
అది చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్.. వాంగ్‌కీ అనే 41 ఏళ్ల మహిళ. ఆన్‌లైన్ ద్వారా 2016లో ఓ ‘యువకుడు’ పరిచయమయ్యాడు. ‘అతడి’ పేరు కియాన్. అతడు వయసులో చాలా చిన్నవాడని.. ఇద్దరికీ కుదరదని వాంగ్‌కీ చెబుతూనే ఉంది. తనకు పెళ్లయి విడాకులయ్యాయని, ఓ పాప కూడా ఉందని కియాన్‌తో నచ్చజెప్పింది. కొంతకాలానికి ఎలాగోలా వాంగ్‌కీని కియాన్ ప్రేమలో పడేశాడు. డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వాంగ్‌కీని కియాన్ ఇంటికి తీసుకెళ్లి తన తల్లిదండ్రులకు పరిచయం కూడా చేశాడు.
ఇప్పటివరకు అంతా బాగానే ఉన్నా 2017 నవంబర్ నాటికి ‘అతడి’ అసలు బండారం బయటపడింది. సడన్‌గా కియాన్ కనిపించకుండా మాయమయ్యాడు. అయితే అప్పటికే కియాన్‌కు వాంగ్‌కీ అవసరం ఉన్నప్పుడల్లా డబ్బులు కూడా ఇచ్చింది. తనను మోసం చేసిన కియాన్‌ను ఊరికే వదలకూడదని భావించి కియాన్ పుట్టుపూర్వోత్తరాలు లాగడం మొదలుపెట్టింది. తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆరా తీయగా, వారికి ఉన్నది ఏకైక కుమార్తె అని కుమారులు ఎవరూ లేరిన చెప్పడంతో వాంగ్‌కీ అవాక్కయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కియాన్ ఎక్కడున్నాడో.. సారీ ఎక్కడుందో ఇప్పటికీ తెలియదు.