ఫ్యాషన్‌ 'జిమ్‌'దగీ | Latest Fashion Trends For Gym Workouts | Sakshi
Sakshi News home page

ఫ్యాషన్‌ 'జిమ్‌'దగీ

Published Fri, Aug 17 2018 9:15 AM | Last Updated on Tue, Aug 21 2018 1:37 PM

Latest Fashion Trends For Gym Workouts - Sakshi

సిటీలోని జిమ్‌లు, ఫిట్‌నెస్‌ క్లబ్‌లు, యోగా కేంద్రాలు ర్యాంప్‌లనుతలపిస్తున్నాయి. అక్కడి ఫిట్‌నెస్‌ ఔత్సాహికుల వస్త్రధారణ ఫ్యాషన్‌ షోలకు తీసిపోవడం లేదు. వర్కవుట్‌ సమయంలో మాత్రమే కాదు... బయటకు వెళ్లేటప్పుడు కూడా ఫిట్‌నెస్‌ కాస్ట్యూమ్స్‌తో యూత్‌ సందడి చేస్తోంది. సిటీజనులకు ఫిట్‌నెస్‌ అవుట్‌‘ఫిట్‌’ ఇంటాబయటా ఇంత క్రేజీగా మారడమనేది మెట్రో నగరాలన్నింటినీ కుదిపేస్తున్న లేటెస్ట్‌ ఫీవర్‌ అంటున్నారు ఫ్యాషన్‌ డిజైనర్లు. 

సాక్షి, సిటీబ్యూరో : ఆరోగ్య సాధనలో తలమునకలవుతున్న సిటీజనులతో ప్రస్తుతం నగరంలోని ఫిట్‌నెస్‌ సెంటర్లు రద్దీగా మారడంతో పాటు... సిటీలో హైక్లాస్‌ వెల్‌నెస్‌ స్టూడియోలు కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. ఈ క్రమంలో వర్కవుట్స్‌కు సంబంధించిన వస్త్రధారణలోనూ భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.  

‘వేర్‌’.. వెరీ ఇంపార్టెంట్‌  
వ్యాయామ సమయంలో ధరించే దుస్తులు మన మీద చాలా ప్రభావం చూపిస్తాయని పరిశోధనల్లో తేలింది. కొన్ని రకాల బిగుతైన దుస్తులు రక్తప్రసరణ, ఆక్సిజన్‌ సరఫరాలను మెరుగుపరిచి క్రీడా సామర్థ్యాన్ని పెంచేందుకు కారణమవుతాయని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌కు చెందిన ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఎక్సర్‌సైజ్‌ అండ్‌ ఎన్విరాన్మెంటల్‌ మెడిసిన్‌ పోస్ట్‌ డాక్టోరల్‌ రీసెర్చర్‌ డాక్టర్‌ స్టిక్‌ఫోర్డ్‌ పేర్కొన్నారు. సరైన వస్త్రధారణ వ్యాయామ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుందని, అంతేకాకుండా వ్యాయామం తర్వాత వేగంగా రికవరీ అయ్యేందుకు దోహదం చేస్తుందని ఆమె తన పరిశోధన ఫలితాల్లో స్పష్టం చేశారు.  

వెరైటీలెన్నో...
గతంలోలా ఫిట్‌నెస్‌ స్టూడియోలో ఇప్పుడు సాదా సీదా టీషర్ట్స్, రెగ్యులర్‌ ట్రాక్స్‌ కనపడడం అరుదైపోయింది.  కాటన్‌ టీషర్ట్‌ వేసుకునో, లేకపోతే జాగింగ్‌ సూట్స్‌ ధరించేసో, స్పాండెక్స్‌ జంప్‌సూట్స్‌తోనో సరిపెట్టుకోవడం లేదు. యోగాసనాల సాధకుల కోసం, డ్యాన్స్‌ ఎరోబిక్స్‌ చేసేవాళ్ల కోసం... ఇలా వ్యాయామ తీరుతెన్నులకు అనుగుణంగా ఈ వస్త్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. వీటిలో స్పాంకీ ట్యాంక్‌ టాప్స్, కలర్‌ఫుల్‌ టైట్స్, గ్రాఫిక్‌ టీషర్ట్స్, మెష్‌ డిజైన్డ్‌ బ్రాస్‌... తదితర ఇప్పుడు ఫ్యాషన్‌ ఫర్‌ ఫిట్‌లో భాగంగా మారాయి. ఇవి జిమ్‌ స్టైల్‌కి అనుగుణంగా ఉండడం మాత్రమే కాదు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో అందుబాటులోకి వస్తున్నాయి. చెమట పట్టే పరిస్థితులకు అత్యంత అనువుగా సౌకర్యవంతంగా సాగే గుణంతో వీటిని రూపొందిస్తున్నారు. రీబాక్‌ తాజాగా నిర్వహించిన ఫిట్‌ ఇండియా సర్వేలో తమ వర్కవుట్‌ దుస్తుల విషయంలో సౌకర్యానికే ప్రాధాన్యమిస్తామని 56శాతం మంది మహిళలు స్పష్టం చేశారు. ప్రపంచస్థాయి డిజైనర్లు కెల్విన్‌ క్లీన్, స్టెల్లా మైక్‌ కార్ట్‌నీ, అలెగ్జాండర్‌ వాంగ్‌... వంటివారు ప్రత్యేకంగా ఫిట్‌నెస్‌ క్లోతింగ్‌ లైన్స్‌ను విడుదల చేస్తున్నారు. అలాగే గ్యాప్, ఫరెవర్‌ 21, విక్టోరియా సీక్రెట్, మెర్సీస్‌... వంటి బ్రాండ్స్‌ కూడా యాక్టివ్‌వేర్‌ పేరుతో వీటిని అందిస్తున్నాయి.  

అవుట్‌ ఫిట్‌.. అదరహో
ఇలాంటి ఆలోచనలు, స్టైల్‌గా ఉండాలనే ఆకాంక్షలకు అనుగుణంగా డిజైనర్లు ఫిట్‌నెస్‌ అవుట్‌ ఫిట్‌ను డిజైన్‌ చేస్తున్నారు. వీటిలో కొన్ని కదిలే సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా, ఎక్కువ కండరాలు పనిచేయాల్సిన అవసరాన్ని తగ్గించి.. తద్వారా తక్కువ అలసట కలిగేందుకు కారణమవుతాయి. అలాగే వ్యాయామానంతరం కండరాల నొప్పులు రాకుండా వాటికి సున్నితంగా మసాజ్‌ చేసేలాంటి ఫ్యాబ్రిక్స్, రక్త సరఫరాను పెంచి, వ్యాయామం ద్వారా ఉత్పన్నమైన అనవసరమైన రసాయనాలు ఏవైనా ఉంటే వాటిని దేహం నుంచి బయటకు పంపేలా రూపొందిస్తున్నారు. చెమటను వేగంగా పీల్చుకునే మెష్‌ బ్యాక్‌ టెక్నాలజీతో జాగర్‌ టైట్స్, వర్కవుట్‌ లుక్‌కి స్టైల్‌ని జత చేసే విధంగా బ్రైట్‌ స్టిప్పర్స్, స్పోర్టీ బ్రాలో ఇన్‌బిల్ట్‌ ప్యాడ్స్‌ కూడా అమరుస్తున్నారు. కదలికల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా స్వేచ్ఛగా కదిలేందుకు వీలుగా ఎలాస్టిక్‌ స్ట్రాప్స్‌తో డిజైన్‌ చేస్తున్నారు. స్పీడ్‌ విక్‌ టెక్నాలజీ ద్వారా ఇవి దేహాన్ని అవసరమైనంత కూల్‌గా ఉంచుతున్నాయి. కలర్‌ బ్లాక్డ్‌ కాప్రి పేరుతో నడుం  నుంచి పిక్కల వరకు మాత్రమే ఉండే టైట్‌ ట్రాక్స్‌ కూడా సిటీలో బాగా ఫేమస్‌. పాలిస్టర్‌ ఫ్యాబ్రిక్‌ మేళవించిన స్పీడ్‌ విక్‌ మాయిశ్చర్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీతో వీటిని రూపొందిస్తున్నారు. నడుము దగ్గర ఓ వెయిస్ట్‌ బ్యాండ్‌ను కంఫర్ట్, ఫిట్‌కు అనువుగా అమరుస్తున్నారు. టైట్స్‌ ఆఫ్‌ ది మూమెంట్‌ పేరుతో జామెట్రిక్, నియోన్‌ ప్రింట్స్‌తో టైట్స్‌ అందుబాటులోకి తెస్తున్నారు.  

రైట్‌ యాక్ససరీస్‌...
వ్యాయామాలకు తగిన యాక్ససరీస్‌ సైతం సిటీజనులకు అందుబాటులోకి వచ్చాయి. క్లోజ్డ్‌ సెల్‌ టెక్నాలజీతో తయారైన యోగా మ్యాట్స్‌ స్వేదాన్ని తగ్గిస్తాయి. ఆసనాలు వేయడానికి అనువుగా కుషనింగ్‌తో మ్యాట్స్‌ లభిస్తున్నాయి. వర్కవుట్స్‌ పూర్తయ్యాక ధరించేందుకు లెదర్, నైలాన్‌ల మేళవింపుతో స్లిమ్‌ ఫిట్‌ బాంబర్‌ జాకెట్స్‌ అందిస్తున్నారు. వర్కవుట్‌ అనంతరం వెంటనే హైడ్రేట్‌ కావడానికి గాను కూల్‌సిప్పర్‌ వంటి పేర్లతో ప్రత్యేకమైన వాటర్‌ బాటిల్స్‌ సైతం లభిస్తున్నాయి. క్రాస్‌ఫిట్‌ లాంటి కొత్త కొత్త ఫిట్‌నెస్‌ ట్రెండ్స్‌ కూడా తయారీదార్లను ప్రభావితం చేస్తున్నాయి. మోకాలి వరకు ఉండే సాక్స్, కలర్‌ఫుల్‌ ట్యాంక్స్, హెడ్‌ బ్యాండ్స్‌ తరహా యాక్ససరీస్, బిగుతైన ఆర్మ్‌ బ్యాండ్స్‌ తదితర మార్కెట్‌లో లభిస్తున్నాయి. షూ లేకుండా చేసే పిలాట్స్‌ వర్కవుట్స్‌ కోసం కూడా నైక్‌... లైట్‌ వెయిట్‌ ఫుట్‌ ర్యాప్‌ని స్పెషల్‌గా సృష్టించిందంటే ఫిట్‌నెస్‌ ఉత్పత్తులపై కంపెనీలు ఎంత కుతూహలంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.  

జాగ్రత్తలు అవసరం.. 
వర్కవుట్‌ సమయంలో ధరించే దుస్తులను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని నగరానికి చెందిన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ వెంకట్‌ సూచించారు. యోగా క్లాసెస్‌ అయితే లెగ్గింగ్స్‌ లేదా యోగా ప్యాంట్స్‌ ఎంచుకోవాలి. జంపింగ్‌లు ఎక్కువగా ఉండే కార్డియో వ్యాయామాలైతే బిగుతైన లైనింగ్‌ ఉండే లూజ్‌
షార్ట్స్‌ ధరించాలి. ఇలా వర్కవుట్‌కి అనుగుణంగా దుస్తులు ధరించాలని, వ్యాయామానంతరం దుస్తులను తప్పనిసరిగా వాష్‌ చేయాలని చెప్పారు.  
వదులైన దుస్తులు మెషిన్‌లో ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది. ఏ దుస్తులైనా ముందస్తుగా వ్యాయామం చేసి పరీక్షించుకోవడం అవసరం.
వీలైనంత వరకు వ్యాయామ సమయంలో ఎలాంటి ఆభరణాలు గానీ, వాచ్‌ లాంటివి గాని లేకుండా చూసుకోవాలి.
రన్నింగ్‌ షూస్‌ క్రాస్‌ ట్రైనింగ్‌ వర్కవుట్‌కి పనికిరావు. అలాగే సరిగా ఫిట్‌ అవని సాక్స్‌ కూడా రకరకాల సమస్యలకు దారి తీస్తాయి. 

వార్డ్‌రోబ్‌లో ప్రత్యేకం...

యోగా, జిమ్, డ్యాన్స్‌... ఫిట్‌నెస్‌ కోసం ఇవన్నీ తప్పదు. అలాగే వర్కవుట్‌కి అనుగుణంగా డ్రెస్సింగ్‌ అవసరం. ఫిట్‌నెస్‌ అవుట్‌ ఫిట్‌ కోసం నా వార్డ్‌రోబ్‌లో ప్రత్యేకంగా కొంత స్పేస్‌  కేటాయించాను. దాదాపు ప్రతి నెలా వర్కవుట్‌కి సంబంధించిన ఏదో ఒక అవుట్‌ ఫిట్‌ లేదా యాక్ససరీస్‌ కొనాల్సిన అవసరం ఏర్పడుతోంది.   – సుశీలా బొకాడియా, పేజ్‌త్రీ సోషలైట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement