
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్! నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా. తనకి కూడా నేనంటే చాలా ఇష్టం. వాళ్ల పెద్దలకు మా విషయం చెప్పి, వాళ్లు ఒప్పుకున్న తరువాతే నేను తనకి ఓకే చెప్పాను. లైఫ్‌లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అందుకే కష్టపడి చదివి జాబ్ తెచ్చుకున్నాడు. నేనూ ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను. అన్ని విషయాల్లోనూ చాలా బాగుంటాడు. కానీ, నేను వాట్సప్ ఆన్‌లైన్‌లో కనిపిస్తే గొడవ పడతాడు. ‘అమ్మాయిలతోనే మాట్లాడుతున్నా’ అని చెప్పినా వినడు.
ఇష్టమొచ్చినట్లు తిడతాడు. ఇలా తిడితే నాకు ఇష్టం ఉండదు అంటే.. ఇంకా ఎక్కువగా మాటలంటాడు. ‘నువ్వు నాకు చాలా ఇష్టం. నీ మాటలు, నీ ప్రేమ అంతా నాకే కావాలి. నువ్వు ఎవరితోనూ మాట్లాడొద్దు’ అంటాడు. అమ్మాయిలతో చాట్ చెయ్యాలన్నా సరే... తనకు చెప్పి, పర్మిషన్ తీసుకుని, అప్పుడు మాట్లాడాలి. ‘నేనంటే ఇష్టం ఉంటే నా రూల్స్ పాటించు, లేదంటే నీ ఇష్టమొచ్చినట్లు నువ్వు ఉండు’ అంటాడు. ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. సలహా ఇవ్వండి. – నమిషా
మూడు ముక్కల్లో చెబుతా బంగారం! అది ప్రేమ కాదు. పొసెసివ్‌నెస్. అదొక జబ్బు. తనకు సైకియాట్రిక్ హెల్ప్ అవసరం! నీకు తన అవసరం లేదు! రన్ అవే బిఫోర్ యు గెట్ హర్ట్! అమ్మకు చెప్పు. అవసరమయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వు! నీకు దండం పెడతా... అస్సలు టెంప్ట్ కావద్దు!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com