రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన ‘బంగారు గాజులు’ చిత్రంలో డా॥సి.నారాయణరెడ్డి గారు రాసిన అన్ని పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అందులోని అన్నాచెల్లెళ్ల అనురాగానికి గీటురాయిగా నిలిచిన ‘అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి... కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది’ అనే పల్లవితో మొదలయ్యే గీతం... పల్లవిలోనే మన దేశంలోని గృహవ్యవస్థలోని ఆప్యాయతల్ని, అనుబంధాల్ని, అనురాగాల్ని ముఖ్యంగా మన దేశంలో అన్నాచెల్లెళ్ల బంధంలోని గొప్పతనాన్ని తెలియజేసే పాట.
మన తెలుగు సినిమాల్లో అన్నాచెల్లెళ్ల అనుబంధాలని తెలిపే పాటలు చాలా వచ్చినా ఈ పాట అప్పటికీ ఇప్పటికీ ఆ అనుబంధంలోని మాధుర్యాన్ని తెలిపే మధురగీతంగా నిలిచింది.
చెల్లిని కంటికిరెప్పలా చూసుకొనే అన్న... ఆ అన్నయ్యను ఉద్దేశించి చెల్లి పాడే పాట. పల్లవిలో... నా అన్న నా వ ద్ద ఉంటే అదే గొప్ప నిధి, అదే తన సంపద... అంటుంది. ఆ తర్వాత చరణంలో ‘ఒకే తీగ పువ్వులమై ఒకే గూటి దివ్వెలమై/ చీకటిలో వేకువలో చిరునవ్వుల రేకులలో/ కన్నకడుపు చల్లగా కలసి మెలసి ఉన్నాము’ అనే వాక్యాల సారాంశం... తామిద్దరం ఒకే తల్లి కడుపులో పుట్టి, తల్లిదండ్రుల దీవెనతో సర్వకాల సర్వావస్థలయందు చల్లగా వర్థిల్లుతాం అని తెలుపుతుంది.
‘కలిమి మనకు కరువై నాకాలమెంత ఎదురైన/ ఈ బంధం విడిపోదన్న ఎన్నెన్ని యుగాలైన/ ఆపదలో ఆనందంలో నీ నీడగ ఉంటానన్న’ అంటూ సాగే ఈ రెండవ చరణంలో నేను బతికున్నంత కాలం నీ వెంట... సంపద ఉన్ననాడు కాని, లేనినాడు ఒకే రీతిగా ఉంటానంటూ... ఎన్ని కష్టాలొచ్చినా, కడగళ్లు ఎదురైనా, మన అనుబంధాన్ని ఎవ్వరూ వేరు చెయ్యలేరంటూ, నీవు నన్ను కంటికిరెప్పలా చూసుకుంటున్న విధంగానే, నేను కూడా నీకు అన్నివేళలలో నీడగానే ఉంటానంటూ.... తెలిపే ఈ గీతం ఈ నాటికీ మధురమే!
ఈ చిత్రంలోని పాటలు ప్రసిద్ధి చెందడానికి కారణం ప్రముఖ సంగీత దర్శకులు కీ॥టి.చలపతిరావు అందించిన స్వరాలు. తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మించిన చాలా చిత్రాలకు చలపతిరావు గారే స్వరాలందించడం విశేషం.
అన్నయ్య సన్నిధి పాటకు సంబంధించి సినారె తన మనసులో ఊహించుకుని రాసిన ట్యూన్‌ని టి.చలపతిరావుగారికి వినిపిస్తే దానికి ఆయన ‘బాగానే ఉంది కాని... మనం మరోలా చేద్దాం’ అంటూ ఈ పాటను ఇప్పుడు మనం వింటున్న ట్యూన్‌లో చేశారట. ఆ కాలంలో హిందీ చిత్ర గీతాల్లో మకుటాయమానంగా నిలిచిన ‘చౌద్‌వీ కా చాంద్ హో..’ అనే పాట ట్యూన్‌ని యథాతథంగా కాకుండా, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ రాగ ఛాయలో ఈ పాటను స్వరపరిచినట్టు సినారె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
ఈ పాటలో చెల్లిగా నటించిన విజయనిర్మల, ఆ చెల్లెలిపై అంతే అనురాగం కలిగిన అన్నయ్య పాత్రలో అక్కినేని అభినయం అంతే అద్భుతంగా ఉంది. ఈ సినిమా చూసిన వారికి తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకునే విధంగా ఉంటుంది ఇందులోని ఈ పాట. సాహిత్యం, సంగీతం చక్కగా కుదిరితే ఒక పాట ఎంత పాపులర్ అవుతుందో చెప్పడానికి ఈ పాట ఉదహరణ.
ఇలాంటి విలువలు ఉన్న పాటలు ఇప్పుడు మన సినిమాలో లేకపోవడానికి మన విద్యావిధానం నుండి ‘నీతిశాస్త్ర’ పాఠ్యాంశాన్ని తీసివేయడం ఒక కారణం.
నేటి మన చిత్రాల్లో కుటుంబ సంబంధాలు, వాటి విలువలకు సంబంధించిన అంశాలు మృగ్యమౌతుండడం వల్లనే నేడు ‘నిర్భయ, అభయ’ వంటి ఘోర సంఘటనలు సమాజంలో చోటుచేసుకుంటున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- మాస్టార్జీ సినీ గీతరచయిత
సంభాషణ: నాగేశ్