నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హలో అన్నయ్యా, 8వ తరగతి నుండి ఒక అబ్బాయి, నేను ప్రేమించుకుంటున్నాం. మాది ఒకే ఊరు. ఎంబీఏ వరకు మా ప్రయాణం బాగానే సాగింది. ఎంబీఏ ఫైనల్ ఇయర్‌లో ఉండగా నా ప్రేమ మా ఇంట్లో తెలిసిపోయింది. కానీ మా నాన్న నాకన్నా కులాన్నే ఎక్కువగా ప్రేమించాడు. బలవంతంగా, నన్ను బ్లాక్‌మెయిల్ చేసి ఏడాది కిందట పెళ్లి చేశాడు. ఆ పెళ్లికొడుకు మా ఊరికే చెందిన మా దూరపు బంధువే. ఆ బావకు నా ప్రేమ గురించి మొత్తం తెలుసు. ఈ సంవత్సరంలో ఒక్కరోజు కూడా నేను సంతోషంగా లేను. తనని వదిలేసినందుకు కుమిలిపోతున్నాను. నేను ప్రేమించిన అబ్బాయి మా ఊరికి రావడం మానేసి, ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు. నాకు ఇప్పుడు అతడే కావాలనిపిస్తోంది. బావకు విడాకులివ్వడానికి సిద్ధమయ్యాను. కానీ వాడికి నేనంటే ప్రేమ పోయిందని తెలిసింది. తనని మళ్లీ ఎలా చేరుకోవాలి? అన్నయ్యా. దయచేసి సలహా ఇవ్వండి. ప్లీజ్... నా పేరు చెప్పుకోలేను.
మౌనమె నీ భాష ఓ మూగ మనసా తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు మౌనమె నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా...! చీకటి గుహ నీవు... చింతల చెలి నీవు నాటక రంగానివే మనసా... తెగిన పతంగానివే...ఎందుకు వలచేవో... ఎందుకు వగచేవో ఎందుకు రగిలేవో... ఏమై మిగిలేవో ఎందుకు రగిలేవో... ఏమై మిగిలేవో ‘‘మౌనమె..‘‘ కోర్కెల సెల నీవు... ఊరిమి వల నీవు ఊహల ఉయ్యాలవే మనసా... మాయల దెయ్యానివే లేనిది కోరేవు... ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ‘‘మౌనమె..‘‘
‘గుప్పెడు మనసు సినిమాలో పాట కదా సార్..ఎలా సార్... మీకు అమ్మాయిల బాధ ఇట్టే ఎలా అర్థమయిపోతుంది. ఇప్పుడు ఏమిచెయ్యాలి సార్ మీ బంగారు తల్లి...’అమ్మో! ఆలోచిస్తుంటేనే ప్రాణం పోతోంది నీలూ.ఏమి చెప్పాలి. ఎలా ఆ బాధను కడిగేయాలి?ఒక మగాడు ప్రేమించాడు. కానీ, ప్రేమ కోసం పోరాడలేదు. ఒక మగాడు ద్వేషించాడు. కానీ, ఆ ద్వేషాన్ని ప్రేమించిన కూతురు మీదనే ప్రదర్శించాడు. కానీ బంగారు తల్లీ... నువ్వు బాగా చదువుకున్నావు. ఈ ప్రేమ– ద్వేషాల మధ్య కొట్టుమిట్టాడకుండా... ఒక్కసారి... ఒక్కసారి...‘ఒక్కసారి... ఆ.. ఒక్కసారి... ఏమి చెయ్యాలి సార్?’ జీవితంలో ఒక్కసారి మగాళ్ళను మరచిపోయి నిన్ను నీవు ప్రేమించుకో తల్లీ.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com