బ్రహ్మ కొలువైన చోటు...
పాఠక పర్యటన
విష్ణు, మహేశ్వరులకు ఉన్నట్టుగా ప్రపంచంలో బ్రహ్మదేవుడికి విరివిగా దేవాలయాలు లేవు. కారణాలు ఏవైనా మన దేశంలో ఒకే ఒక ప్రాంతంలో బ్రహ్మదేవుడికి ఆలయం ఉంది. అదే పుష్కర్! రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో బ్రహ్మ నిత్య పూజలతో విరాజిల్లుతున్నాడు. గాయత్రీ, సరస్వతీ దేవేరులతో నాలుగు ముఖాలతో గల బ్రహ్మ మూర్తిని చూడటానికి రెండూ కళ్లు చాలవు.
పుష్కర్ పట్టణ అందాలు, అజ్మీర్ దర్గా, మౌంట్ అబు సుందర దృశ్యాలు విని ఉన్న నేను వాటన్నింటినీ చూడాలనే ఆసక్తితో మా మిత్రుడితో కలిసి రాజస్థాన్ రాష్ట్రానికి బయల్దేరాం. ఒంగోలు నుండి హైదరాబాద్- అటు నుంచి అజ్మీర్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరాం. అజ్మీర్‌కు చేరుకోవడానికి రెండు రోజులు పట్టింది. అజ్మీర్ చాలా పెద్దపట్టణం. అక్కడ ప్రఖ్యాతి గాంచిన దర్గాకు బయల్దేరాం.
మతసామరస్యానికి ప్రతీక...
సూఫీమత సన్యాసి దివంగతుడయ్యాక సమాధి చేసినదే ఈ దర్గా. అజ్మీర్ దర్గాగా దేశవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం ఉంది. దేశం నలుమూలల నుంచి వచ్చే హిందువులూ ఈ దర్గాను సందర్శించుకుంటారు. మొఘలుల కాలం నాటి శిల్ప కళ ఈ దర్గా గోడల మీద కనిపిస్తుంది. దర్గా సందర్శన తర్వాత మరునాడు ఉదయం అజ్మీర్‌కు22 కి.మీ దూరంలో గల పుష్కర్‌కు బస్సులో బయల్దేరాం.
ఆహ్లాదకరమైన సరస్సు... పుష్కర్!
పుష్కర్ అనేది పెద్ద సరస్సు పేరు. ఆ సరస్సు పేరే ఆ ప్రాంతానికీ వచ్చింది. చుట్టూ ఆవాసాలు.. మధ్యలో సరస్సు... సరస్సు పక్కనే బ్రహ్మ ఆలయం.. అద్భుతంగా అనిపించింది. ద్వాపరయుగంలో వజ్రనాభుని వధించడానికి బ్రహ్మ తన ఆయుధమైన తామరపుష్పాన్ని ప్రయోగించగా కొన్ని తామర రేకలు భూమిమీద పడ్డాయట. ఆ రేకలు పడిన ప్రదేశమే పుష్కర సరస్సుగా చెబుతారు. ఈ ప్రాంతంలోనే బ్రహ్మ యజ్ఞం చేశాడనీ, అందుకే పుష్కర్‌కు అంత ప్రాధాన్యత వచ్చిందని చెబుతారు. ఆలయానికి సమీపంలో హంస వాహనం, గర్భ గుడి ఎదురుగా వెండి తాబేలు ఉంది. బ్రహ్మదేవుడు నాలుగు తలలతో, ఎడమవైపున గాయత్రీదేవి, కుడివైపున సరస్వతీ దేవీతో కొలువుదీరి ఉన్నాడు. ఈ ఆలయం 2000 ల సంవత్సరాల క్రితం నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ప్రపంచంలోని పది ముఖ్యమైన దేవాలయాలలోనూ, 5 పవిత్ర మత పరమైన పుణ్యస్థలాలలో ఒకటిగా పుష్కర్‌కి, అక్కడి బ్రహ్మ ఆలయానికి పేరుంది.
మనసు దోచిన మౌంట్ అబూ...
పుష్కర్ సందర్శన తర్వాత సాయంకాలానికి తిరిగి అజ్మీర్ చేరుకున్నాం. మరుసటి రోజు సిరోహి జిల్లాలో ఉన్న అబు రోడ్‌కు రైలు మార్గాన చేరుకున్నాం. అబూ రోడ్‌కు దగ్గరలో అంబాజీ గ్రామంలో శక్తిపీఠాన్ని సందర్శించుకొని, అనంతరం మౌంట్ అబూ చేరుకున్నాం. సుందర, ఆహ్లాదకరమైన ప్రదేశాలు, జైన దేవాలయాల శిల్పకళతో మౌంట్ అబూ పెట్టింది పేరు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఉన్నదిక్కడ. టోడ్ రాక్, దిల్‌వారా ఆలయం, హనీమూన్ పాయింట్, నక్కి సరస్సు, గబ్బర్ కొండ చూడదగినవి. రోప్ వే ద్వారా గబ్బర్ కొండవీదకు చేరుకోవాలి. ఈ కొండమీద అమ్మవారి ఆలయం, 51 శక్తిపీఠాల నమూనా ఆలయాలు చూశాం. అంబాజీ నుంచి బస్సులో అబూ రోడ్‌కు వచ్చి అక్కడ రైల్వేస్టేషన్‌లో బికనీర్ -సికింద్రాబాద్ రైలులో హైదరాబాద్ చేరుకున్నాం. రైలు-బస్సు చార్జీలు, భోజనం, బస, ఇతర చిల్లర ఖర్చులు కలుపుకొని ఒక్కొక్కరికి రూ.4000 ల చొప్పున ఖర్చు అయినప్పటికీ దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ప్రాంతాన్ని సందర్శించామన్న తృప్తిని మదినిండా నింపుకున్నాం.
- ఎస్.వి.సత్యభగవానులు, ఒంగోలు