'నా చావుకు బాధ్యులు పవన్ కల్యాణ్ , టీడీపీనే'
ఏపీ ముఖ్యమంత్రి కటౌట్ పైకి ఎక్కిన ఓ రైతు.. ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించడంతో విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో కాసేపు గందరగోళం నెలకొంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి కర్నూలు జిల్లా అస్సారి మండలం అట్టెకల్లు గ్రామానికి చెందిన గోవిందరాజుగా పోలీసులు గుర్తించారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడంతో.. జనంలో తిరగలేకపోతున్నానని మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి దిగానని తన లేఖలో వివరించాడు.
ఆయన ఆవేదన ఆయన మాటల్లోనే....
నా పేరు గోవింద రాజు. 2014కు ముందు నేను ఏ పార్టీలో చేరలేదు. కనీసం టీడీపీకి అభిమానిని కూడా కాదు. కానీ.. ఎలక్షన్‌లకు ముందు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మీద ఉన్న అభిమానంతో.. ఆయన మాటలు నమ్మి టీడీపీ కోసం ప్రచారం నిర్వహించాను. దళిత సమాఖ్య అధ్యక్షుడిగా ఉంటూ మా వార్డు వాళ్లందరితో టీడీపీకి ఓటు వేసే విధంగా ప్రచారం చేశాను.
అనంతరం సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లలో కూడా టీడీపీని గెలిపించడానికి కృషి చేశాను. వార్డు పరిధిలో సిమెంట్ రోడ్డు వేయిస్తామని, పింఛన్లు ఇప్పిస్తామని ప్రజలకు చెప్పి ఓట్లు వేయించాను. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో.. జనాల్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. గతంలో చేసిన అప్పులు ... ఇప్పుడు తీర్చాలంటూ అప్పులు ఇచ్చినవాళ్లు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఇంటి దగ్గర నాతో కలిసి ఉండాలంటే మొహం చెల్లగా నా భార్య, పిల్లలను విడిచి వెళ్లిపోతున్నాను.
ఏది ఏమైనా మా అన్నయ్య పవన్ కళ్యాణ్ మాత్రం నా గుండెల్లో ఉన్నాడు. ఆయన అభిమానిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. నా కుటుంబానికి టీడీపీ అన్ని విధాలుగా న్యాయం చెయ్యాలి.. నా మరణానికి సమాధానం చెప్పాల్సిన ఇద్దరు.. ఒకరు పవన్ కళ్యాణ్ అయితే.. మరొకరు టీడీపీ పార్టీ అని పేర్కొన్నాడు.
కాగా కటౌట్ ఎక్కిన గోవిందరాజులును పోలీసులు సముదాయించి ఎట్టకేలకు కిందకు దించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత చంద్రబాబు సందర్శకులను కలుస్తారని చెప్పడంతో అతను తన పట్టువీడాడు. గోవిందరాజులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.