
ఎడారికి పయనమైన చిన్నారి ముహమ్మద్
కన్న కొడుకులకన్నా మిన్నగా ప్రేమించి, ఆదరించి, చిన్నారి ముహమ్మద్ (స) మనోగాయాన్ని మాన్పడానికి శక్తివంచనలేని ప్రయత్నం చేశారు. చిన్నారి ముహమ్మద్ విషయంలో ఆయన సంతానాన్ని కూడా లెక్క చేసేవారుకాదు. ఎటు వెళ్తే అటు వెంట తీసుకెళ్లేవారు.
సుమారు పన్నెండేళ్ల వయసులో చిన్నారి ముహమ్మద్ (స) తోటిపిల్లలతో కలిసి మేకలు కాయడానికి అడవికి వెళ్లేవారు. ఆ కాలంలో అరేబియాలో మేకలు కాయడం పిల్లల శిక్షణలో ఒక భాగమే తప్ప, అదేమీ అవమానకర విషయం కాదు. గొప్ప వంశం పిల్లలు కూడా తప్పకుండా ఈ శిక్షణ పొందేవారు.
ఈ క్రమంలోనే ఒకసారి అబూతాలిబ్ వ్యాపార నిమిత్తం సిరియా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దూరతీరాల ప్రయాణం, పైగా కష్టనష్టాలతో కూడుకున్నది కావడం వల్ల చిన్నారి ముహమ్మద్‌ను వెంట తీసుకువెళ్లడం ఆయనకు ఇష్టం లేకపోయింది. కాని చిన్నారి ముహమ్మద్ (స) మాత్రం బాబాయిని వదిలి ఉండడానికి సిద్ధంగా లేరు. తీరా బయలుదేరుతున్న సమయంలో వచ్చి కాళ్లను చుట్టేశాడు. నిజానికి ఆయనకు కూడా అబ్బాయిని విడిచిపెట్టి వెళ్లాలని లేదు. ప్రయాణ మార్గం చాలా కఠినతరమైంది కావడం, సుదూరప్రయాణం కావడం వల్ల ఇంటి దగ్గరే వదిలేసి వెళదామనుకున్నారు.
కాని చిన్నారి ముహమ్మద్ (స) మారాం చూసిన తరువాత, ఒంటరిగా వెళ్లడానికి మనస్కరించలేదు. ఆయన్ని వెంటబెట్టుకొనే సిరియా పయనమయ్యారు అబూతాలిబ్. మక్కా నుండి బయలుదేరిన ఈ వర్తక బిడారం అనేక ప్రాంతాలు, పట్టణాలు దాటుకుంటూ, దుర్భరమార్గాలగుండా ప్రయాణం కొనసాగిస్తోంది.
చిన్నారి ముహమ్మద్ ప్రయాణంలోని కష్టనష్టాల కారణంగా, అలసటకు గురై తనకు భారమౌతారేమోనని భావించారు అబూతాలిబ్. కాని ఏమాత్రం అలసిపోకుండా, ఎంతో ఉత్సాహంతో ప్రయాణంలోని ఇతర వృద్ధులు, బలహీనులకు కూడా సహకరించడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఈ విధంగా ఈ వ్యాపారబృందం సిరియా సరిహద్దుల్లోకి ప్రవేశించి, ముఖ్యపట్టణం బస్రాలో విడిది చేసింది.
సమీపంలో ఓ చర్చీ ఉండేది. చుట్టుపక్కల ప్రజలకు అదొక పవిత్ర పుణ్యక్షేత్రం. ‘బహీరా’ అనే పేరుగల ఓ ప్రఖ్యాత క్రైస్తవ పండితుడు ఉండేవాడు. బైబిల్ జ్ఞానంతో పాటు, తౌరాత్‌ను కూడా ఔపోసన పట్టిన మహా పండితుడు. దైవప్రోక్తగ్రంథాల అధ్యయనం, సునిశిత పరిశీలనా దృష్టి, అపారమైన ధార్మిక పరిజ్ఞానం వల్ల భవిష్యత్తులో జరగబోయే విషయాల అవగాహన కూడా ఉందతనికి.
బాహీరా చర్చీకి దగ్గరలోనే అబూతాలిబ్ విడిది చేయడం వల్ల అతడి దృష్టి చిన్నారి ముహమ్మద్ (స)పై పడింది.
- యం.డి. ఉస్మాన్‌ఖాన్
(వచ్చేవారం మరికొన్ని విశేషాలు)