కె.నరసింహం అన్న పేరు మరో విద్యార్థికీ ఉన్న కారణంగా, అర్థం చెడకుండా ఈయన పేరును నరకేసరి చేశారు వాళ్ల మాస్టారు. ఆ ఈయనే డాక్టర్ కె.ఎన్.కేసరి. చిన్ననాటే తండ్రిని పోగొట్టుకుని, పేదరికం అంతుచూసే ఉద్దేశంతో ఒంగోలు దగ్గరి ఇనమనమెళ్లూరు నుంచి మద్రాసుకు పారిపోయి, స్వయంకృషితో చదువుకుని, క్రమంగా ఆయుర్వేద వైద్యుడై, 1900లో మద్రాసులో లేండ్‌మార్క్‌లాంటి ‘కేసరి కుటీరం, ఆయుర్వేద ఔషధశాల’ స్థాపించి, లోధ్ర, అమృత, అర్క వంటి మందులతో లక్షలు గడించి, మహిళాభ్యున్నతి కోసం 1926లో గృహలక్ష్మి పత్రిక ప్రారంభించి, సాహిత్యలక్షు్మలకు ప్రతియేటా ‘గృహలక్ష్మి స్వర్ణకంకణం’ తొడిగి, ఎన్నో సేవా కార్యక్రమాలకు బూరి విరాళాలిచ్చి, 1943లో మైలాపూర్ తెలుగు ఎలిమెంటరీ స్కూలును హైస్కూలు స్థాయికి పెంచి, కేసరి కన్యావిద్యాలయము నెలకొల్పి, కేసరి ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించి మరెన్నో విద్యాలయాలు నడిచేలా చేసిన వైద్యుడు, సంపాదకుడు, సంస్కర్త, మహాదాత కోట నరకేసరి(1875–1953). ఆయన ఆత్మకథ ‘నా చిన్ననాటి ముచ్చట్లు’ వరుసగా మంచి పాత పుస్తకాలను ప్రచురిస్తున్న రాజాచంద్ర ఫౌండేషన్–తిరుపతి వల్ల మరోసారి అందుబాటులోకి వచ్చింది.
నా చిన్ననాటి ముచ్చట్లు (కె.ఎన్.కేసరి ఆత్మకథ)
పేజీలు: 218; వెల: 200; ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్, కాచిగూడ, హైదరాబాద్.