
రమేశ్ అన్నయ్య నాన్న అయితే.. మహేశ్ అన్నయ్య ఫ్రెండ్
పద్మినీ ప్రియదర్శిని
‘ఒక్కడు’ సినిమాలో తన చెల్లెలితో మహేశ్‌బాబు చాలా సరదాగా ఉంటారు. ఆటపట్టించారు.. ప్రేమ చూపించారు. మరి, రియల్ లైఫ్‌లో తన అక్కాచెల్లెళ్ల (పద్మ, మంజుల, పద్మినీ ప్రియదర్శిని)తో ఎలా ఉంటారు? ‘రాఖీ’ పండగ సందర్భంగా మహేశ్‌బాబు చెల్లెలు, హీరో సుధీర్‌బాబు భార్య పద్మినీ ప్రియదర్శిని ఆ విశేషాలను పంచుకున్నారు.
రమేశ్ – మహేశ్‌బాబుగార్లకు చిన్న చెల్లెలు మీరు... మీ ఇద్దరు అన్నయ్యల గురించి?
రమేశ్ అన్నయ్య నాకు నాన్నలా. నానీ (మహేశ్‌ని అలానే పిలుస్తారు) ఫ్రెండ్‌లా. రమేశ్ అన్నయ్యను నాన్న అని ఎందుకు అన్నానంటే మా చిన్నప్పుడు నాన్నగారు (సూపర్ స్టార్ కృష్ణ) మాకు పాకెట్ మనీ ఇస్తే, రమేశ్ అన్నయ్య తన మనీనంతా నాకోసం ఖర్చు పెట్టేవాడు. రెస్టారెంట్స్‌కి తీసుకెళ్లి నాక్కావల్సినవి కొనిపెట్టేవాడు. నాకు రమేశ్ అన్నయ్య ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ వాచ్. అది ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఇక, నానీ ఫ్రెండ్ అని ఎందుకు అన్నానంటే, ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్న గొడవలుంటాయి కదా. అలా చిన్నప్పుడు మేమిద్దరం గొడవపడేవాళ్లం. ముఖ్యంగా ‘ఇంక్’ పెన్ విషయంలో నానీ నన్ను ఇబ్బందులపాలు చేసేవాడు. మార్నింగ్ ఇద్దరం మా పెన్స్‌లో ఇంక్ ఫిల్ చేసుకునేవాళ్లం. ఆ తర్వాత నాకు తెలియకుండా నా పెన్నులో ఉన్న ఇంక్ అంతా నానీ తీసేసి, సైలెంట్‌గా నా బ్యాగులో పెట్టేవాడు. స్కూల్‌కెళ్లి చూసుకుంటే, ఖాళీ పెన్ను కనిపించేది. రాసుకోవడానికి చాలా ఇబ్బందిపడేదాన్ని. అది తల్చుకుంటే నవ్వొస్తోంది.
పెద్దయ్యాక మహేశ్‌గారు మీ గురించి తీసుకుంటున్న కేర్ గురించి?
నాకు పెళ్లి కుదిరినప్పుడు చాలా టెన్షన్ పడ్డాడు. సుధీర్ (హీరో సుధీర్‌బాబు – పద్మినీ ప్రియదర్శిని భర్త) మంచి వ్యక్తేనా? అని ఆరా తీశాడట. మంచి అబ్బాయి అని తెలుసుకుని, రిలాక్స్ అయ్యాడు. పెళ్లికి ముందు ఇలా అంటే, పెళ్లి తర్వాత కూడా నానీ టెన్షన్ పడ్డాడు. మంజుల (మహేశ్ రెండో చెల్లెలు) దగ్గర ‘బుల్లి (పద్మినీని ఇంట్లో అలానే పిలుస్తారు) హ్యాపీగా ఉందా?’ అని అడిగేవాడట. ‘హ్యాపీ’ అని చెప్పాక రిలీఫ్ అయ్యాడు. సిస్టర్స్ అంటే నానీకి అంత కేర్. మా ఇద్దరన్నయ్యలూ అంతే.
అంటే.. మీ నాన్నగారు మిమ్మల్ని చూసుకున్నంత జాగ్రత్తగా మహేశ్‌గారు చూసుకుంటారన్న మాట?
అవునండి. చిన్నప్పుడు అల్లరి బాగా చేసేవాడు. జనరల్‌గా కూతుళ్ల గురించి తల్లీతండ్రీ ఎక్కువ కేరింగ్‌గా ఉంటారు. మహేశ్ కూడా ఓ ఫాదర్ తీసుకున్నంత కేర్ తీసుకుంటాడు. మంచి ఫ్యామిలీ పర్సన్.
మీ హజ్బెండ్ సుధీర్‌బాబు హీరో అవుతానన్నప్పుడు మీరెలా ఫీలయ్యారు? మీ అన్నయ్య మహేశ్ ఏమన్నారు?
నేను సుధీర్ దగ్గర ఒక్కటే చెప్పాను. ‘నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. ఆ టాలెంట్‌తోనే పైకి రావాలి. మహేశ్ హెల్ప్ తీసుకోకూడదు. ఎందుకంటే తనని హెల్ప్ అడగడానికి బయటివాళ్లు చాలామంది ఉంటారు. ఇక, ఇంట్లోవాళ్లు కూడా అడిగి ఇబ్బందిపెట్టకూడదు’ అన్నాను. యాక్చువల్‌గా సుధీర్ కూడా తన టాలెంట్‌ని నమ్ముకునే ముందుకెళ్లాలనుకున్నాడు. అందుకు నాకు సంతోషంగా అనిపించింది. నిజానికి నానీకి అందర్నీ ఎంకరేజ్ చేసే హ్యాబిట్ ఉంది. కానీ, ఫెయిలైతే ఎక్కడ అప్‌సెట్ అయిపోతామోనని భయం. అందుకే సుధీర్ హీరో అవుతానన్నప్పుడు కొంచెం టెన్షన్ పడ్డాడు. అయితే, సుధీర్ వర్కవుట్స్‌కి సంబంధించిన వీడియోలు, తన ప్యాషన్ చూసి, ‘గో ఎ హెడ్’ అన్నాడు.
మహేశ్ తన ముగ్గురు సిస్టర్స్ హజ్బెండ్స్‌తో ఎలా ఉంటారు?
వెరీ ఫ్రెండ్లీ. సేమ్ టైమ్ రెస్పెక్ట్ కూడా ఉంటుంది. మేమంతా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అందరం కలసి మాట్లాడుకుంటాం. అందరి ఫీలింగ్స్‌ని రెస్పెక్ట్ చేస్తాం.
మీ పిల్లలతో ఎలా ఉంటారు?
మాకిద్దరు అబ్బాయిలు. మా రెండో బాబు పుట్టినప్పుడు నానీ చూడ్డానికి వచ్చాడు. అప్పుడు మా వదిన నమ్రతతో మనక్కూడా ఇద్దరు పిల్లలు ఉంటే బాగుంటుందన్నాడట. అప్పటికే వాళ్లకు గౌతమ్ పుట్టాడు. ఆ తర్వాత సితార పుట్టింది. తన పిల్లలతో ఎలా ఉంటాడో మా పిల్లలతో కూడా అలానే ఉంటాడు. పిల్లలతో సరదాగా మాట్లాడతాడు.
ఫైనల్లీ... వ్యక్తిగా మహేశ్ ఎలాంటి టైప్?
హీ ఈజ్ పర్ఫెక్ట్. నాకు నచ్చే విషయం ఏంటంటే.. ఇంట్లో ఆడవాళ్లను ఒకలా బయటివాళ్లను ఒకలా నానీ చూడడు. అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడు.
అక్కలు పద్మ, మంజులతో ప్రియదర్శిని