సేవలో బాలాకుమారుడు | Kumaraswamy Reddy starts Sravana Children's deafness Rehabilitation Centre For childrens | Sakshi
Sakshi News home page

సేవలో బాలాకుమారుడు

Published Tue, Nov 11 2014 11:22 PM | Last Updated on Fri, Oct 5 2018 6:40 PM

సేవలో బాలాకుమారుడు - Sakshi

సేవలో బాలాకుమారుడు

పిల్లలూ, దేవుడూ చల్లనివారే...
పిల్లల కోసం పని చేయడం, దేవుడి నీడలో పని చేయడం రెండూ అదృష్టమే. ఆ అదృష్టాన్ని దక్కించుకున్నారు కుమారస్వామిరెడ్డి. ఐఎఎస్ అధికారిగా ఏడుకొండల స్వామి చల్లని నీడలో పని చేసిన కుమారస్వామిరెడ్డి, ఉద్యోగ విరమణానంతరం కల్లకపటమెరుగని కరుణామయులైన పిల్లల కోసం పని చేస్తున్నారు.

ఉద్యోగానికి విరమణ ఉంటుందిగానీ, సేవకు విరమణ ఉండదు అని నిరూపిస్తున్నారు. ‘శ్రవణ చిల్డ్రన్స్ డెఫ్‌నెస్ రీహాబిలిటేషన్ సెంటర్’ను నిర్వహిస్తూ వినికిడి లోపంతో పుట్టిన పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ‘‘ఈ జీవితంలో ప్రతి క్షణాన్ని ప్రయోజనపూర్వకంగా మార్చుకోవాలి’’ అంటున్న విశ్రాంత ఐఎఎస్ అధికారి కుమారస్వామిరెడ్డి పరిచయం...
 
ఎనభై ఏళ్ల కుమారస్వామి రెడ్డి హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటారు.  తొమ్మిదింటికల్లా తయారైపోయి బయటికొస్తారు. వయసులో ఉండి ఉద్యోగాలు చేసుకునే వాళ్లు బద్ధకం వదిలించుకోకముందే ఈ పెద్దాయన ఇంటి నుంచి బయలుదేరుతారు. శ్రీనగర్ కాలనీ నుంచి ఆయన కారు నేరుగా మాసాబ్‌ట్యాంకు, విజయనగర్ కాలనీలోని ‘శ్రవణ చిల్డన్స్ డెఫ్‌నెస్ రీహాబిలిటేషన్ సెంటర్’కు వెళ్తుంది.

‘శ్రవణ’ వినికిడి లోపంతో పుట్టిన పిల్లలకు శిక్షణనిచ్చి వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే ధ్యేయంతో పనిచేస్తున్న ట్రస్టు. దీనికి చైర్మన్ కుమారస్వామిరెడ్డి. ‘శ్రవణ చిల్డ్రన్స్ డెఫ్‌నెస్ రీహాబిలిటేషన్ సెంటర్’లో వినికిడి లోపం ఉన్న పాతిక మంది పిల్లలు శిక్షణ పొందుతున్నారు.
 
గ్రహించే శక్తిని బట్టి...
వినికిడి లోపంతో పుట్టిన పిల్లలకు ఐదేళ్లు నిండే వరకు ‘శ్రవణ చిల్డ్రన్స్ రీహాబిలిటేషన్ సెంటర్’లోనే శిక్షణ ఇస్తారు. బిడ్డతోపాటు రోజూ తల్లి తప్పనిసరిగా రావాలనే నియమాన్ని పెట్టారు. ‘‘తల్లితోపాటుగా ఉండి నేర్చుకోవడం వల్ల ఈ పిల్లలు ఎంత చురుగ్గా తయారవుతున్నారంటే... మా దగ్గర నుంచి నార్మల్ స్కూల్‌కి వెళ్లిన వారిలో ఓ కుర్రాడు అక్కడ క్లాస్ లీడర్ అయ్యాడు’’ అని సంతోషంగా చెప్పారు కుమారస్వామిరెడ్డి. స్పీచ్ థెరపీ శిక్షణ పూర్తయిన వారికి రెండేళ్లపాటు ప్రీ స్కూల్ క్లాసులు నిర్వహిస్తారు.

ఇందులో త్రైమాసిక, అర్ధ సంవత్సర, ఏడాది పరీక్షలు కూడా ఉంటాయి. ఎక్కువగా నోటితో చెప్పించేవే (ఓరల్) ఉంటాయి. అక్షరాలు రాయడం, పదాలను పలకడం, పండ్లు, పూల వంటి వాటిని గుర్తించడం వంటివి సిలబస్‌లో ఉంటాయి. ఇల్లు, స్కూలు, పార్కు, జూ వంటి వాటి పట్ల అవగాహన కల్పించి పరిసరాల పరిజ్ఞానాన్ని పెంచే అసైన్‌మెంట్‌లు ఉంటాయి. ప్రీ స్కూల్ పూర్తయిన పిల్లలు సాధారణ స్కూళ్లలో చేరి చదువుకోవచ్చు. గ్రహించే శక్తిని బట్టి ఒక్కో పాపాయికి విడిగా చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు, ముగ్గురు పిల్లలను గ్రూపులుగా విభజించి శిక్షణనిస్తారు.

దూర ప్రాంతాల్లో ఉండేవారు మాత్రం వారానికోసారి వచ్చి ఇక్కడి స్పీచ్‌థెరపిస్టు ఇచ్చిన వీక్ డేస్ ప్రోగ్రామ్‌తో వెళ్లి ఆ వారమంతా పిల్లల చేత సాధన చేయిస్తుంటారు. ‘శ్రవణ చిల్డ్రన్స్ డెఫ్‌నెస్ రీహాబిలిటేషన్ సెంటర్’లో శిక్షణ పొంది సాధారణ స్కూల్లో చేరిన తర్వాత కూడా రెండేళ్లపాటు పర్యవేక్షిస్తారు. ‘‘ఇలాంటి బిడ్డల సేవ చేస్తే నా సేవ చేసినట్లేనని ఆ శ్రీనివాసుడే నాకీ పని అప్పగించాడు’’ అంటూ టి.టి.డి ఎగ్జిక్యూటివ్ అధికారిగా విధులు నిర్వర్తించిన రోజులను గుర్తు చేసుకున్నారు కుమారస్వామిరెడ్డి.

తిరుమలేశుని ఆశీః శుభాకాంక్షలు...
‘‘తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లి చేస్తూ తొలి శుభలేఖను స్వామి వారికి పంపిస్తుంటారు. వాటిని వచ్చీరాగానే చెత్తబుట్టలో వేస్తుంటే గుండెను పిండేసినట్లయింది. కొత్త దంపతులకు ఐదు భాషల్లో శుభాకాంక్షలు రాయించి, పైన వధూవరుల పేరు రాసేటట్లు ఒక ప్రొఫార్మా తయారు చేయించాను. అలా ప్రతి ఆహ్వాన పత్రికకూ దేవుడి ఆశీస్సులు, శుభాకాంక్షలు వెళ్లేవి. అలా అందుకున్న ప్రతిని చాలామంది ఫ్రేమ్ కట్టించుకున్నారు.

పెద్ద వయసు దంపతులకు ప్రత్యేక గౌరవం
స్వామి వారిని దర్శించుకోవడానికి తిరుమలకు నడిచి వచ్చిన వారిలో పెద్ద వయసు దంపతులను గుర్తించి వారికి ప్రత్యేక గౌరవం లభించే ఏర్పాటు చేశారాయన. వారికి కొత్త దుస్తులు ఇవ్వడంతోపాటు తెల్లవారి జరిగే అభిషేకంలో కూర్చోబెట్టేవారు. స్వయంగా వైకుంఠంలో ఉన్నట్లే ఉందని మురిసిపోయేవారు ఆ దంపతులు.
 
ఉద్యోగం చేసినన్నాళ్లూ చిత్తశుద్ధి ఉన్న అధికారిగా పేరు తెచ్చుకోవడం ఒక ఎత్తు, విశ్రాంత జీవనాన్ని కూడా ప్రయోజనపూర్వకంగా మలుచుకోవడం మరో ఎత్తు. ఉద్యోగం నుంచి రిటైరయిన తరువాత కూడా సేవామార్గం నుంచి పక్కకు తప్పుకోలేదు కుమారస్వామిరెడ్డి. ‘శ్రవణ చిల్డన్స్ డెఫ్‌నెస్ రీహాబిలిటేషన్ సెంటర్’ నిర్వహణకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగినంత కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడం కోసం పరితపిస్తున్నారు ఆయన. పూర్తి పారదర్శకంగా నడుస్తున్న ఈ సంస్థకు సహాయం చేయడంలోసంపన్నులెవరూ స్పందించడం లేదని చెబుతూ, మధ్యతరగతి వారికే మనసు ఉంటుందనిపిస్తోందన్నారు. దుబారా తగ్గిస్తే ఇలాంటి ఎంతో మంది పిల్లల జీవితాలు బాగుపడతాయని కుమారస్వామిరెడ్డి ఆశిస్తున్నారు.
- వాకా మంజులారెడ్డి ఫొటోలు: శివ మల్లాల
 
పరీక్షలు నిర్వహించి...
‘శ్రవణ చిల్డ్రన్స్ డెవలప్‌మెంట్ సెంటర్’ నుంచి ఒక వ్యక్తి స్క్రీనింగ్ మెషీన్‌తో రోజూ నీలోఫర్ ఆసుపత్రికి వెళ్లి పుట్టిన ప్రతి బిడ్డనూ పరీక్షిస్తారు. వినికిడి లోపం ఉన్నట్లు గుర్తిస్తే వారిని మూడు నెలల వరకు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ అప్పుడు వినికిడి పరికరాన్ని అమరుస్తారు. ప్రైవేట్ ఆసుపత్రులలో పుట్టిన వారిలో కూడా వినికిడి లోపం ఉన్నట్లు గుర్తిస్తే ఇక్కడికి పంపిస్తుంటారు. ఈ సెంటర్ నిర్వహణకు ఇచ్చిన విరాళాలకు పన్ను మినహాయింపు, ఎఫ్‌ఆర్‌సిఎ (ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) వంటి ప్రత్యేక సౌకర్యాలున్నాయి. ప్రతి రూపాయికీ రసీదు ఇస్తారు. ఈ కేంద్రం సేవలు అవసరమైన వారు సంప్రదించాల్సిన ఫోన్‌నంబరు... 040-23347050.

ఈమెయిల్ & shravanardc@yahoo.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement