కాంగ్: స్కల్ ఐల్యాండ్
మాయా ద్వీపంలో మహా మర్కటం
హాలీవుడ్
2005లో ‘కింగ్ కాంగ్’ సినిమా వచ్చింది. ఒక వింత దీవిలోని కింగ్ కాంగ్ (భారీ గొరిల్లా) అక్కడకు షూటింగ్ కోసం వచ్చిన సినిమా యూనిట్‌లోని హీరోయిన్‌తో ప్రేమలో పడుతుంది. తన ప్రేమ కోసం దీవి నుంచి న్యూయార్క్ నగరానికి వచ్చి నానా బాధలు పడుతుంది. సర్కస్‌కు చిక్కుతుంది. ఆఖరకు పోలీసులతో యుద్ధంలో ప్రాణాలు విడుస్తుంది. భారీ విజయం సాధించిన ఆ సినిమాను పోలిన (సీక్వెల్ కాదు) మరో సినిమా ఇప్పుడు రాబోతోంది. పేరు ‘కాంగ్: స్కల్ ఐలాండ్’. ‘మాన్‌స్టర్ మూవీ’ గా హాలీవుడ్ పేర్కొనే ఈ తరహా సినిమాలు గతంలో వచ్చినా ఎప్పటికప్పుడు ప్రేక్షకాదరణ ఉండనే ఉంటుంది. అందుకే గతంలో ‘గాడ్జిల్లా’ (2014)ను నిర్మించిన లెజండరీ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది. వార్నర్ బ్రదర్స్ పంపిణీ చేస్తోంది.
‘కాంగ్: స్కల్ ఐల్యాండ్’ కథ 1970ల నాటిది. ఆ సమయంలో ఒక పరిశోధక బృందం అరుదైన జాతులున్న ఒక కొత్త దీవిని కనిపెడుతుంది. దానికి పయనమైపోతుంది. కాని ఆ దీవిలో అన్ని జీవులూ భారీగా ఉంటాయి. అన్నింటి కంటే భారీగా కింగ్ కాంగ్ ఉంటుంది. అక్కడకు వెళ్లిన బృందం ఆ భారీ జీవులన్నింటి మీదా యుద్ధాన్ని ప్రకటిస్తుంది. అయితే కథ గడిచే కొద్దీ కింగ్ కాంగ్ చంపదగ్గ జీవి కాదని బృందంలోని కొందరు వ్యక్తులకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందనేది కథ.
టామ్ హిడిల్‌స్టన్, జాన్ గుడ్‌మేన్ తదితరులు నటించిన ఈ సినిమా ఈ నెలలోనే అమెరికాలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇండియాలో ఇంకా విడుదల తేదీ తెలియదు. బహుశా వేసవిలో విడుదల చేయాలని పూనుకుంటే మాత్రం పిల్లలకే కాదు, పెద్దలకూ కనువిందే.