. -
‘@నర్తనశాల’ మూవీ రివ్యూ
టైటిల్ : @నర్తనశాల జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : నాగశౌర్య, కశ్మీరా, యామినీ భాస్కర్, శివాజీ రాజా, అజయ్, జయప్రకాష్ రెడ్డి సంగీతం : మహతి స్వర సాగర్ దర్శకత్వం : శ్రీనివాస చక్రవర్తి నిర్మాత : ఉషా ముల్పూరి ఛలో సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించిన యంగ్ హీరో నాగశౌర్య తరువాత అమ్మమ్మగారిళ్లు, కణం లాంటి సినిమాలతో కాస్త తడబడ్డాడు. అయితే ఆ సినిమాల ప్రభావం నాగశౌర్య కెరీర్ మీద పెద్దగా కనిపించలేదు. అందుకే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘@నర్తనశాల’ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. నాగశౌర్య డిఫరెంట్ రోల్లో కనిపించిన @నర్తనశాల ఈ యంగ్ హీరో ఖాతాలో మరో సూపర్ హిట్‌గా నిలిచిందా..? కొత్త దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి గే కామెడీతో ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? కథ ; కళామందిర్ కల్యాణ్ (శివాజీ రాజా).. ఓ కూతుర్ని కని తన తండ్రి చేతిలో పెట్టాలని కలలు కంటుంటాడు. కల్యాణ్ తండ్రి చనిపోయిన తన భార్య మనవరాలిగా తిరిగి తన ఇంట్లోనే పుడుతుందన్న నమ్మకంతో ఉంటాడు. కానీ కల్యాణ్ భార్య(ప్రియ) మగ బిడ్డకు జన్మనిస్తుంది. ఈ విషయం తెలిస్తే తండ్రి గుండె ఆగిపోతుందని అబ్బాయినే అమ్మాయిగా తండ్రిని నమ్మిస్తాడు కల్యాణ్. కొడుకును కూతురిలాగే పెంచి పెద్ద చేస్తుంటాడు. ఓ బుడబుక్కల వాడితో సరదాగా మా అమ్మాయికి ఎలాంటి మొగుడు వస్తాడో చెప్పాలని అడిగిన కల్యాణ్‌కు అనుకొని సమాధానం ఎదురవుతుంది. ఆ బుడబుక్కల వాడు అబ్బాయిని అమ్మాయిగా చూపించి మోసం చేస్తున్నావు.. నిజంగానే ఈ అబ్బాయికి తోడుగా అబ్బాయే వస్తాడు అని చెప్పి వెళ్లిపోతాడు. పెరిగి పెద్దవాడైన కల్యాణ్.. కొడుకు (నాగశౌర్య) అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఓ క్లబ్‌ను నిర్వహిస్తుంటాడు. ఆడపిల్లకు ఏ సమస్య వచ్చినా తానే ముందుండి పరిష్కరిస్తుంటాడు. అలా ఓ సమస్య నుంచి మానస (కశ్మీర)ను రక్షించి ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ కల్యాణ్ చేసిన ఓ తింగరి పని వల్ల నాగశౌర్య.. దందాలు చేసే జయప్రకాష్ రెడ్డి కూతురు సత్య(యామినీ భాస్కర్)ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల నుంచి నాగశౌర్య ఎలా బయటపడ్డాడు.? నాగశౌర్య కు గే లా నటించాల్సి అవసరం ఎందుకు వచ్చింది..? బుడబుక్కల వాడు చెప్పిందే నిజమైందా.? చివరకు నాగశౌర్య, మానసలు ఎలా ఒక్కటయ్యారు? అన్నదే మిగతా కథ. నటీనటులు ; ఛలో సినిమాతో సూపర్ హిట్ సాధించిన నాగశౌర్య అదే కాన్ఫిడెన్స్ తో మరోసారి తన సొంత నిర్మాణ సంస్థలో @నర్తనశాల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోగానే కాక నిర్మాతగానూ బాధ్యతగా వ్యవహరించాడు. హీరోయిజంతో పాటు గే కామెడీ కూడా బాగానే పండించాడు. అయితే తన పూర్తి స్థాయిని ప్రూవ్ చేసుకునే సన్నివేశాలు దక్కలేదు. చాలా రోజుల తరువాత అజయ్‌కి ఫుల్ లెంగ్త్ రోల్ దక్కింది. రఫ్ లుక్‌లో కనిపిస్తూనే కామెడీతోనూ ఆకట్టుకున్నాడు అజయ్. హీరోయిన్లుగా నటించిన కశ్మీర, యామినీ భాస్కర్లు నటన పరంగా పెద్దగా మెప్పించలేకపోయినా.. గ్లామర్ షోతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. హీరో తండ్రిగా కనిపించిన సీనియర్ నటుడు శివాజీ రాజాను దర్శకుడు సరిగా వినియోగించుకోలేదు. జయప్రకాష్ రెడ్డి, సుధా, ప్రియా రొటీన్ పాత్రల్లో కనిపించారు. మరిన్ని రివ్యూల కోసం క్లిక్ చేయండి విశ్లేషణ ; ఛలో సినిమాతో సూపర్ ఫాంలో ఉన్న నాగశౌర్య మరోసారి సొంత నిర్మాణ సంస్థలో సినిమా చేస్తున్నాడంటే ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అంచనాలు అందుకోవటంలో @నర్తనశాల టీం పూర్తిగా విఫలమైంది. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగశౌర్య గే తరహా పాత్రలో నటించే సాహసం చేసినా ఆ ప్రయత్నం వృథా అయ్యింది. అవుట్ అండ్ కామెడీ ఆశించి థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి నిరాశపరిచాడు. కథా పరంగా మంచి కామెడీ పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు కథనాన్ని సాధాసీదాగా నడిపించాడు. ఫస్ట్‌హాఫ్‌లో హీరో హీరోయిన్ల లవ్ స్టోరి.. కొన్ని కామెడీ సీన్స్ ఆకట్టుకున్నా ద్వితీయార్థం మరింత రొటీన్‌గా అనిపిస్తుంది. కథనం ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా సాగుతూ నిరాశపరుస్తుంది. ఛలో సినిమాకు భారీ హైప్ రావటంలో హెల్ప్ అయిన సంగీత దర్శకుడు మహతి ఈ సినిమాతో ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాడు. ఒకటి రెండు పాటలు విజువల్‌గా ఆకట్టుకున్నా గుర్తుండిపోయే రేంజ్లో మాత్రం లేవు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ ; నిర్మాణ విలువలు రెండు పాటలు మైనస్ పాయింట్స్ ; కథా కథనాలు కామెడీ ఆశించిన స్థాయిలో లేకపోవటం స్లో నేరేషన్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ఏ పాత్రకి అదే ప్రత్యేకం
కశ్మీరా పరదేశి, యామినీ భాస్కర్... ఈ నెల 30న విడుదల కానున్న ‘నర్తనశాల’లో మెరవబోతున్న కథానాయికలు. నాగశౌర్య హీరోగా శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో శంకర ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించారు. కశ్మీరా పరదేశి మాట్లాడుతూ – ‘‘నా మాతృభాష మరాఠి. పూణెలో పుట్టి, పెరిగా. ముంబై నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతున్నప్పుడే మోడలింగ్ చేశా. ‘నర్తనశాల’ ఆడిషన్స్‌కి వచ్చా. నవరసాలను అభినయించమన్నారు. చేయగానే నచ్చడంతో కథానాయికగా తీసుకున్నారు. కాస్ట్యూమ్స్ విషయంలో ఉషా ఆంటీ సాయం చేశారు. దర్శకుడు చక్రవర్తిగారు నాకు గురువులాంటివారు. ఈ చిత్రంలో నా పాత్ర లవబుల్‌గా, ఇన్నోసెంట్‌గా ఉంటుంది. నా ప్రేమికుడే నా బలం అన్నట్టు ఉంటుంది. మరో హీరోయిన్ యామినీ ఉన్నప్పటికీ ఏ పాత్రకి అది స్పెషల్ అన్నట్లుగా ఉంటాయి. నాకు హిప్హాప్, కథక్ డ్యాన్సులు వచ్చు. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నా’’ అన్నారు. యామినీ భాస్కర్ మాట్లాడుతూ – ‘‘నేను పుట్టి, పెరిగింది విజయవాడ. గతంలో ‘కీచుక’ అనే సినిమా చేశా. అందులో నా నటనకి మంచి అభినందనలు వచ్చాయి. కానీ, ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు. ‘నర్తనశాల’ నా కెరీర్‌కి ప్లస్ అవుతుందనే నమ్మకం ఉంది. ఇందులో ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఒక అమ్మాయి ధైర్యంగా ఉండాలి, ఎదుర్కోవాలి అనుకునే పాత్ర. ప్రత్యేకించి కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ప్రాక్టీస్ చేశాను. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా రెండు పాత్రలకి మధ్య వేరియేషన్ ఉంటుంది. ఏ పాత్రకి అదే ప్రత్యేకం. ప్రస్తుతం మారుతిగారి దర్శకత్వంలో చేసిన ‘భలే మంచి చౌకబేరం’ సెప్టెంబర్‌లో విడుదలవుతుంది’’ అన్నారు. -
నచ్చితే పది మందికి చెప్పండి
‘‘శంకర్‌గారు, ఉషాగారిలాంటి తల్లిదండ్రులు ఉండటం నాగశౌర్య అదృష్టం. డైరెక్టర్ శ్రీనివాస్ నా కుటుంబంలోని వ్యక్తి. తనకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలనుకుంటున్నాను. ‘నర్తనశాల’ అనే టైటిల్ పెట్టి సినిమా తీయడానికి చాలా ధైర్యం కావాలి’’ అన్నారు వంశీ పైడిపల్లి. ‘ఛలో’ వంటి హిట్ చిత్రం తర్వాత నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ బ్యానర్లో రూపొందిన చిత్రం ‘నర్తనశాల’. శంకర ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించారు. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడు. కష్మిరీ పరదేశి, యామినీ భాస్కర్ హీరోయిన్స్. ఈ నెల 30న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. వంశీ పైడిపల్లి ఆడియో సీడీలను విడుదల చేసి మాట్లాడుతూ – ‘‘ఒక క్లాసిక్ సినిమాను తీసుకుని అందులోని క్యారెక్టర్స్‌ను కాంటెంపరరీగా డిజైన్ చేసి ఎంటర్టైన్ చేస్తూ తీసిన సినిమా ఇది. ‘గీత గోవిందం’తో ఎంటర్టైన్మెంట్ వేవ్ స్టార్ అయింది. అది ‘నర్తనశాల’కు కంటిన్యూ కావాలి’’ అన్నారు. హీరో నాగశౌర్య మాట్లాడుతూ – ‘‘వంశీ పైడిపల్లిగారు మొదటి నుండి మా సినిమాకు తన సహకారాన్ని అందిస్తూ వస్తున్నారు. అజయ్, శివాజీరాజాగారు, యామినీ, కష్మీరి అందరూ చక్కగా సపోర్ట్ చేశారు. సాగర్ మహతి మంచి సంగీతం అందించారు. డైరెక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి సినిమాను చాలా బాగా తీశారు. చెప్పింది చెప్పినట్లు తీశారు. మా అమ్మానాన్నలకు చాలా థ్యాంక్స్. వాళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. మా ఫ్యామిలీకి ఎప్పుడూ సపోర్ట్ చేసే బుజ్జి అంకుల్, శ్రీనివాస్‌రెడ్డి అంకుల్‌కు థాంక్స్. డెఫినెట్‌గా సినిమా అందరికీ నచ్చుతుంది. ఒకవేళ నచ్చకపోతే చూడొద్దు. నచ్చితే పది మందికి చెప్పండి’’ అన్నారు. ‘‘శౌర్య, శంకర్‌గారికి, ఉషాగారికి థాంక్స్. సినిమా చాలా ప్లెజంట్‌గా, కామిక్‌గా ఉంటుంది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’అన్నారు దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి. ‘‘ఒక మనసు’ చిత్రం కోసం మా బ్యానర్లో శౌర్య పనిచేశాడు. హార్డ్‌వర్కర్. తనకు మంచి పేరెంట్స్ ఉండటంతో.. కెరీర్ చక్కగా వెళుతోంది. ఐరా బ్యానర్‌ను స్టార్ట్ చేసి మంచి సినిమాలు చేస్తున్నారు’’ అన్నారు మధుర శ్రీధర్ రెడ్డి. ‘‘శంకర్‌గారు, బుజ్జిగారు, గౌతమ్, ఉషాగారే.. ఈ సినిమాకు మూల స్తంభాలు. సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు నందినీ రెడ్డి. శివాజీ రాజా మాట్లాడుతూ – ‘‘ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. నా కోసమే ఈ సినిమా చేశారా? అనిపించేలా ఉంటుంది. సాగర్ మహతి చాలా మంచి సంగీతం ఇచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు. -
పండగలాంటి సినిమా
నాగశౌర్య హీరోగా శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నర్తనశాల’. ఇందులో కాశ్మీరీ పరదేశి, యామినీ భాస్కర్ కథానాయికలుగా నటించారు. ఐరా క్రియేషన్స్ పతాకంపై శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉషా ముల్పూరి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్లతో పాటుగా రిలీజ్ చేసిన రెండు వీడియో సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా ఆడియోను ఈ నెల 24న రిలీజ్ చేసి, చిత్రాన్ని 30న విడుదల చేయనున్నాం. సినిమాలో నాగశౌర్య క్యారెక్టర్‌కు లేడీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. శ్రీనివాస్ చక్రవర్తి ఈ సినిమాను బాగా తెరకెక్కించారు. మహతి మంచి సంగీతం అందిచాడు. ఈ సినిమాపై ఆడియన్స్ నమ్మకం వమ్ము కాదు’’ అన్నారు. ‘‘ఛలో’ సక్సెస్ మా బ్యానర్‌కు ఊపిరిపోసింది. శ్రీనివాస్ బాగా తెరకెక్కించారు. ప్రతి క్షణం ఎంటర్టైన్ చేసేలా సినిమా ఉంటుంది’’ అన్నారు శంకర్ ప్రసాద్. ‘‘రీలీజ్ చేసిన టీజర్లో సినిమా గురించి కొంచెమే చెప్పాం. ట్రైలర్లో కాస్త కథ కూడా చెబుతాం. సినిమాలో ఉమెన్ ఎంపవర్మెంట్ సంస్థను రన్ చేస్తుంటారు నాగశౌర్య. ఆయన క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాయి. నాగశౌర్య గే క్యారెక్టర్ గురించి థియేటర్స్‌లో మరింత తెలుస్తుంది. నిర్మాతలు ఈ సినిమాను ఇష్టపడి నిర్మించారు. అందుకే లెక్కకు మించి ఖర్చు పెట్టారు. సినిమా పండగలా ఉంటుంది. సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. పాత నర్తనశాలకి, ఈ నర్తనశాలకి ప్యారలల్‌గా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. విజయ్‌కుమార్ మంచి విజువల్స్ అందించారు’’ అన్నారు దర్శకుడు శ్రీనివాస్. -
అటూ ఇటూ తిరిగి నర్తనశాల నాకే వచ్చింది
‘‘కొడుకు కలల్ని అర్థం చేసుకుని తనకి నచ్చినట్లు సినిమాలు తీస్తున్నారు నాగశౌర్య తల్లిదండ్రులు. వారి ఆశీర్వాదానికి మించిన ఆశీస్సుల కంటే ఇంకేం కావాలి. ‘నర్తనశాల’ వంటి క్లాసిక్ టైటిల్‌తో తీసిన ఈ చిత్రంలో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో నటించారు. టీజర్లో కొత్తదనం కనిపించింది. నా మిత్రుడు శ్రీనివాస్‌కి ఈ చిత్రం మంచి హిట్ తీసుకొస్తుంది. ఈ సినిమా కెమెరామేన్ విజయ్ సి.కుమార్ నాన్నగారు పాత ‘నర్తనశాల’ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించడం విశేషం’’ అని దర్శకుడు వంశీ పైడిపల్లి అన్నారు. నాగశౌర్య హీరోగా, కష్మీర పరదేశి, యామిని భాస్కర్ హీరోయిన్లుగా శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నర్తనశాల’. శంకర ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉష మూల్పూరి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని వంశీ పైడిపల్లి రిలీజ్ చేశారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘2013లో నేను హీరోగా అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు శ్రీనివాస్ చక్రవర్తి ‘నర్తనశాల’ కథ వినిపించారు. చాలా బాగా నచ్చింది. అప్పు చేసి అయినా ఈ సినిమా నిర్మించాలనిపించింది. అప్పటి నుంచి ఈ కథ అటూ ఇటూ తిరిగి మళ్లీ నా వద్దకే రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా తీస్తా. 15 కోట్లు పెట్టండి? అంటే ఏ తల్లిదండ్రులైనా ఆలోచిస్తారు. కానీ, నా తల్లిదండ్రులు మాత్రం నాపై ప్రేమతో చాలా ఖర్చుపెట్టి ఈ సినిమా తీశారు. వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు. ‘‘నా గురువు కృష్ణవంశీగారు. నాగశౌర్య, శంకర్ ప్రసాద్‌ల ప్రోత్సాహంతో నా కల తీరింది’’ అన్నారు శ్రీనివాస్ చక్రవర్తి. నటుడు శివాజీ రాజా, లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, కొరియోగ్రాఫర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిరోజూ పండుగే
‘ఛలో’ వంటి హిట్ తర్వాత ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై నాగశౌర్య హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నర్తనశాల’. శంకర్ ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించారు. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యామినీ భాస్కర్, కాష్మీర పరదేశీ కథానాయికలు. ఈ నెల 30న సినిమా విడుదలవుతోంది. భాస్కర భట్ల రచించిన ‘ఎగిరే మనసు..’ అనే ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఉషా ముల్పూరి మాట్లాడుతూ – ‘‘ఛలో’ చిత్రాన్ని మ్యూజికల్‌గానూ సూపర్ హిట్ చేశారు. ఈ సినిమాను కూడా అంతకు మించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఛలో’ సినిమాకు నిర్మాతలు దొరక్కపోవడంతో ఐరా క్రియేషన్ పుట్టింది. ఐరాకి ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్, మీడియా, తమ్మిరాజు, చంటి నాలుగు పిల్లర్స్’’ అన్నారు శంకర్ ప్రసాద్. ‘‘ఫస్ట్ లుక్ నుంచి మా సినిమాకు ఫుల్ సపోర్ట్ లభిస్తోంది. సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఇంత పెద్దది అవుతుందనుకోలేదు. ప్రతిరోజూ షూటింగ్ పండుగలానే జరిగింది’’ అన్నారు శ్రీనివాస్ చక్రవర్తి. ‘‘ఛలో’లో ‘చూసీ చూడంగానే....’ సాంగ్ కంటే ఈ పాట పెద్ద సక్సెస్ అవ్వాలి’’ అన్నారు సంగీత దర్శకుడు సాగర్ మహతి. ‘‘నర్తనశాల’ అందరూ గుర్తుంచుకునే సినిమా అవుతుంది’’ అన్నారు యామినీ. -
నర్తనశాల పేరు నిలబెట్టేలా ఉంటుంది
‘‘మా ‘నర్తనశాల’ సినిమా షూటింగ్ పూర్తయింది. లెజెండరీ చిత్రమైన ‘నర్తనశాల’ చిత్రం పేరు నిలబెట్టేలా మా సినిమా ఉంటుంది. శ్రీనివాస్‌గారు చాలా బాగా తీశారు. ఫస్ట్ లుక్ ఎంత ఫ్రెష్‌గా ఉందో సినిమా కూడా అంతే ఫ్రెష్‌గా, అందర్నీ ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటుంది’’ అని నాగశౌర్య అన్నారు. నాగశౌర్య హీరోగా, కష్మీర పరదేశి, యామిని భాస్కర్ హీరోయిన్లుగా శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నర్తనశాల’. శంకర ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. శ్రీనివాస చక్రవర్తి మాట్లాడుతూ– ‘‘నర్తనశాల’ చిత్రం ఇంత బాగా రావడానికి ముఖ్య కారణం నాగశౌర్య. ఆయన పాత్రలో ఇన్వాల్వ్ అయ్యి చేశాడు. మా నిర్మాతలు శంకర్, ఉషా, బుజ్జి గార్లకు సినిమా అంటే ప్యాషన్. అందుకే ఈ బ్యానర్లో ఏ చిత్రం వచ్చినా అది బ్లాక్‌బస్టర్ ఖాయం’’ అన్నారు. ‘‘ఛలో’ చిత్రాన్ని ఎంత ఘనవిజయం చేశారో ‘నర్తనశాల’ని కూడా అంతకు మించి హిట్ చేయాలి. ఈ చిత్రం తప్పకుండా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు ఉషా మూల్పూరి. ‘‘నర్తనశాల’ అందరి చిత్రంగా మీ ముందుకు వస్తుంది. అందరూ ‘ఛలో’ కంటే మంచి విజయాన్ని అందించాలి’’ అన్నారు శంకర్‌ప్రసాద్ మూల్పూరి. కష్మీర పరదేశి, యామిని భాస్కర్, నటులు శివాజీ రాజా, కొరియోగ్రాఫర్ విజయ్, కెమెరామేన్ విజయ్ సి.కుమార్, లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి, పాటల రచయితలు ఓరుగంటి, శ్రీమణి పాల్గొన్నారు. -
లైఫ్ స్టైల్ ఎక్స్పో
సాక్షి, వీకెండ్ ప్రతినిధి: ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టుడెంట్మగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(ఎస్ఐపిఎల్) నగరంలో తమ 2వ లైఫ్‌సై్టల్ ఎక్స్పో ఏర్పాటు చేసింది. కూకట్‌పల్లిలోని ఫోరమ్ సుజనామాల్‌లో ఏర్పాౖటెన ఈ అత్యాధునిక ఉత్పత్తుల ప్రదర్శనను సినీ నటి యామిని భాస్కర్ శుక్రవారం ప్రారంభించారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ అగర్వాల్ మాట్లాడుతూ విభిన్న రకాల కేటగిరీల కింద లభించే బ్రాండ్స్‌ను ఒకే చోట అందించడంతో పాటు వాటి మార్కెట్ స్థితిగతులకు సంబంధించిన తొలి దశ సమాచారం ఈ ఎక్స్‌పోలో లభిస్తుందన్నారు. 3 రోజులు కొనసాగే ఎక్స్పో ఈవెంట్స్‌లో శనివారం ఎత్నిక్ వేర్ ఫ్యాషన్ షో ఆదివారం లైవ్ స్టాండప్ కామెడీ షో నిర్వహించనున్నారు. -
టైటానిక్‌లో వినోదం!
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి, యామిని భాస్కర్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘టైటానిక్’. ‘అంతర్వేది టు అమలాపురం’ అన్నది ఉపశీర్షిక. చందర్ రావ్ సమర్పణలో జి. రాజవంశీ దర్శకత్వంలో కన్నా సినీ ప్రొడక్షన్స్ పతాకంపై కె. శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలుపుతూ- ‘‘అంతర్వేది నుంచి అమలాపురం వరకు గోదావరి నదిలో లాంచీలో జరిగే ప్రయాణమే ఈ చిత్రం. రాజమండ్రిలో పేరుగాంచిన వశిష్ఠ అనే యాత్ర బోట్‌ను టైటానిక్‌గా రూపొందించి షూటింగ్ జరిపాం. పూర్తి వినోదాత ్మకంగా తెరకెక్కించాం. పెళ్లి బృందం వినోదంతో సినిమా సరదాగా సాగుతుంది. థర్టీ ఇయర్స్ పృథ్వీ ఇందులో పెళ్లి కొడుకుగా, రఘుబాబు విలన్‌గా నటించారు. వినోద్ యాజమాన్య స్వరపరచిన పాటలు, ట్రైలర్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తప్పకుండా ప్రేక్షకులను మా చిత్రం కడుపుబ్బా నవ్విస్తుందనడంలో సందేహం లేదు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: అమర్, సహ నిర్మాత: అట్లూరి సురేష్ బాబు. -
కీచక సంహారం కోసం....
మాటలు: రామ్‌ప్రసాద్ యాదవ్; పాటలు: వెన్నెలకంటి, రామజోగయ్య శాస్త్రి, గోరటి వెంకన్న; సంగీతం: డాక్టర్ జోస్యభట్ల; కెమెరా: కమలాకర్; నిర్మాత: పర్వతరెడ్డి కిశోర్‌కుమార్; కథ- స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: ఎన్.వి.బి. చౌదరి ఆడవారిని కేవలం ఆటవస్తువులుగా చూసే మనస్తత్త్వం నుంచి బయటపడని పురుషాధిక్య ప్రపంచం మనది. ఆడవారి పట్ల భరించలేనివెన్నో జరుగుతూ ఉంటాయి. యథార్థగాథలైనప్పటికీ అతి జుగుప్సాకరమైన అలాంటి అంశాలను సినిమా లాంటి మాస్మీడియవ్ులో ఎంతవరకు చూపించాలి?... వాటిని న్యూస్ రిపోర్ట్ స్థాయి నుంచి మూవీ ఆర్ట్ స్థాయికి ఎంతవరకు తేవాలంటే ఎప్పుడూ చర్చే. ఆ చర్చకు మరోసారి తావిస్తూ వచ్చిన సినిమా ‘కీచక’. కథగా చెప్పాలంటే... సుజాత (యామినీ భాస్కర్) హైదరాబాద్‌లో సాఫ్ట్వేరింజనీర్. టీమ్‌తో కలసి చేపట్టిన ప్రాజెక్టుల్ని విజయవంతంగా పూర్తి చేసే ఆమె ఈసారి ఒంటరిగా ఒక ప్రాజెక్ట్‌ను తలకెత్తుకుంటుంది. అది ఏమిటంటే - ఊళ్ళోని గాంధీనగర్ బస్తీలో ‘కీచకుడి’గా తిరుగుతున్న కోటి (జ్వాలా కోటి)ని ఎలాగైనా చంపేయడం! ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ, కోటి ఉండే పేరుమోసిన బస్తీకి వస్తుంది. ఆ బస్తీకి 20 ఏళ్ళుగా మకుటం లేని మహారాజు - కోటి. వంద మర్డర్లు, 300 రేప్‌లు చేసిన చరిత్ర అతనిది. అయితే, భయంతో బస్తీవాసులు, రాజకీయ నాయకుల ప్రమేయం వల్ల పోలీసులు - అతణ్ణి ఏమీ చేయలేకపోతుంటారు. బస్తీకి ఒక సామాన్య మహిళగా వచ్చిన హీరోయిన్‌కు అతని మీద అంత పగ ఎందుకు అన్నది చిన్న ఫ్లాష్‌బ్యాక్‌లో చూపిస్తారు. మరోపక్క ఆమెను ఎలాగైనా అనుభవించాలనుకుంటాడు విలన్. అతణ్ణి ఏమారుస్తూనే, బస్తీలో అందరి ఎదుటే అతణ్ణి ఎదిరిస్తుంది హీరోయిన్. ఆమె ఇచ్చిన ధైర్యంతో జనమేం చేశారన్నది మిగతా స్టోరీ. ఈ సినిమాకు కీలకమైన హీరోయిన్, విలన్... పాత్రధారులిద్దరూ ఆ పాత్రలకు తగ్గట్లు, చూడడానికి బాగున్నారు. క్రూరమైన విలన్ పాత్రకు జ్వాలా కోటి సరిగ్గా సరిపోయారు. సైకిల్ మీద క్యారియర్‌లో ఇడ్లీలమ్మే దాసు పాత్రలో రఘుబాబు అలవాటైన తన కామెడీకి భిన్నంగా సెంటిమెంటల్‌గా కనిపిస్తారు. ఆ పాత్ర ముగింపు, ఆయన నటన బాగున్నాయి. పరిమితమైన వనరులతో తీసిన ఈ సినిమాకు ఉన్నంతలో కెమేరా, రీరికార్డింగ్ వర్క బాగున్నాయి. సినిమా మొదలైన కాసేపటికే హీరోయిన్ లక్ష్యమేమిటో, దానికి కారణమేమిటో కూడా చెప్పేశారు. దాంతో, తరువాతంతా లక్ష్యాన్ని ఆమె ఎలా చేరుకుందన్నదే! దాన్ని ఆసక్తిగా చెప్పాల్సింది. మళ్ళీ మళ్ళీ అవే తరహా రేప్ దృశ్యాలు, నేపథ్య గీతాలు, ఒక ప్రత్యేక నృత్య గీతం, ఇంకా విలన్ ముఠా మాటలు, చేష్టలతో సినిమాను 111 నిమిషాల నిడివికి చేర్చారు. చిత్రంగా, విలన్‌ను చంపడమే ధ్యేయంగా కత్తి పట్టుకు తిరిగిన కథానాయిక ఆఖరుకి అదే కత్తితో విలన్ చేతిలో పోట్లు తింటుంది. అంతటి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బస్తీకి పోగానే, ఆటోడ్రైవర్‌తో ప్రేమలో మునగడంలో లాజిక్ వెతకడం కన్నా సినిమాటిక్ సృజన అని తృప్తిపడిపోతే గొడవుండదు. అత్యాచారానికి గురైన స్త్రీ ఆ దుర్మార్గానికి పాల్పడిన విలన్‌పై పగ తీర్చుకోవడమనే ఫార్ములా తాతల కాలం నాటిదే. కాకపోతే దాన్ని నిజజీవిత ఘటనకూ, స్త్రీ చైతన్యానికీ ముడిపెట్టడమే తాజాదనం. సీను సీనుకీ రేప్ దృశ్యం, సైకో తరహా శాడిజమ్, అనేకానేక ఆడియో కట్స్‌తో మనసును డిస్ట్రబ్ చేసే సంఘటనల సమాహారం ‘కీచక’. నాగపూర్ ప్రాంతంలో అక్కూ యాదవ్ అనే వీధి రౌడీ జీవితం స్ఫూర్తితో ఈ సినిమా కథను అల్లుకున్నారట. ఈ చిత్ర దర్శకుడు ఒకప్పుడు టీవీ చానల్స్‌లో పనిచేసిన జర్నలిస్టు -
వాస్తవానికి దగ్గరగా...
హైదరాబాద్‌లోని పాత బస్తీలో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘కీచక’. యామినీ భాస్కర్, జ్వాలా కోటి ముఖ్య పాత్రల్లో ఎన్.వి.బి. చౌదరి దర్శకత్వంలో కిషోర్ పర్వత రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఫిక్షన్‌కు దూరంగా, రియాలిటీకి దగ్గరంగా ఉంటుందీ చిత్రం. స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుంది. 24 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. నిర్భయ చట్టం వచ్చినా సరే మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. ఈ సినిమా అలాంటి వారికి ఓ హెచ్చరిక ’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కమలాకర్, మాటలు: రామ్‌ప్రసాద్ యాదవ్. -
యథార్థ గాథ
నాగపూర్‌లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా రూపొందిన చిత్రం ‘కీచక’. యామినీ భాస్కర్, జ్వాలా కోటి, రఘుబాబు నాయుడు ముఖ్య పాత్ర లుగా ఎన్.వి.బి.చౌదరి దర్శకత్వంలో కిశోర్ పర్వతరెడ్డి నిర్మించారు. జోస్యభట్ల స్వరపరచిన ఈ చిత్రం పాటలను దర్శకుడు వీవీ వినాయక్ ఆవిష్కరించారు. ‘‘ఈ చిత్రాన్ని ‘అసురన్’ అనే పేరుతో తమిళంలో విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘మహిళలను చైతన్యపరిచే కథాంశాన్ని దర్శకుడు చక్కగా తెరకెక్కించారు’’ అని అన్నారు. కవి గోరటి వెంకన్న, మాటల రచయిత వెన్నెలకంటి తదితరులు పాల్గొన్నారు. -
యథార్థ సంఘటన ఆధారంగా...
మహారాష్ట్రలోని బస్తీలో ఓ వ్యక్తి 300 మందిని రేప్ చేస్తాడు. అతన్ని బస్తీవాసులు ఎలా శిక్షించారనే ఇతివృత్తంతో రూపొందిన చిత్రం ‘కీచక’. యామిని భాస్కర్, జ్వాల, కోటి, గిరిబాబు, రఘుబాబు ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి కిషోర్ పర్వతరెడ్డి నిర్మాత ఎన్.వి.బి. చౌదరి దర్శకుడు. ఈ సినిమా టీజర్‌ను తమ్మారెడ్డి భరద్వాజ, పోస్టర్‌ను దర్శకడు అనిల్ రావిపూడి హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. వచ్చే నెలలో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.