
రాయి పడుద్ది!
కిడ్నీలో స్టోన్స్
కిడ్నీలో రాళ్లు పడ్డ విషయం తెలియగానే మన గుండెల్లో రాయి పడుతుంది. అయితే గుండెల్లోని రాయి కనిపించదు కానీ కిడ్నీలో రాయి పరీక్షల్లో కనిపిస్తుంది. ఇలా కిడ్నీ రాయిపడటానికి చాలా కారణాలున్నాయి. మనలో జరిగే అనేక జీవకార్యకలాపాల తర్వాత వెలువడే వ్యర్థాలు, విషపదార్థాలను రక్తం నుంచి వేరు చేసి బయటకు పంపే కీలకమైన భూమికను మన మూత్రపిండాలు నిర్వహిస్తుంటాయి. ఆ టైమ్‌లో మన కిడ్నీలో కొన్ని పదార్థాలు క్రమంగా పేరుకుపోతూ స్ఫటికాకృతిని సంతరించుకుంటాయి. నీళ్లు తక్కువగా తీసుకునేవారిలోనూ, చాక్లెట్లు, కెఫిన్ వంటి వాటిని ఎక్కువగా తీసుకునే వారిలోనూ, ప్రత్యేకంగా వేసవికాలంలో ఏసీ రూమ్స్‌లో ఎక్కువగా ఉంటూ, తక్కువగా నీళ్లు తాగే సందర్భాల్లో కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ రాళ్ల నివారణ, చికిత్స ఎలాగో తెలుసుకుందాం. కిడ్నీ రాయితో పాటూ గుండెల్లో రాయినీ తొలగించుకుందాం.
మనలో నడుముకు ఇరువైపులా చిక్కుడు గింజ ఆకృతిలో రెండు మూత్రపిండాలుంటాయి. వీటి నుంచి సంచిలా ఉండే బ్లాడర్‌కు కలిపే పైప్‌లను యురేటర్స్ అంటారు. బ్లాడర్ నుంచి ఒక మూత్రనాళం ద్వారా మూత్రం బయటకు వెళ్తుంది. రక్తంలోని అనేక అంశాలను మూత్రపిండాలు శుద్ధి చేసి, అవసరమైన వాటిని తీసుకొని, వ్యర్థాలను మూత్రంతో పాటు బయటకు పంపిస్తాయి. ఈ క్రమంలో క్యాల్షియమ్ ఆక్సలేట్, సిస్టిన్ వంటివి స్ఫటికాలుగా మారిపోతూ ఉంటాయి. సాధారణంగా చిన్న చిన్న రాళ్లుగా ఏర్పడ్డ తర్వాత కూడా అవి మూత్రంతో పాటు బయటకు వెళ్తుంటాయి. కానీ ఒక రాయి 5 మి.మీ. కంటే ఎక్కువ సైజ్‌కు పెరిగితే మూత్రంలో సాఫీగా కొట్టుకొనిపోలేక... మూత్రవిసర్జక వ్యవస్థలో ఎక్కడైనా ఇరుక్కుపోవచ్చు. ఇలా మూత్రవిసర్జక వ్యవస్థలో రాళ్లు ఎక్కడైనా ఇరుక్కుపోయినప్పుడు తీవ్రమైన కడుపునొప్పి మొదలుకొని మూత్రధారకు ఏదో అడ్డుపడ్డట్లుగా ఉండటం వరకు అనేక లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో ప్రధానమైనవి
కొన్ని...
కిడ్నీలో రాళ్ల నిర్థారణ : మూత్రపరీక్ష, అల్ట్రాసౌండ్ పరీక్ష, ఇంట్రావీనస్ యూరోగ్రఫీ (ఐవీయూ), ఎక్స్-రే, సీటీ స్కాన్‌ల వంటి పరీక్షలతో కిడ్నీ స్టోన్స్‌ను నిర్ధారణ చేస్తారు.
కిడ్నీల్లోని రాళ్లను నివారించండిలా : మూత్రపిండాల్లో వచ్చే రాళ్ల వల్ల కూడా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అందుకే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండేందుకు అవసరమైన చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంతో పెద్ద ప్రమాదాన్నే నివారించే అవకాశం ఉంది.
ఆ జాగ్రత్తలివి...
నీటిని ఎక్కువగా తాగాలి. రోజుకు తప్పని సరిగా రెండు నుంచి రెండున్నర లీటర్ల యూరిన్‌ను విసర్జించాలి. కాబట్టి శరీర కణాల నిర్వహణకు, పోను ఆ మోతాదులో మూత్ర విసర్జన జరగాలంటే రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది ఆహారంలో ప్రొటీన్, నైట్రోజెన్, సోడియం ఉన్న పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. స్థూలంగా చెప్పాలంటే ఉప్పు పాళ్లు తక్కువగా ఉండాలి ఆగ్సలేట్ ఎక్కువగా ఉండే గింజలు, సోయాబీన్స్, పాలకూర, చాక్లెట్ల వంటి వాటిని వీలైనంతగా తగ్గించాలి క్యాల్షియం సప్లిమెంట్లను కూడా తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. పొటాషియం సిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది కాబట్టి వైద్యుల సూచనల మేరకు ఆహార నియమాలను పాటించడం మంచిది ఆల్కహాల్ వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దాంతో దేహంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్, క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అవకాశం ఎక్కువ ఆరెంజ్ జ్యూస్‌కు క్యాల్షియం ఆక్సలేట్‌ను రాయిగా మారకుండా నిరోధించే లక్షణం ఉంది. కాబట్టి ఆరెంజ్ జ్యూస్ మంచిదే. అయితే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం కూడా కిడ్నీస్టోన్ సమస్యకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి పుల్లటి పండ్లతో చేసిన జ్యూస్‌లను ఎక్కువగా తీసుకోకూడదు కూల్‌డ్రింకులను అస్సలు తాగకూడదు. మూత్రపిండాల్లో రాళ్లకు చికిత్స... : కిడ్నీ స్టోన్స్ చాలావరకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా వాటంతట అవే ఎక్కువగా మూత్రంతో పాటు పడిపోతుంటాయి. రాయి సైజు, రాయి ఉన్న ప్రాంతం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని చేయాల్సిన చికిత్స నిర్ణయిస్తారు. ఎండోస్కోపీ ద్వారా యురేటర్‌లో రాయిని తీయడం (యూఆర్‌ఎస్‌ఎల్ -ఎండోస్కోపిక్ రిమూవల్ ఆఫ్ స్టోన్ ఇన్ ద యురేటర్), ఎండోస్కోపీ ప్రక్రియతో మూత్రపిండం నుంచి రాయి తీయడం (పీసీఎన్‌ఎల్ - ఎండోస్కోపిక్ రిమూవల్ ఆఫ్ స్టోన్ ఫ్రమ్ ద కిడ్నీ) వంటి ప్రక్రియలతో రాయిని తొలగించవచ్చు. రోగి విపరీతమైన నొప్పితో బాధపడుతున్నప్పుడు, మూత్రపిండాల వ్యవస్థ విఫలమైనప్పుడు, కిడ్నీలు ఇన్‌ఫెక్షన్‌కు గురైనప్పుడు సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ ఇష్టపడని రోగులు ఒక నెల రోజులు ఆగి చూసి అప్పటికీ రాయి దానంతట అదే పడిపోకపోతే తప్పనిసరిగా ఆపరేషన్ చేయించాలి. లేకపోతే రాయి వల్ల ఇన్ఫెక్షన్ పాకి మూత్రపిండాలు దెబ్బతినే అవకాశాలుంటాయి.
నాన్ ఇన్వేజివ్ ఎక్స్‌ట్రా కార్పోరియల్ షాక్‌వేవ్ లిథోట్రిప్సీ (ఇఎస్‌డబ్ల్యూఎల్) అనే చికిత్స ప్రక్రియలో లేజర్, అల్ట్రాసోనిక్ కిరణాల ద్వారాగానీ లేదా మెకానికల్‌గా గానీ రాయిని చిన్న చిన్న పలుకులు లేదా పొడి అయ్యేలా చేస్తారు. ఆ పలుకులు, పొడి మూత్రంతో పాటు వెళ్లిపోతాయి. ఇలా రాయిని పలుకులు, పొడిగా చేస్తే యురేటర్‌లో స్టెంట్ వేస్తారు. ఇందుకంటే మూత్రనాళాలు, బ్లాడర్ గోడలు ఈ రాతిపలుకుల వల్ల ఒరుసుకుపోకుండా ఉండటానికి ఈ ఏర్పాటు చేస్తారు. రోగినుంచి పలుకులు పూర్తిగా పడిపోయాక స్టెంట్‌ను తొలగిస్తారు.ఇలాంటి నాన్‌ఇన్వేజివ్ (కత్తి ఉపయోగించకుండానే చేసే) ప్రక్రియల ద్వారా చికిత్స సాధ్యం కానప్పుడు మాత్రమే ఓపెన్ సర్జరీ (శస్త్రచికిత్స) చేస్తారు.
శబ్దతరంగాల ద్వారా : శబ్దతరంగాలను ఉపయోగించి రాయిని చిన్న పలుకులుగా పొడిలా చేయడం ద్వారా చేసే చికిత్సను ఎక్స్‌ట్రా కార్పోరల్ షాక్‌వేవ్ లిథోట్రిప్సీ అంటారు. చికిత్స కంటే నివారణ మేలు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని, రోజూ తగినన్ని మంచినీళ్లు తాగడం లాంటి విధానాలు అవలంబించడం ద్వారా కిడ్నీలో రాళ్లను నివారించుకుంటే మేలు.
కిడ్నీస్టోన్స్ లక్షణాలు... కోలిక్ పెయిన్... భరించలేని నొప్పి ఉండటాన్ని ఇలా వ్యవహరిస్తారు హిమచ్యూరియా... మూత్రంలో రక్తం పడడాన్ని హిమచ్యురియా అంటారు పైయూరియా... మూత్రంలో చీము రావడాన్ని ఇలా అంటారు డిస్ యూరియా... విసర్జన సమయంలో మార్గం మంటగా అనిపించడం. చిన్న రాళ్లు మూత్రంతోపాటు వచ్చినప్పుడు లేదా యూరిన్ ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా కనిపిస్తుంది ఆలిగ్యురియా... మూత్రం పరిమాణం తగ్గడం. యురెథ్రాలో కాని మూత్రాశయంలో కాని లేదా రెండింటిలో కాని రాళ్లు ఉన్నప్పుడు ఇలా జరగవచ్చు అబ్డామినల్ డిస్టెన్షస్‌లో... తల తిరగడం, వాంతులవడం ఉంటుంది. వీటితోపాటు చలి, జ్వరం కూడా ఉండవచ్చు పోస్ట్రిరీనల్ అజోటీమియా... కిడ్నీలో రాయి యురేటర్‌ని బ్లాక్ చేయడం, తద్వారా కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారి తీయడం ఫ్రీక్వెన్సీ ఇన్ మిక్చ్యురిషన్... ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సి రావడం. అలాగని ఒక రోజుకు రెండున్నర లీటర్లకంటే ఎక్కువ మూత్రవిసర్జన ఉండదు. తక్కువ మోతాదులో విసర్జిస్తూ ఎక్కువసార్లు వెళ్లాల్సి రావడం జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం కావడం వల్ల ఆహారం తీసుకోవాలన్న ఆసక్తి లేకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి.
డాక్టర్ ఎన్. ఉపేంద్రకుమార్
యూరాలజిస్ట్ అండ్ యాండ్రాలజిస్ట్,
కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్