డ్రిల్లింగ్ యంత్రంతో గుంతలు తీస్తున్న బాషా
తక్కువ శ్రమ, తక్కువ ఖర్చుతో పండ్ల తోటలు, కలప తోటలు నాటుకునేందుకు ఉపయోగపడే ఓ డ్రిల్లింగ్ యంత్రాన్ని రూపొందించాడు ఓ రైతు. ఆయన పేరు సయ్యద్ అహమీద్ బాషా. ఊరు మండ్లెం. జూపాడు బంగ్లా మండలం. కర్నూలు జిల్లా. బాషా తనకున్న ఏడెకరాల పొలంలో మలబార్ వేప మొక్కలు నాటాలని సంక్పలించారు. కూలీలతో గుంతలు తీయటం ప్రారంభించారు. ఒక్కో కూలీకి రూ.500ల చొప్పున చెల్లిస్తే రోజుకు 5 గుంతలకు మించి తీయలేకపోయారు. 7 ఎకరాల పొలంలో 4 వేల మొక్కలు నాటాలంటే కూలి ఖర్చులే తడిసి మోపెడవుతాయని భావించిన హమీద్ బాషా ఇందుకు ఒక సులువైన ఉపాయం ఆలోచించారు.
నడుపుకుంటూ వచ్చిన బైక్ కం డ్రిల్లింగ్ యంత్రాన్ని గుంతలు తీయడానికి సిద్ధం చేస్తున్న దృశ్యం
వివిధ యంత్రాలకు చెందిన పాత సామాన్లను సేకరించి, తన పాత బైక్‌కు అమర్చి విజయవంతంగా ఒక డ్రిల్లింగ్ యంత్రాన్ని రూపొందించారు. అడుగు వెడల్పు, రెండున్నర అడుగుల లోతుతో గుంతలు తవ్వేలా డ్రిల్లింగ్ యంత్రాన్ని తయారు చేయించారు. దీనికి రూ.1.10 లక్షలు ఖర్చుచేశారు. దీని సహాయంతో స్వయంగా తానే గుంతలు తీసి మలబార్ వేప మొక్కలు నాటించారు. దీన్ని బైక్ లాగానే నడుపుకుంటూ పొలానికి తీసుకెళ్లవచ్చు. అక్కడికి వెళ్లాక అప్పటికప్పుడు కొన్ని మార్పులు చేస్తే డ్రిల్లింగ్ యంత్రంగా మారిపోతుంది. లీటరు పెట్రోలు పోస్తే 300 వరకు గుంతలు తవ్వవచ్చంటున్నారు. ఈ యంత్రం వల్ల తనకు డబ్బు ఆదా అయ్యిందని రైతు శాస్త్రవేత్త సయ్యద్ హమీద్ బాష (90596 79595) గర్వంగా చెప్పారు.
– చాకలి నాగభూషణం, సాక్షి, జూపాడుబంగ్లా, కర్నూలు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment