143 ప్రేమ .. 420 మోసం | Legal Case understand badukuntunnam | Sakshi
Sakshi News home page

143 ప్రేమ .. 420 మోసం

Published Tue, Nov 29 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM

143 ప్రేమ .. 420 మోసం

143 ప్రేమ .. 420 మోసం

లీగల్‌ కేస్ అర్థం చేసుకోవడానికే తల బాదుకుంటున్నాం..
‘143’ ఏంటీ? ‘420’ ఏంటి?
‘143’ అంటే... యూత్‌కి తెలిసిన, మీకు తెలియని ‘ఐ లవ్ యూ’!
‘420’ అంటే యూత్‌కి తెలియకపోయినా మీకు తెలిసిన ‘ఐపీసీ సెక్షన్’... మోసం!
ప్రేమ, మోసం... ఈ రెండిటినీ అమ్మాయిలు ఎలా హ్యాండిల్ చేయాలన్నదే క్వశ్చన్!
ప్రేమకు మా దగ్గర ఆన్సర్ లేదు.. మోసానికి మాత్రం  ‘సెక్షన్ 420’ ఉంది!!

‘ఇది మా అమ్మమ్మ చేయించిన గొలుసు.. మా వాళ్లకు తెలిసేలోపు తిరిగి ఇచ్చేయాలి’... తన మెడలోని గొలుసు తీసి ప్రవీణ్ చేతిలో పెడుతూ చెప్పింది భార్గవి.  ‘ఇదే కాదు ఇంతకు ముందు నువ్వు ఇచ్చిన డబ్బులతో సహా అన్నీ త్వరలోనే తిరిగి ఇచ్చేస్తాను’... గొలుసును జేబులో వేసుకుంటూ చెప్పాడు ప్రవీణ్. దిగులుగా చూసింది భార్గవి.‘భయపడకు.. మీ ఇంట్లో వాళ్లకు తెలిసేలోపే అన్ని సర్దేస్తాను.. ఓకేనా’అన్నాడు... భార్గవి రెండు చేతులను పట్టుకుంటూ భరోసా ఇస్తున్నట్టుగా!నిట్టూర్చి ప్రవీణ్‌ను అల్లుకుపోయింది భార్గవి.

ఆ ఇద్దరూ డిగ్రీలో క్లాస్‌మేట్స్. ప్రస్తుతం గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు. ఒకే కోచింగ్ సెంటర్‌లో కోచింగ్ తీసుకుంటున్నారు. ఆ అమ్మాయిది హైదరాబాద్. అబ్బాయి ఓ జిల్లా కేంద్రం నుంచి వచ్చాడు. భార్గవి వాళ్లది కాస్త ఉన్న కుటుంబమే. ప్రవీణ్ మధ్యతరగతికి కుటుంబానికి చెందినవాడు. డిగ్రీలో మొదలైన వాళ్ల స్నేహం గ్రాడ్యుయేషన్ పూర్తయి, గ్రూప్స్‌కి వచ్చేటప్పటికి ప్రేమగా మారింది. అదే చనువుతో ప్రవీణ్ భార్గవిని డబ్బులు అడుగుతున్నాడు. ఆమె తాను దాచుకున్న పాకెట్ మనీ సహా తన దగ్గరున్న బంగారమూ ఇస్తోంది.

నెల రోజుల తర్వాత..
ఒకరోజు ‘అమ్మా... ఇంట్లో ఉంటే చదవడం కుదరట్లేదు. మా ఫ్రెండ్స్ రూమ్‌లో ఉండి చదువుకుంటా’... అంది భార్గవి.  ‘కాళ్లు విరగ్గొడ్తా.. కోచింగ్‌కి వెళ్తున్నది చాలు! చదవడం కుదరకపోతే ఆపేయ్’...సమాధానం కోపంగా వచ్చింది తల్లి దగ్గర్నుంచి  ‘ఎందుకలా కోప్పడ్తావ్? నలుగురితో కలిసి చదువుకుంటే మంచిదే! వెళ్లనీ.. ’ భార్యను వారిస్తూ, ‘ఏ ఫ్రెండ్సమ్మా.. ఎక్కడుంటారు?’ అని కూతురి దగ్గర వివరాలు తీసుకున్నాడు భార్గవి తండ్రి.

మోసం...
‘ఉదయం తొమ్మిదింటికి వస్తానన్న దానివి రాత్రి తొమ్మిదింటికా రావడం? ఫోన్ చేస్తే కట్ చేశావ్.. ఆ తర్వాత స్విచ్ ఆఫ్. నేనెంత కంగారు పడ్డానో తెలుసా?’ ... బట్టల బ్యాగ్, పుస్తకాల సంచీతో లోపలికి వచ్చిన భార్గవి వెనకాలే వెళ్తూ అన్నాడు ప్రవీణ్.  ‘ఆపుతావా? బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఉంటానంటే ‘సరేనమ్మా.. మంచి పని.. వెళ్లిరా’ అంటూ దగ్గరుండి సాగనంపుతారనుకున్నావా పెద్దోళ్లు? తోలు వలుస్తారు. ఫ్రెండ్స్ రూమ్‌లో ఉంటానని అబద్ధం చెప్పి బయలుదేరబోతుంటే మా నాన్న దింపుతానన్నారు. గతుక్కుమన్నా. ఏ ఫ్రెండ్ రూమ్ అని చెప్పాలి? అప్పటికప్పుడు స్రవంతికి కాల్ చేసి బతిమాలుకున్నా. ఎలాగూ దాని దగ్గరకి వెళ్లాను కాబట్టి ఇప్పటిదాకా ఉండి వచ్చా.. అర్థం అయిందా?’... తల మీద తడుతూ అన్నది భార్గవి.

తనతో కలిసి ఉండమని భార్గవిని ఎప్పటినుంచో అడుగుతున్నాడు ప్రవీణ్. పెళ్లికాకుండా ఉండనని కరాఖండిగా చెప్పింది మొదట. ఉద్యోగం వచ్చాక తప్పకుండా పెళ్లి చేసుకుంటా.. అప్పటిదాకా లివ్ ఇన్‌లో ఉందామని చాలా బలవంత పెట్టాడు. పెళ్లి మాట ఇచ్చాడు కాబట్టి అమ్మానాన్నకు అబద్ధం చెప్పి, ప్రవీణ్‌తో కలిసి ఉండే ధైర్యం చేసింది భార్గవి. మూడుముళ్లు లేవు కానీ భార్యభర్తల్లాగే వాళ్లు సహజీవనం చేయసాగారు.

ఇంకో నెల గడిచింది..
వారానికి ఒకటి రెండుసార్లు ఇంటికి వెళ్లొస్తోంది భార్గవి... తన తల్లితండ్రులకు అనుమానం రాకుండా.  అబద్ధాన్ని దాచే ప్రయత్నం ఒకవైపు, ఇంకోవైపు... ప్రవీణ్‌తో సాన్నిహిత్యం... చాలా ఒత్తిడికి గురైంది. ప్రవీణ్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన చదువు తాను చదవసాగాడు. పరీక్షలు అయిపోయాయి. ప్రవీణ్ గ్రూప్స్‌కొట్టాడు. భార్గవి తప్పింది. ఇంటర్వ్యూలోనూ సెలెక్ట్ అయి ఉద్యోగం ఖాయమైంది ప్రవీణ్‌కు. తన జిల్లా జోన్‌లోనే పోస్టింగ్. త్వరలోనే తన తల్లితండ్రులతో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తానని చెప్పి ప్రయాణమయ్యాడు.

పల్లెకు ఎక్కువ... పట్నానికి తక్కువ...
మరో రెండు నెలలు గడిచాయి. అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడ్డం తప్ప ప్రవీణ్ ఇంకే కమ్యూనికేషన్‌నూ పెట్టుకోలేదు భార్గవితో.  ఎప్పుడు ఫోన్‌లో మాట్లాడినా ‘మన విషయం మా పేరెంట్స్‌కి చెప్పే ప్రయత్నమే చేస్తున్నా’ అంటున్నాడు. ఒకసారి... ‘నిన్ను చూడాలనుంది ప్రవీణ్! నువ్ పనిచేసేచోటికి వస్తా’ అని అడిగింది.

‘అయ్యో.. అంతపని చేయకు. ఈ ఊరు పల్లెకు ఎక్కువ.. పట్నానికి తక్కువ. పెళ్లికాకుండా నువ్ ఇక్కడికి వస్తే నానారకాలుగా మాట్లాడుకుంటారు మా స్టాఫ్, ఇక్కడి జనం. వద్దు’ అన్నాడు. ‘అదేంటి? మనం లివ్ ఇన్‌లో ఉన్నవాళ్లమే కదా.. పైగా రేపోమాపో అధికారికంగా పెళ్లీ చేసుకోబోతున్నాం! ఎవరేమనుకుంటే మనకేం? ఒకవేళ అలా మొహమ్మీదే ఏమైనా అంటే చెప్పడానికి జవాబుందిగా మన దగ్గర. ఎందుకు భయం?’ ఎలాగైనా ప్రవీణ్‌ను ఒప్పించాలనే ఉద్దేశంలో ఉంది భార్గవి. ‘మొండిగా మాట్లాడకు భార్గవీ! ఇన్నాళ్లు ఓపిక పట్టావ్. ఇంకొన్ని రోజులే! ప్లీజ్ అర్థం చేసుకో’ అని చెప్పి.. ‘ఆ.. భార్గవీ.. ఇప్పుడో మీటింగ్ అటెండ్ అవ్వాలి.. మళ్లీ చేస్తా’ అంటూ భార్గవి రెస్పాన్స్ వినకుండానే ఫోన్ కట్ చేశాడు. అదే ప్రవీణ్ నుంచి చివరి ఫోన్ అయింది. మళ్లీ తను ఎప్పుడు చేసినా బిజీగా ఉన్నాను అంటూ ఫోన్‌పెట్టేసేవాడు. అలా ఓ వారం తర్వాత అసలు అతని ఫోనే స్విచాఫ్ అయింది. ఏమైందో.. విషయం ఏంటో.. తెలియదు.

ఒకసారి అతని ఆఫీస్‌కి కాల్ చేసి కనుక్కుంది. లీవ్ మీద వెళ్లాడు అని చెప్పారు. ఏం జరిగిందోనని ఆందోళన పడసాగింది. అలా పదిహేను రోజులు గడిచిపోయాయి. ప్రవీణ్ ఫ్రెండ్స్ అందరినీ అడిగింది. ఎవరి దగ్గరా ఏ ఇన్‌ఫర్మేషన్ లేదు. ఈలోపు ఇంట్లో ఆమెకూ పెళ్లి సంబంధాలు చూడసాగారు. ఆందోళన ఇంకా ఎక్కువైంది.

నిశ్చితార్థం
అనుకోకుండా ఒకరోజు షాపింగ్‌మాల్‌లో భార్గవికి, ప్రవీణ్‌కి కామన్‌ఫ్రెండ్ అయిన శాంతి కలిసింది. డిగ్రీ తర్వాత అదే మొదటిసారి భార్గవి ఆమెను చూడ్డం. చదువుకునే రోజుల్లో భార్గవి, ప్రవీణ్ చాలా చనువుగా ఉండేవారని తెలుసు కాని తర్వాత పరిణామాలేవీ తెలియవు శాంతికి. డిగ్రీ అయిపోగానే ఆమెకు పెళ్లయిపోవడంతో ఫ్రెండ్ సర్కిల్‌కు దూరమైంది. ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ ‘మా వారు, మన డిగ్రీ క్లాస్‌మేట్ ప్రవీణ్ ఒకే ఆఫీస్‌లో పనిచేస్తారు తెలుసా?’అంది శాంతి.

‘అవునా?’అని ఆశ్చర్యపోయి.. ఒక తీగ దొరికింది అనుకొని ‘అవునూ ఇప్పుడు ప్రవీణ్ ఎలా ఉన్నాడు?’ అని అడిగింది భార్గవి... ప్రవీణ్ గురించి కొంతైనా తెలుస్తుందనే ఆశతో. ‘ఓ.. అయితే మీరు టచ్‌లో లేరా? ప్రవీణ్‌కి పెళ్లి కుదిరింది. బహుశా రేపో.. ఎల్లుండో నిశ్చితార్థం అనుకుంటా’ చెప్పింది శాంతి చాలా క్యాజువల్‌గా. షాకైంది భార్గవి. ప్రతిమలా నిలబడి పోయింది. ‘హేయ్.. భార్గవీ... వాట్ హ్యాపెండ్’ అంటూ భార్గవిని కుదిపేసింది శాంతి.

భార్గవి తేరుకొని తమాయించుకుంది. అక్కడే ఉన్న ఓ కుర్చీలో కూలబడ్డది. గబగబా మంచినీళ్ల సీసా అందించింది శాంతి. ఒక గుక్క నీళ్లు తాగిందో లేదో... ఇంక ఆపుకోలేకపోయింది భార్గవి. ‘మోసపోయాను శాంతీ! దారుణంగా మోసపోయా’ అంటూ భోరున ఏడ్చేసింది. ఆమె స్థిమిత పడ్డాక సంగతంతా కనుక్కొంది శాంతి. ‘దుర్మార్గుడు ఎంత పనిచేశాడు! ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావ్?’ అని అడిగింది. ‘వాళ్లూరు వెళ్లి వాడి భాగోతం బయట పెడతా. పెళ్లి ఎలా చేసుకుంటాడో చూస్తా’ అంది నిశ్చయంగా భార్గవి. ‘క్షణం కూడా ఆలస్యం చేయకు. తోడుగా నేనూ వస్తా. అవసరమైతే సాక్ష్యంగా ఉంటా’ అంటూ ధైర్యమిచ్చింది శాంతి. తెల్లవారుతూనే... శాంతి తోడుతో ప్రవీణ్ వాళ్ల ఊరు చేరుకుంది భార్గవి.

కంప్లైంట్
ఇంటి ముందున్న భార్గవి, శాంతిని చూసి హతాశుడయ్యాడు ప్రవీణ్. ఎందుకొచ్చారంటూ వాళ్లను బెదిరించే ప్రయత్నం చేశాడు. అయినా బెదరలేదు వాళ్లు. అతని తల్లితండ్రులతో ప్రవీణ్‌చేసిన మోసాన్ని పూసగుచ్చినట్టు చెప్పింది భార్గవి. అదంతా అబద్ధమని.. ఫ్రెండ్‌షిప్ చేసిన పాపానికి నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తోందని, నా పెళ్లి చెడగొట్టాలని చూస్తోందని బుకాయించాడు ప్రవీణ్. అంతేకాదు తల్లితండ్రులతో కలిసి భార్గవి మీద పోలీస్ కంప్లయింట్ కూడా ఇచ్చాడు. పరిస్థితి చేయి దాటుతోందిని గ్రహించిన శాంతి వెంటనే భార్గవి తల్లితండ్రులకు కబురు పెట్టింది వెంటనే ఆ ఊరికి బయలుదేరి రమ్మని. ఈసారి షాక్ అవడం భార్గవి వాళ్ల తల్లితండ్రుల వంతయింది. కూతురు పట్ల కోపం, బాధా ఉన్నా.. జరగాల్సిన దాని గురించి ఆలోచించి, ప్రవీణ్ వాళ్ల ఊరొచ్చారు.

పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐకి ప్రవీణ్‌తో తనకున్న రిలేషన్‌ను వివరించింది భార్గవి. ఆధారాలూ చూపించింది. శాంతీ సాక్ష్యం చెప్పింది. అంతా అర్థమైంది పోలీసులకు. ప్రవీణ్ నిశ్చితార్థాన్ని ఆపేశారు. భార్గవినే చేసుకోవాలని చెప్పారు.

కానీ...
భార్గవి.. ప్రవీణ్‌తో పెళ్లికి అంగీకరించలేదు సరికదా.. తనను మోసం చేసినందుకు అతని మీద కేస్ వేసింది.

మోజు తీరి వదిలేస్తుంటే...
ప్రేమించాననీ, పెళ్లికి పెద్దవాళ్లను ఒప్పించే వరకు సహజీవనం చేద్దామనీ అంటూ అమ్మాయిలతో శారీరక సంబంధాలు పెట్టుకొని మోజు తీరాక వదిలేస్తున్నారు కొంతమంది అబ్బాయిలు. ఈ కేస్‌లో ప్రవీణ్ ఆ కోవకు చెందినవాడే. ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లి ఆశ చూపి సహజీవనం చేసి, భార్గవిని మోసం చేశాడు. భార్గవి అతని భవిష్యత్తుకు బాటవేసి తన భవిష్యత్తును కూల్చుకుంది. నిలదీసినందుకు అవమానపడింది. అందుకే ఆమె ఆత్మాభిమానం ఆ మోసగాడితో పెళ్లికి నో అంది. పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది.  చీటింగ్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్... అంటే ఐపీసీ సెక్షన్లు 420, 406, 354, 509,323 కింద ప్రవీణ్ మీద కేసు నమోదైంది. చాటుమాటుగా కలుసుకోవడం, ఎవరికీ తెలియకుండా దొంగతనంగా కలిసి ఉండడం, అదీ కొంతకాలమే సాగడం... సహజీవనం కాదు.
ఇ. పార్వతి, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్
- సరస్వతి రమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement