పరమ పీనాసి ప్రభువు.. | Life story of John Elvis | Sakshi
Sakshi News home page

పరమ పీనాసి ప్రభువు..

Published Sat, Jul 11 2015 10:26 PM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM

పరమ పీనాసి ప్రభువు..

పరమ పీనాసి ప్రభువు..

పీనాసితనానికి పరాకాష్ట అంటే మనకు వెంటనే జంధ్యాల సృష్టించిన లక్ష్మీపతి పాత్రలో కోట శ్రీనివాసరావు నటనే గుర్తుకొస్తుంది. అంతకు మించిన పీనాసి ఒకడు బ్రిటన్‌లో ఉండేవాడు. అతగాడి పేరు జాన్ ఎల్విస్. అతగాడేమీ సామాన్యుడు కాదు. బెర్క్‌షైర్ నియోజకవర్గానికి ఎంపీగా దాదాపు ఒక పుష్కరకాలం (1772-84) వెలగబెట్టాడు.

ఎల్విస్‌కు నాలుగేళ్ల వయసులోనే అతడి తండ్రి పోయాడు. పోతూ పోతూ లక్ష పౌండ్ల (ఇప్పటి విలువ ప్రకారం 1.30 కోట్ల పౌండ్లు) ఆస్తి, బెర్క్‌షైర్ (ఇప్పటి ఆక్స్‌ఫర్డ్‌షైర్) ప్రాంతంలో సువిశాలమైన ఎస్టేట్‌ను విడిచిపెట్టాడు. ఎల్విస్ తల్లి అమీ పరమ పీనాసి. ఆమె పెంపకంలో చిన్నప్పటి నుంచే అతగాడి పీనాసి లక్షణాలన్నీ వంటబట్టాయి. కొన్నాళ్లకు తల్లి చనిపోయాక మేనమామ సర్ హార్వే ఎల్విస్ పంచన చేరాడు. అప్పటికి హార్వే ఎంపీగా ఉండేవాడు. అతగాడు మరింత పీనాసి. హార్వే 1763లో బాల్చీ తన్నేయడంతో ఎల్విస్‌కు అతగాడి ఆస్తి 2.5 లక్షల పౌండ్లు (ఇప్పటి విలువ ప్రకారం 2.4 కోట్ల పౌండ్లు) కలిసొచ్చింది.

ఇంత ఆస్తి అప్పనంగా కలిసొచ్చినా జాన్ ఎల్విస్ ఏనాడూ కులాసాలకు కాదు కదా, కనీస అవసరాలకు సైతం ఖర్చు చేసేవాడు కాదు. తిండి కోసం ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడేవాడు. పారవేసే పరిస్థితిలో ఉన్న పదార్థాలను కూడా తినేవాడు. కొవ్వొత్తులకు ఖర్చెందుకని చీకటిపడే వేళకు ముసుగు తన్నేసేవాడు. బిచ్చగాళ్లను తలపించే వస్త్రధారణతో రోడ్ల మీద తిరుగుతుంటే జనాలు అతడిని చూసి జాలిపడి, చేతిలో చిల్లర వేసేవారు. ఆ చిల్లరను కూడా కాదనకుండా తీసుకొని, నిక్షేపంగా జేబులో వేసుకొనేవాడు. పీనాసితనం వల్ల సరైన తిండి తినక శుష్కించిపోయి, 75 ఏళ్ల వయసులో మంచానపడి మరణించాడు. ఇతగాడి ప్రభావంతోనే చార్లెస్ డికెన్స్ తన నవల ‘ఎ క్రిస్మస్ కారోల్’లో ఒక పాత్రను సృష్టించాడు.
 
 కూర్పు: పన్యాల జగన్నాథదాసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement