
వంటింటి చిట్కాలు
► టొమాటోలు ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఫ్రిజ్‌లో వెజిటబుల్ ట్రేలో వేసేటప్పుడు ఒకదాని మీద ఒకటి పడకుండా పక్కపక్కన పెట్టాలి. అది కూడా ఫొటోలో ఎడమ చేతిలో ఉన్నట్లు కాకుండా కుడి చేతిలో ఉన్న విధంగా బోర్లించినట్లు సర్దుకోవాలి. ఇదే విధంగా ఒక వరుస మీద మరో వరుస వచ్చేటట్లు పేర్చుకుంటే ఒకదాని బరువు మరొకదాని మీద పడకుండా తాజాగా ఉంటాయి.
►టొమాటో,ఉల్లిపాయ ఒలవాలంటే వాటిని మరుగుతున్న నీటిలో వేసి తీసి చన్నీటి ధార కింద పెడితే (వాటర్ టాప్ కింద) త్వరగా ఊడి వచ్చేస్తుంది. టొమాటోలకైతే పదిహేను సెకన్లు, ఉల్లిపాయలైతే రెండు నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది.
►ఎండుద్రాక్ష, డ్రైఫ్రూట్స్ తరిగే ముందు చాకును చన్నీటితో తడిపితే త్వరగా కట్ అవుతాయి.
►మాంసం కాని చికెన్ కాని మరీ పలుచని ముక్కలుగా కట్ చేయాలంటే ఇరవై నిమిషాల పాటు ఫ్రీజర్‌లో పెట్టాలి. ఒక మోస్తరుగా గట్టిపడుతుంది కాబట్టి కట్ చేయడం సులభమవుతుంది. సమయం ఆదా ఆవుతుంది.
► నిమ్మకాయ నుంచి రసం మొత్తం రావాలంటే కోసే ముందు కాయను కిచెన్ ప్లాట్‌ఫాం మీద పెట్టి అరచేత్తో రుద్దాలి. ఇలా చేస్తే కాయ మెత్తబడి పిండిన వెంటనే రసం మొత్తం వచ్చేస్తుంది. రసం తీసే టైం తగ్గుతుంది.
►వెల్లుల్లి రేకల పొట్టు త్వరగా రావాలంటే ఒలిచేటప్పుడు ఒకవైపు చాకుతో గాటు పెట్టి చివర నొక్కాలి.
► ఎక్కువ రేకలు కావల్సినప్పుడు వేడి నీటిలో వేసి ఒకటి రెండు నిమిషాల తర్వాత నీటిని వంపేసి ఆ గిన్నెను చన్నీటి ధార కింద రేకలకు నీటి వత్తిడి తగిలే విధంగా పెడితే పొట్టు ఊడిపోయి నీళ్ల మీదకు తేలుతుంది.
►వంటల వాసన ఇల్లంతా వ్యాపించకుండా ఉండాలంటే వండేటప్పుడు వంటగదిలో తడి టవల్‌ను ఆరేస్తే వాసన టవల్‌కు పట్టేసి గది ఫ్రెష్‌గా ఉంటుంది.