దండాలన్నా నాంపల్లి నర్సన్నా | lord srikrishna real Appearance | Sakshi
Sakshi News home page

దండాలన్నా నాంపల్లి నర్సన్నా

Published Wed, Aug 16 2017 12:03 AM | Last Updated on Sun, Sep 17 2017 5:33 PM

దండాలన్నా నాంపల్లి నర్సన్నా

దండాలన్నా నాంపల్లి నర్సన్నా

పుణ్య తీర్థం

ఐదు తలల సర్పాకారం... తలపై శ్రీకృష్ణుడి నృత్యరూపం.. 52 అడుగుల ఎల్తైన గుట్ట.. చుట్టూ పచ్చని పంటలు.. కనుచూపు మేర కనువిందుచేసే అందాలు...  మనసును ఉల్లాసంగా ఉంచే ప్రకృతి దృశ్యాలు...ఎన్నిసార్లు చూసినా... తనివి తీరని అద్భుత శిల్పాలు నాంపల్లిగుట్ట సొంతం. ఆ గుట్టపై శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఎంతో విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రం. పురాతనమైన ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు ఆనందానుభూతులలో ఓలలాడతారు.  

నాంపల్లిని పూర్వం నామపల్లిగా పిలిచేవారు. ఆరువందల ఏళ్ల కిందట ఈ గుట్టపై శ్రీలక్ష్మీనర్సింహస్వామి వెలసినట్లు చెబుతారు. శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో చోళుల కాలంలోనే స్వామివారికి పూజాదికాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. సహజ సిద్ధంగా ఓ వైపు మూలవాగు.. మరోవైపు మానేరు వాగులు ప్రవహిస్తుంటాయి. ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత లోపల ఉన్న అంజనేయస్వామి రాతి శిల. ఈ హనుమంతుడికి మండల దీక్షలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం. సిరిసిల్ల రాజన్న జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఆ ఆలయానికి దర్శనానికి వచ్చే భక్తులు నాంపల్లిగుట్టకు కూడా వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. కొత్తగా పెళ్లయిన జంటలు సంతానం కలగాలని మొక్కుకుని, కోరిక నెరవేరాక ఇక్కడ వనభోజనాలు చేస్తారు. రాజరాజనరేంద్రుడు, ఆయన సతీమణి కూడా స్వామివారిని సేవించి, సంతానాన్ని పొందినట్లు చారిత్రక కథనాలున్నాయి.

గుట్టపై గుహలు
నాంపల్లిగుట్టపై సహజసిద్ధమైన బండరాళ్ల మధ్య గుహలు, రెండు కోనేరులున్నాయి. ఇక ఆలయం పక్కనే ఉన్న చిన్న గుహలో శివలింగంతో పాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలకూ పూజలు జరుగుతాయి. క్రీ.శ 10 శతాబ్దంలో నవనాథ సిద్ధులు(తొమ్మిది మంది) ఈ గుట్టపై తపస్సు చేసి సిద్ధి పొందారని ప్రతీతి. నిత్యం నవనాథులు ఈ గుహ నుంచి భూగర్భ సొరంగ మార్గంలో వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేసే వారని చెబుతారు.

కాళీయ మర్దనం.. ప్రత్యేకత
నాంపల్లిగుట్ట ఆసాంతం సింహం నిద్రిస్తున్న తీరులో ఉంటుంది. గుట్ట ఎంత మహిమాన్వితంగా కనిపిస్తుందో ప్రకృతి అందాలతో అంతగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. సహజ సిద్ధమైన అందాలతో పాటు కాళీయమర్దనం మరో ప్రత్యేకత. ఐదుతలల సర్పాకారంలో నిర్మించిన నాగదేవత ఆలయం. నాగపాము తలపై శ్రీకృష్ణుడు పిల్లన గ్రోవితో నృత్యం చేస్తున్న దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఎటు నుంచి చూసినా గుట్టపై చెట్లపొదల్లో చుట్టుకుని పడుకున్న కొండంత పాములా కనిపిస్తుంది. పామునోటిలోనికి  వెళ్తుండగా.. శ్రీలక్ష్మీనర్సింహస్వామి లీలలను తెలిపే రకరకాల శిల్పాలు కనువిందు చేస్తాయి. గుట్టపైకి వచ్చిన వారు వీటిని మైమరచి చూస్తూ... నర్సింహుడి ఉగ్రరూపాన్ని, నాగదేవతను దర్శించుకుంటారు. నూనెతో, పాలతో స్వయంగా అభిషేకాలు నిర్వహించుకుంటారు.

వేడుకలు.. ఉత్సవాలు
ప్రతి శ్రావణమాసంలో సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామి కల్యాణం, శ్రీలక్ష్మీనర్సింహస్వామి కల్యాణం, శివరాత్రి వేడుకలు, శ్రీరామనవమి, గోదారంగనాథుల కల్యాణ వేడుకలు జరుగుతాయి. వేములవాడకు అతి సమీపంలో ఉన్న నాంపల్లిగుట్ట అభివృద్ధికి  తెలంగాణ పర్యాటక శాఖ రూ.29 కోట్లతో గుట్ట దగ్గర ధ్యానమందిరం, ప్లానెటోరియం, గుట్టపైకి రోప్‌వే, కాటేజీలు, లైట్‌ అండ్‌ సౌండ్స్‌ వంటి ఆధునిక వసతులను సమకూర్చేందుకు ప్రతిపాదించారు. గుట్టపైకి ఘాట్‌ రోడ్డు సౌకర్యం ఉంది.

ఎలా చేరుకోవాలి..!
నాంపల్లిగుట్టకు చేరాలంటే రోడ్డు మార్గం ఒక్కటే ఉంది. హైదరాబాద్‌ మీదుగా రావాలంటే సిద్దిపేట, సిరిసిల్ల గుండా 152 కిలోమీటర్లు ప్రయాణించి వేములవాడ చేరుకోవాలి. అక్కడి నుంచి మూడుకిలోమీటర్ల దూరంలో నాంపల్లిగుట్ట దర్శనమిస్తుంది. కరీంనగర్‌కు 32 కిలోమీటర్ల దూరంలో వేములవాడ మార్గంలో ఉంది. జగిత్యాల మీదుగావచ్చే వారు 55 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఆర్టీసీ బస్సు సౌకర్యం, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. గుట్టపైకి వాహనాలు వెళతాయి. మెట్ల గుండా ఆలయానికి చేరుకోవాలి.
– వూరడి మల్లికార్జున్, ‘సాక్షి’, రాజన్న సిరిసిల్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement