85 సంవత్సరాల లక్ష్మమ్మకు నలుగురు కొడుకులు. 15 సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు. భర్త బాగా ఆస్తి సంపాదించి, పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి, ఆస్తి సమానంగా పంచి కాలం చేశాడు. తల్లి బాధ్యత పిల్లలు తీసుకుంటారనే నమ్మకంతో ఆమెకు భాగం ఇవ్వకుండా నలుగురు కొడుకులకూ ఆస్తి నాలుగు భాగాలు చేసి ఇచ్చాడు. భార్య తన తదనంతరం పడబోయే కష్టాల గురించి ఆలోచించలేదు. ఆయన చనిపోయాక కొడుకులు, కోడళ్ళు లక్ష్మమ్మను చూడ్డానికి వంతులు వేసుకోవడం మొదలెట్టారు. అంత ఆస్తి, ఇల్లూ వాకిలీ ఉండి కూడా లక్ష్మమ్మ అనాథలా అయిపోయింది. చిట్టచివరికి కొడుకులు, కోడళ్ళు ఆమెను ఇంట్లోంచి వెళ్లగొట్టారు. తెలిసిన వారి సహాయంతో ఆమె ఆశ్రయం పొంది, కోర్టులో పిల్లలందరి మీద మెయింటెనెన్స్, మెడికల్ ఎక్స్‌పెన్సెస్ కోసం 125 సిఆర్‌పిసి కింద కేసు వేసింది. దేవుని దయవల్ల జడ్జిగారు కేసును త్వరగా విచారించి, నలుగురు కొడుకులు ఒక్కొక్కరూ (వారి ఆర్థిక స్థితిని బట్టి) నెలకు 10,000 రూపాయలు మెయింటెనెన్స్ కింద తల్లికి ఇవ్వాలని, మెడికల్ ఎక్స్‌పెన్సెస్ లేదా ఆపరేషన్ ఖర్చులు ఏమైనా గానీ సమానంగా పంచుకోవాలని తీర్పు ఇవ్వడం జరిగింది.
కోర్టు తీర్పు ప్రకారం లక్ష్మమ్మ నలుగురు కొడుకులూ నెలకు 10,000 రూపాయల చొప్పున లక్ష్మమ్మ బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తున్నారు. తల్లి మెడికల్, ఆపరేషన్ ఖర్చులు... అన్నీ కూడా సమానంగా భరిస్తున్నారు. వృద్ధ తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదే అన్న విషయాన్ని ఈ కేసు తేల్చి చెప్పింది. చట్టరీత్యా తల్లిదండ్రులను చూడాల్సిన, బాధ్యత పిల్లలదే. వారి ఆస్తిని అనుభవించడమేగాక, వారి సంరక్షణ బాధ్యతలను చూసుకోవడం కూడా తమ బాధ్యతేనని పిల్లలంతా గుర్తించాలి.
లక్ష్మమ్మ కథ
Published Tue, Jun 2 2015 10:50 PM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM
Advertisement
Advertisement