యువ తార షాహిద్ కపూర్
ఫ్యాషన్
ఫ్యాషన్ గురించి పెద్దగా పట్టింపులు లేవు. మనకు ఏది సౌకర్యంగా ఉంటుందో అదే అత్యుత్తమ ‘ఫ్యాషన్’ అని నేను నమ్ముతాను.
స్టైల్ అనేదానికి ప్రత్యేకమైన నిర్వచనం లేదు. ఒకరికి నప్పిన స్టైల్ వేరొకరికి నప్పకపోవచ్చు. స్టైల్ పేరుతో బిగుతైన టీషర్ట్‌లను ధరించడం నా వల్ల కాదు! మార్పు ఆహ్వానించదగినదేగానీ, మార్పు కోసం మార్పు అనే విధానం కొన్ని సార్లు అంతగా విజయవంతం కాకపోవచ్చు. పర్టిక్యులర్ లుక్‌తో సౌకర్యవంతంగా ఉంటే, దాన్ని కొనసాగించడమే మంచిది.
ఫిట్‌నెస్
- ఫిట్‌నెస్‌కు నా జీవితంలో అధిక ప్రాధాన్యత ఇస్తాను. జిమ్‌లో గడిపిన ప్రతి రోజూ మనసు ఆనందంగా ఉంటుంది.
- నేను సినిమాల్లో నటిస్తున్నాను కాబట్టి ఫిట్‌నెస్‌తో ఉండాలి లేదా ఫలానా వృత్తిలో ఉన్నాను కాబట్టి ఫిట్‌నెస్‌తో ఉండాలి...అని అంటూ ఉంటారు. నిజానికి ఏ వృత్తిలో ఉన్నా ఫిట్‌నెస్ అనేది ముఖ్యమే. మొదట్లో నా బాడీ అద్దంలో చూసుకుంటే నాకే జాలిగా అనిపించేది. జిమ్‌కు వెళ్లడం అలవాటైన తరువాత నా బాడీలో మార్పు వచ్చింది. అది నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది కూడా.
జయాపజయాలు...
- అపజయాల కంటే జయాలే నన్ను ఎక్కువ భయపెడతాయి. ఒక్క విజయం వచ్చిందటే చాలు దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది.
- పశంసలు పొందే అర్హత ఉండాలంటే విమర్శలు తట్టుకునే సహనం ఉండాలి.
- మన పని మీద రకరకాల అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నప్పుడు.. వెంటనే వాటికి సమాధానం చెప్పాలనే తొందరపాటు కంటే ‘మౌనం’ గా ఉండడమే మేలు. ఆ తరువాత అవసరమైతే గొంతు విప్పవచ్చు.