kurnool farmer
-
గుంతలు తవ్వటం భలే సులువు!
తక్కువ శ్రమ, తక్కువ ఖర్చుతో పండ్ల తోటలు, కలప తోటలు నాటుకునేందుకు ఉపయోగపడే ఓ డ్రిల్లింగ్ యంత్రాన్ని రూపొందించాడు ఓ రైతు. ఆయన పేరు సయ్యద్ అహమీద్ బాషా. ఊరు మండ్లెం. జూపాడు బంగ్లా మండలం. కర్నూలు జిల్లా. బాషా తనకున్న ఏడెకరాల పొలంలో మలబార్ వేప మొక్కలు నాటాలని సంక్పలించారు. కూలీలతో గుంతలు తీయటం ప్రారంభించారు. ఒక్కో కూలీకి రూ.500ల చొప్పున చెల్లిస్తే రోజుకు 5 గుంతలకు మించి తీయలేకపోయారు. 7 ఎకరాల పొలంలో 4 వేల మొక్కలు నాటాలంటే కూలి ఖర్చులే తడిసి మోపెడవుతాయని భావించిన హమీద్ బాషా ఇందుకు ఒక సులువైన ఉపాయం ఆలోచించారు. నడుపుకుంటూ వచ్చిన బైక్ కం డ్రిల్లింగ్ యంత్రాన్ని గుంతలు తీయడానికి సిద్ధం చేస్తున్న దృశ్యం వివిధ యంత్రాలకు చెందిన పాత సామాన్లను సేకరించి, తన పాత బైక్‌కు అమర్చి విజయవంతంగా ఒక డ్రిల్లింగ్ యంత్రాన్ని రూపొందించారు. అడుగు వెడల్పు, రెండున్నర అడుగుల లోతుతో గుంతలు తవ్వేలా డ్రిల్లింగ్ యంత్రాన్ని తయారు చేయించారు. దీనికి రూ.1.10 లక్షలు ఖర్చుచేశారు. దీని సహాయంతో స్వయంగా తానే గుంతలు తీసి మలబార్ వేప మొక్కలు నాటించారు. దీన్ని బైక్ లాగానే నడుపుకుంటూ పొలానికి తీసుకెళ్లవచ్చు. అక్కడికి వెళ్లాక అప్పటికప్పుడు కొన్ని మార్పులు చేస్తే డ్రిల్లింగ్ యంత్రంగా మారిపోతుంది. లీటరు పెట్రోలు పోస్తే 300 వరకు గుంతలు తవ్వవచ్చంటున్నారు. ఈ యంత్రం వల్ల తనకు డబ్బు ఆదా అయ్యిందని రైతు శాస్త్రవేత్త సయ్యద్ హమీద్ బాష (90596 79595) గర్వంగా చెప్పారు. – చాకలి నాగభూషణం, సాక్షి, జూపాడుబంగ్లా, కర్నూలు జిల్లా -
'నా చావుకు బాధ్యులు పవన్ కల్యాణ్ , టీడీపీనే'
ఏపీ ముఖ్యమంత్రి కటౌట్ పైకి ఎక్కిన ఓ రైతు.. ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించడంతో విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో కాసేపు గందరగోళం నెలకొంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి కర్నూలు జిల్లా అస్సారి మండలం అట్టెకల్లు గ్రామానికి చెందిన గోవిందరాజుగా పోలీసులు గుర్తించారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడంతో.. జనంలో తిరగలేకపోతున్నానని మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి దిగానని తన లేఖలో వివరించాడు. ఆయన ఆవేదన ఆయన మాటల్లోనే.... నా పేరు గోవింద రాజు. 2014కు ముందు నేను ఏ పార్టీలో చేరలేదు. కనీసం టీడీపీకి అభిమానిని కూడా కాదు. కానీ.. ఎలక్షన్లకు ముందు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మీద ఉన్న అభిమానంతో.. ఆయన మాటలు నమ్మి టీడీపీ కోసం ప్రచారం నిర్వహించాను. దళిత సమాఖ్య అధ్యక్షుడిగా ఉంటూ మా వార్డు వాళ్లందరితో టీడీపీకి ఓటు వేసే విధంగా ప్రచారం చేశాను. అనంతరం సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లలో కూడా టీడీపీని గెలిపించడానికి కృషి చేశాను. వార్డు పరిధిలో సిమెంట్ రోడ్డు వేయిస్తామని, పింఛన్లు ఇప్పిస్తామని ప్రజలకు చెప్పి ఓట్లు వేయించాను. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో.. జనాల్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. గతంలో చేసిన అప్పులు ... ఇప్పుడు తీర్చాలంటూ అప్పులు ఇచ్చినవాళ్లు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఇంటి దగ్గర నాతో కలిసి ఉండాలంటే మొహం చెల్లగా నా భార్య, పిల్లలను విడిచి వెళ్లిపోతున్నాను. ఏది ఏమైనా మా అన్నయ్య పవన్ కళ్యాణ్ మాత్రం నా గుండెల్లో ఉన్నాడు. ఆయన అభిమానిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. నా కుటుంబానికి టీడీపీ అన్ని విధాలుగా న్యాయం చెయ్యాలి.. నా మరణానికి సమాధానం చెప్పాల్సిన ఇద్దరు.. ఒకరు పవన్ కళ్యాణ్ అయితే.. మరొకరు టీడీపీ పార్టీ అని పేర్కొన్నాడు. కాగా కటౌట్ ఎక్కిన గోవిందరాజులును పోలీసులు సముదాయించి ఎట్టకేలకు కిందకు దించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత చంద్రబాబు సందర్శకులను కలుస్తారని చెప్పడంతో అతను తన పట్టువీడాడు. గోవిందరాజులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.