కార్మిక సిద్ధాంతి | Labor theorist | Sakshi
Sakshi News home page

కార్మిక సిద్ధాంతి

Published Thu, Mar 13 2014 9:50 PM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM

Labor theorist

సంక్షిప్తంగా... కార్ల్ మార్క్స్

‘‘నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’’. శ్రీశ్రీ కదా అన్నారీమాట. అవును 1938లో ఆయన రాసిన ‘దేశ చరిత్రలు’ కవితలో. బహుశా ఆయన కార్ల్‌మార్క్స్ నుంచి స్ఫూర్తి పొంది ఉండాలి. 1848లో మార్క్స్ రాసిన ‘కమ్యూనిస్టు మ్యానిఫెస్టో’లో తొలి వాక్యం కూడా ఇలాంటిదే. ‘‘ఇప్పటి వరకు నడిచిన సమాజ చరిత్ర అంతా వర్గ సంఘర్షణల చరిత్రే’’ అన్నారు మార్క్స్. మ్యానిఫెస్టో ముగింపు వాక్యం కూడా మనం చాలాసార్లు విన్నదే! ‘‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి. పోరాడితే పోయేదేమీ లేదు సంకెళ్లు తప్ప’’. ఇదీ శ్రీశ్రీ నినాదంలా ఉంటుంది కానీ, నిజానికి  మార్క్స్ అందించిన విప్లవనాదం.

మనకు శ్రీశ్రీ ఎలాగో, శ్రీశ్రీకి మార్క్స్ అలాగ! ఆమాట కొస్తే ప్రపంచంలోని ప్రతి విప్లవ ‘శ్రీశ్రీ’కి మార్క్సే స్ఫూర్తి ప్రదాత. నేడిది మార్క్స్‌ను తలచుకోవలసిన సందర్భం. 1883 మార్చి 14న తన 64వ యేట ఆయన మరణించారు. ఆయన మాత్రమే మరణించారు. ఎంగెల్స్‌తో కలిసి ఆయన రాసిన గ్రంథాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. అవన్నీ కమ్యూనిస్టులకు వేదాల వంటివి. ‘కమ్యూనిస్టు మ్యానిఫెస్టో’ కమ్యూనిస్టులకు భగవద్గీత అయితే ‘దస్ క్యాపిటల్’ బైబిల్ వంటిది.
 
మార్‌‌క్స, ఎంగెల్స్ ఇద్దరూ మంచి మిత్రులు, ఆలోచనాశీలురు. మార్‌‌క్స ప్రభావం ఎంగెల్స్‌పై ఎంతగా ఉండేదంటే ఎంగెల్స్ జీవితాంతం మార్క్స్ అనుచ రుడిగానే ఉండిపోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే చూడండి. మార్క్సిజం ఉంది కానీ, ఏంగెలిజం లేదు. వాస్తవానికి ఏ ఇజాన్నైనా, ఏంగెలిజాన్నయినా తనలో కలుపుకునే శక్తి మార్క్సిజంలో ఉంది. అందుకే మార్క్స్ సైద్ధాంతికంగా బలవంతుడ య్యాడు. భౌతికంగా కూడా అతడు బలిష్టుడే. దృఢ కాయంతో, పెద్దగా ఛాయలేని శరీరంతో మొరటు మనిషిలా ఉండేవారట మార్క్స్!
 
కార్ల్ హైరీచ్ మార్క్స్ 1818 మే 5న పశ్చిమ జర్మనీలోని ట్రియర్‌లో జన్మించారు. తండ్రి న్యాయవాది. కేసులైతే వచ్చేవి కానీ, డబ్బులు వచ్చేవి కాదు. అలా పేదరికంలో పెరిగిన మార్క్స్ తన భార్యాపిల్లలకూ పేదరికాన్నే వారసత్వంగా ఇవ్వగలిగారు. మార్క్స్ చదివింది కూడా న్యాయశాస్త్రమే. కానీ హెగెల్, ఫ్యూయర్‌బాక్‌ల సిద్ధాంతాలు ఆయన్ని ‘సోషల్ ఫిలాసఫీ’వైపు దారి మళ్లించాయి. 1841లో మార్క్స్ జెనా విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. తర్వాత 1843లో కొంతకాలం కొలోన్‌లోని ఒక ఉదారవాద వార్తాపత్రికకు సంపాదకత్వం వహించారు. అనంతరం భార్య జెన్నీతో కలిసి విప్లవభావాలకు నెలవై వున్న పారిస్‌ను చేరుకున్నారు. అక్కడే ఆయన అతివాద కమ్యూనిస్టుగా మారారు.

ఆ క్రమంలోనే ఏంగె ల్స్‌తో ఆయనకు పరిచయం అయింది. మార్క్స్ భావజాలాన్ని ప్రమాదకరమైన ధోరణిగా భావించిన ఫ్రాన్సు అతడిని దేశం నుంచి బహిష్కరించింది. అక్కడి నుంచి మార్క్స్ బ్రస్సెల్స్ చేరుకున్నారు. తర్వాత 1849లో లండన్ వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. చివరి దశలో మార్క్స్ అనేక ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఎంగెల్సే మార్క్స్‌ని ఆదుకున్నాడు. 1881లో భార్య  మర ణించాక మార్క్స్ బాగా కుంగిపో యారు. తర్వాత మళ్లీ కోలుకోలేదు.

లండన్‌లో ఆయనకు అంత్యక్రియలు జరిపిస్తున్న సమయంలో ఎంగెల్స్ ఎంతో  ఉద్వేగంగా మాట్లాడారు. ‘‘ఈ మధ్యాహ్నం వేళ ఒక గొప్ప ఆలోచనాశీలి ఆలోచించడం మానేశాడు. మేము ఆయన చెంత లేని రెండు నిమిషాల్లోనే మా నుంచి సెలవు తీసుకున్నారు. కుర్చీలో కూర్చున్న మనిషి, కూర్చున్నట్లుగానే ఈ లోకాన్ని వీడిపోయారు’’ అని  గద్గదస్వరంతో అన్నారు. వర్తమానంలో మార్క్సిజానికి స్థానం లేనట్లు కనిపించవచ్చు. కానీ వర్తమానాన్ని ప్రభావితం చేసే ప్రతి ఇజంలోనూ మార్క్సిజం ఒక పునాది రాయిగా తప్పక ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement