కుమారి పుట్టింది కేరళలోని రామమంగళం. మధ్య తరగతి కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయదారులు. అక్షరం జీవితాన్ని వెలిగిస్తుందని నమ్మారు. పిల్లలిద్దరినీ చదివించి తీరాలనుకున్నారు. కుమారి, ఆమె తమ్ముడు.. ఇద్దరూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కుమారి... అమ్మానాన్నల పెద్ద బిడ్డ కావడంతో ఆ ఇద్దరిలో ముందుగా గ్రాడ్యుయేట్ అయ్యారు. అయితే ఆ రికార్డు ఆ ఇంటికి మాత్రమే పరిమితం కాలేదు. ఊరంతటికీ రికార్డే. కేరళ అక్షరాస్యతలో ముందున్నప్పటికీ... అప్పటివరకు ఆ ఊర్లో పట్టభద్రులైన వాళ్లు లేరు. కుమారి ఆ రికార్డును బ్రేక్ చేశారు. ఆమె ఆ చదువుతో తన కుటుంబ జీవితాన్ని నిర్మించుకుని అక్కడితో గిరిగీసుకుని ఉండి ఉంటే ఆమె గురించి ఇంతగా చెప్పుకోవడానికి ఏమీ ఉండేది కాదేమో. ఆమె తన గ్రామంలో తర్వాతి తరం పిల్లలందరినీ గ్రాడ్యుయేట్‌లను చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఇప్పటికి ఆ సంఖ్య వెయ్యి దాటింది.
అత్తగారి మద్దతు
కుమారి పెళ్లి శిబులాల్‌తో జరిగింది. అతడు ఇన్ఫోసిస్‌లో సీఈవో హోదాలో ఉన్నాడు. పెళ్లితో కేరళ వదిలి ముంబయి, ఆ తర్వాత యూఎస్‌కు వెళ్లారు కుమారి. కొన్నేళ్ల తర్వాత 1997లో కుటుంబంతో సహా ఇండియాకి తిరిగి వచ్చారామె. ఆమె చేయదలుచుకున్న విద్యాసేవకు అత్తగారి కుటుంబం సంపూర్ణంగా మద్దతునిచ్చింది. కుమారి 1999లో సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ (ఎస్‌డీఎఫ్), 2004లో అద్వైత్ ఫౌండేషన్ స్థాపించారు. హైస్కూల్ పూర్తయిన పిల్లలందరూ జూనియర్ కాలేజ్‌లో చేరేలా చూడడం, ఇంటర్ పూర్తయిన తర్వాత విధిగా గ్రాడ్యుయేషన్‌లో చేర్పించడం ఆమె తలకెత్తుకున్న బాధ్యత. పిల్లల వయసుల వారీగా విద్యాదాన్, విద్యారక్షక్, అద్వైత్ ఫౌండేషన్, అంకుర్ ఫౌండేషన్‌లను స్థాపించి వాటిని సంయుక్తంగా నిర్వహిస్తున్నారామె.
అందరికీ తెలియాలి
‘‘పరోపకారంలో భారతదేశ సంస్కృతి మహోన్నతమైనది. అయినప్పటికీ గత ఏడాది 128 దేశాల వరల్డ్ గివింగ్ ఇండెక్స్ ర్యాంకులో భారతదేశానికి దక్కింది 82 స్థానం. ఇందుకు కారణం భారతదేశంలో, భారతీయుల్లో ఎదుటి వారికి ఇచ్చే గుణం లేదని కాదు. పరోపకారాలు పైకి తెలియకపోవడమే. ఎదుటి వ్యక్తి అవసరంలో ఉన్నట్లు గమనించినప్పుడు తమకు తోచిన సహాయం చేసేస్తారు. అంతేతప్ప ఒకరికి సహాయం చేయడానికి లెక్కలు, రిజిస్టర్‌లు మెయింటెయిన్ చేయరు. పరోపకారం చేసిన విషయానికి ప్రచారం కల్పించుకోకపోవడం, డాక్యుమెంట్‌లు తయారు చేసుకోలేకపోవడం, వాటిని ఇలాంటి పోటీలకు దరఖాస్తు చేసుకోకపోవడం వల్ల గణాంకాల ఆధారంగా వచ్చే ర్యాంకులలో పై స్థానాలకు చేరుకోవడం భారతదేశానికి కష్టమవుతోంది. నిజానికి భారతీయుల్లో సహాయం చేసేగుణం మెండు’’ అని చెప్పారు కుమారి. తమ కుటుంబం ఆర్థికంగా వెనుకపడిన కుటుంబాల పిల్లల ఉన్నత చదువుల కోసం చేస్తున్న సహాయాన్ని వివరిస్తూ... ‘‘ఇలాంటి కుటుంబాలు మనదేశంలో చాలానే ఉన్నాయి. ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చదివిస్తున్నామంటే అది ఆ ఒక్కరికి లేదా ఆ కుటుంబానికి మాత్రమే చేస్తున్న సహాయం కాదు. దేశానికి మనవంతుగా ఇస్తున్న సహకారం’’ అన్నారామె. – మంజీర
Comments
Please login to add a commentAdd a comment