నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్.. అన్న! నేను మా మామని ఇష్టపడుతున్నాను. అది మా పేరెంట్స్‌కి ఇష్టం లేదు. మా మామకి కూడా ఇష్టం లేదు. మా మామ నాకంటే 9 ఏళ్లు పెద్దవాడు. అయినా మా మామే కావాలనిపిస్తోంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నా. మా మామని మరచిపోలేకపోతున్నా. దయచేసి సలహా ఇవ్వండి. – షైని
‘సార్ ఏంటి సార్ తెగ ఆలోచిస్తున్నారు..?’ మామ..! ‘ఎస్ మామ..!!’ అంటే.. అమ్మకు తమ్ముడా? ‘అయితే ఏంటి సార్..?’లేక... ‘లేక..!?!’ నాన్న చెల్లెలి మొగుడి తమ్ముడా?‘ఏంటి సార్ ఈ ఇన్వెస్టిగేషన్..?’లేక...‘అబ్బా టెన్షన్‌తో చస్తున్నాను.. లేక...!?!అక్క మొగుడి నాన్న తమ్ముడా?‘ఎవరైతేనేమి సార్..?’ లేక...! ‘లేకా..!?!’ అన్న భార్య తండ్రి బ్రదరా? ‘ఎవరైతేనేమి సార్.. ప్రేమించడానికి, తాళి కట్టించుకోవడానికి?’
తాళి ఏంటి తాళి అది కూడా మామతో? ‘మామో, దోమో.. ప్రేమించాక బద్ధ శత్రువైనా... పెళ్లి చేసుకుంటారు కదా సార్! ఏం సినిమాలు సూడ్డంలేదేంటి?’ దగ్గర బంధువులతో పెళ్లిళ్లు చేసుకుంటే పిల్లలు సరిగ్గా పుట్టరు. సారీ, నో మ్యారేజ్ విత్ మామా!! ‘ఈ ముక్క ముందే ఏడవచ్చు కదా సార్.. అమ్మకు తమ్ముడా? నాన్న చెల్లెలి మొగుడు తమ్ముడా? అక్క మొగుడి నాన్న తమ్ముడా? అన్న భార్య తండ్రి బ్రదరా..? అని చంపేశారు కదా! మీరు మంచి చెప్పినా తిప్పి తిప్పి చెప్పారు కాబట్టి.. నో అరటి పండు!!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com