
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
సర్.. నా పేరు వైశాలి. బి.టెక్ పూర్తి చేశాను. నేను నా సీనియర్‌ను లవ్ చేస్తున్నాను. నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు తను మా సీనియర్. అప్పటినుంచి తనంటే చాలా ఇష్టం. తనను మూడు సంత్సరాలు చూడకపోయినా తనంటే ఇష్టం పోలేదు. నేను నాలుగు సంవత్సరాల నుంచి ఫేస్‌బుక్‌లో మేసేజ్‌లు పెడుతున్నాను. తను నా మేసేజ్‌లు చూసినా రెగ్యులర్‌గా రిఫ్లై పెట్టలేదు. అలాగని బ్లాక్ చేయలేదు. రీసెంట్‌గా ఓ సారి ‘ఐ లవ్ యూ టూ’ అని మెసేజ్ పెట్టాడు. తను మెసేజ్ పెట్టిన ఒక నెల వరకు నేను ఆ మెసేజ్‌ను చూడలేదు. తర్వాత నేను మెసేజ్ పెట్టినా రిఫ్లై లేదు.
కానీ అతను మోసం చేసే రకం కాదు. చాలా అమాయకుడు. అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడడు. బాగా చదువుతాడు. ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. నేను లవ్ చేస్తున్నాను కనుక అతని గురించి ఇలా చెప్పడంలేదు. అతను చాలా మంచివాడని నాకు కచ్చితంగా తెలుసు. రీసెంట్‌గా ‘నువ్వు వైశాలిని ప్రేమిస్తున్నావా? అని ఓ ఫ్రెండ్ తనని అడిగితే నేను వైశాలిని లవ్ చేయడం లేదు. అని చెప్పాడట’. తను లేకుండా నేను బతకలేను. మా కులాలు వేరు. బహుశా అదే తన ప్రాబ్లమ్ అయి ఉండవచ్చు. దయచేసి నా సమస్యకు త్వరగా పరిష్కారం చూపండి. ప్లీజ్ సర్. మీరు నీలాంబరితో కాకుండా నాతో మాట్లాడండి. ప్లీజ్ నాకు త్వరగా సమాధానం చెప్పండి. ప్లీజ్ సర్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్... – వైశాలి
రోడ్డు మీద నా మానాన నేను వెళుతుంటే డాష్ ఇచ్చాడు. గిర్రున తిరిగి ఢాం అని కింద పడ్డా.. ‘ఏయ్.. చూసుకోనక్కర్లేదా’ అని లేచా..?
వాడు తిరిగాడు.. మళ్లీ తిరిగాడు.. మళ్లీ మళ్లీ తిరిగాడు. వాడు అలా తిరిగి తిరిగి కనబడుతుంటే నాకు కళ్లు తిరిగాయి. ఢాం అని మళ్లీ పడ్డా. మళ్లీ లేచా. ‘ఏయ్.. వాట్ ఆర్ యూ డూయింగ్? ఎందుకలా రౌండ్ రౌండ్‌గా తిరుగుతావు? ఏదైనా జబ్బా?’
కళ్లజోడు తీసి పెట్టుకున్నాడు. మళ్లీ కళ్లజోడు తీసి పెట్టుకున్నాడు. మళ్లీ మళ్లీ కళ్లజోడు తీసి పెట్టుకున్నాడు. నా కళ్లు తిరిగాయి. ఢాం అని మళ్లీ పడ్డా. మళ్లీ లేచా. ‘ఎందుకు గుద్దావు... ఎందుకు తిరిగావు... ఎందుకు తిప్పుతున్నావు..?’ ‘అది నా స్టైల్.. నా దారి రహదారి. ఎవరు అడ్డం వచ్చి పూడ్చినా ఢాం...అంతే’. ‘వార్నీ నరసింహా.. నువ్వా! ఎక్కడ తగలడ్డావు రా ఇన్నాళ్లు? నీలాంబరి కోసం రెగ్యులర్‌గా ఆఫీసుకి వచ్చేవాడివి!’ ‘ఓహ్ లవ్ డాక్టర్... సార్వాడూ.. మీరా! హౌ ఆర్ యు?’‘రోడ్డు మీద పడేసి హౌ ఆర్ యూ ఏంటిరా నీ అరవ పిండాకూడు కాకులు తినా’.
‘సారీ మేష్టారూ. నీలాంబరికి జలక్ ఇవ్వడానికి కొంచెందా డిస్టెన్స్ మెయింటెన్స్ సేసి పూడుస్తున్నా. ఆమ్మాయిలకు డెప్త్ తెలియాలంటే కొంచెందా గ్యాప్ ఇవ్వాలి సారూ.. అప్పుడుదా ప్రేమ ఉడికీ ఉడికీ...’ ‘సాంబార్ అవుతుంది. నీ అరవ కుంపటి గాడిదలు తన్న!’ ‘ఎన్నంగో మేష్టారూ... శాల బాధలో ఉన్నావు’. ‘నా బాధ ఎందుకులే నీ అరవ ప్రేమ లాజిక్ ఏడువ్. అయినా నీలాంబరికి ఇంత గ్యాప్ ఇస్తే ఇంకెవరైనా ట్రై చేసుకుంటారేమో. ముందే బ్యూటీ. ఆమె వెనకాల ఎంతమంది క్యూ కట్టారో తెలుసుగా...’ ‘తెలుసు తలైవా... పందులు గుంపులుగా వస్తాయి, సింగం సింగిల్‌గాదా వస్తది. నీలాంబరి ఎప్పోదుమ్ నాదే’. ‘నీ అరవ పౌరుషం గద్దలు తన్నుకుపోనూ.. ముందు లుంగీ దించు భరింలేకపోతున్నాను’. అమ్మా.. వైశాలీ.. మగాళ్లతో ఇదే ప్రాబ్లమ్. ఛీ పో అంటే వెంట పడతారు. హాయ్ అంటే పోజు కొడతారు. బి కేర్ ఫుల్.నీలాంబరితో మాట్లాడకుండా సమాధానం ఇద్దామంటే మేడమ్ లవర్ నా దుంప తీశాడు... ఇంకోసారి నీలాంబరి వద్దు అనొద్దు ఫ్లీజ్.
-ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com