మలాల జీవిత కథ సినిమా
గుల్ మకయ్
1997లో ఏ ముహూర్తాన మలాల జన్మించినదో కాని ఆమె జీవిత కథ ఎన్నో మలుపులు తిరిగి ప్రపంచానికి ఆసక్తి గొలుపుతూనే ఉంది. పాకిస్తాన్‌లోని వాయువ్య ప్రాంతానికి చెందిన, అఫ్ఘనిస్తాన్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న స్వాత్ లోయలో పుట్టి పెరిగిన ‘మలాల యూసఫ్‌జాయ్’ తన తండ్రి జియావుద్దీన్ అధ్యాపకుడైన కారణంగా చదువు మీద ఆసక్తి పెంచుకుంది. ఆడపిల్లలు చదువుకోవాలి అని భావించిన జియావుద్దీన్ మలాల చదువును ప్రోత్సహించాడు. అయితే మలాలాకు పద్నాలుగు పదిహేనేళ్ల వయసు ప్రాంతంలో అంటే 2010– 2012 కాలంలో స్వాత్ లోయ తాలిబన్‌ల ఆధిక్యం కిందకు వచ్చింది.
తాలిబన్లు స్త్రీల విద్యను నిరసించారు. నిషేధించారు. గర్ల్స్ హైస్కూల్స్‌ను బాంబులతో పేల్చి భీతావహ పరిస్థితులు సృష్టించారు. అయినప్పటికీ మలాల బాలికల చదువు కోసం గొంతెత్తింది. తాలిబన్ తూటాలకు ఎదురు నిలిచి పోరాడింది. అంతకు ముందే ఆమె బి.బి.సి వారు ఉర్దూ బ్లాగ్‌లో స్వాత్ లోయలో బాలికల పరిస్థితుల పై ‘గుల్ మకయ్’ అనే కలం పేరుతో ఎన్నో వ్యాసాలు వెలువరించింది. ఆ తర్వాత ఆమె మీద డాక్యుమెంటరీ వచ్చింది. ‘ఇక్కడ చదవడానికి పుస్తకాలు లేకపోవడం నాకు విసుగు పుట్టిస్తోంది’ అనే వ్యాఖ్య ఆ డాక్యుమెంటరీలో ఆమె చేసింది. మలాల, ఆమె తండ్రి జియావుద్దీన్ తాలిబన్ల దృష్టిలో పడ్డారు. కొంతకాలం పెషావర్‌కు వెళ్లి శరణు పొంది పాక్ మిలటరీ పై చేయి సాధించిందనుకున్నాక స్వాత్ లోయకు తిరిగి వచ్చారు.
అప్పటికీ మలాల పై తాలిబన్ల కోపం తీరలేదు. 2012 అక్టోబర్ 9న స్కూల్ నుంచి తిరిగి వస్తున్న ఆమె బస్సుపై దాడి చేసి కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ మలాల తలలో దూసుకు వెళ్లింది. ఆ తర్వాత ఆమె బతికి బయట పడి ప్రపంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపు పొందిందో బాలికల విద్య కోసం ప్రపంచ దేశాలలో ఎలా పని చేస్తున్నదో అందరికీ తెలుసు. నోబెల్ శాంతి పురస్కారం వంటి సర్వోన్నత పురస్కారం పొందడం అంత చిన్న వయసులో మలాల సాధించిన ఘనత. ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న మలాల జీవిత కథ ఇంత వరకూ వెండి తెర మీదకు రాలేదు. ఆ ప్రయత్నాన్ని బాలీవుడ్ సాఫల్యం చేస్తోంది.
‘గుల్ మకయ్’ పేరుతో మలాల జీవిత కథను వెండితెరకెక్కించింది. ఇండియన్ బుల్లితెర మీద గుర్తింపు పొందిన నటి ‘రీమ్ షేక్’ మలాల పాత్రను పోషిస్తోంది. పారలల్ సినిమాల దర్శకుడిగా గుర్తింపు పొందిన అంజాద్ ఖాన్ ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే సగం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో దివంగత నటుడు ఓంపురి ఒక పాట కూడా పాడారు. నటి దివ్యాదత్తా మలాలకు తల్లిగా ఈ సినిమాలో కనిపిస్తారు. మొత్తం మీద ఈ సినిమా భారతీయులనే కాక ప్రపంచ ప్రేక్షకులను కూడా కుతూహలపరిచే అవకాశం ఉంది.