త్రీమంకీస్ - 45 | malladh special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 45

Published Tue, Dec 2 2014 10:56 PM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

త్రీమంకీస్ - 45 - Sakshi

త్రీమంకీస్ - 45

 డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 45
 
 - మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
‘‘లేదు. దుర్యోధన్ నోటి మాట తప్ప అందుకు అతన్ని గోలచందర్ నియమించినట్లు ఋజువులు, సాక్ష్యాలు లేకపోవడంతో అతన్ని అరెస్ట్ చేయలేదు. నిజానికి ఆ సమయంలో అతను ఇన్‌కం టేక్స్ ఆఫీస్‌లో కూడా లేడు. తనకి ఎలిబీ కోసం బేంక్ మేనేజర్‌తో మీటింగ్‌లో ఉన్నాడు. హత్య జరిగిన సమయంలో ఇరవై కిలోమీటర్ల దూరంలోని ఆ బేంక్ లాకర్ని ఆపరేట్ చేశాడనే సాక్ష్యం ఉంది. దుర్యోధన్ ఎవరో తనకి తెలీదని, ఆ కవర్లోని డబ్బు గురించి కూడా తనకి తెలీదని అంతా తన భార్య మీదకి తోసేశాడు. ఆమె మాంచాలని చంపడానికి దుర్యోధన్‌ని నియమించిందనే అనుమానం కూడా పోలీసులకి ఉంది.’’

 ‘‘పాపం అసూయే లల్లేశ్వరి చేసిన నేరం’’ వానర్ చెప్పాడు.
 ‘‘లోకంలో చాలామంది చేసే నేరం ఏదో జరుగుతుందని ఆశించి ఏదో చేయడం. చివరికి వారికి పడే శిక్ష నిరాశ’’ ఇదంతా విన్న కొద్ది దూరంలోని వేమన చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.
 11
 
 ‘‘మీ కోసం ములాఖాత్‌కి ఎవరో వచ్చారు. ఇక మీ కోటా అయిపోయింది. ఇంక వచ్చినా వచ్చేనెల దాకా ఎవరొచ్చినా రావద్దని చెప్పి పంపించేస్తాం’’ సెల్‌కి వెళ్ళబోయే ముందు గార్డ్ కపీష్‌తో చెప్పాడు.
 ‘‘లాభం లేదు. వాడు నన్ను వదలడు. నేను రానని చెప్పు’’ కపీష్ నిరాకరించాడు.
 ‘‘వాడు కాదు. అది.’’
 ‘‘అది?’’ కపీష్ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు.
 ‘‘అవును’’ ములాఖాత్‌కి వెళ్ళి వచ్చిన ఓ ఖైదీ చెప్పాడు.
 ‘‘మగాళ్ళకి వాడు, ఆడవాళ్ళకి ఆమె వాడాలి తప్ప అది అనడం తప్పు. నా కోసం ఏ ఆడది వస్తుంది చెప్మా? సరే. పద.’’
 కపీష్ కొద్దిగా ఆసక్తిగా వెళ్ళి గార్డ్ చూపించిన విండో ముందున్న కుర్చీలో కూర్చున్నాడు.
 ‘‘హలో’’ ఆమె చిరునవ్వుతో పలకరించింది.
 ‘‘హలో’’ కపీష్ కొద్దిగా తబ్బిబ్బయ్యాడు.
 గత రెండు రోజులుగా తన వంక చూస్తున్న ఆమె తనని చూడటానికి వస్తుందని అతను ఎదురుచూడలేదు.
 ‘‘మీరు వచ్చింది నా కోసమా? లేక... ఆయన ఎవరు?’’
 ‘‘అతను మా అన్నయ్య. ఇవాళ నేను వచ్చింది మాత్రం నీ కోసమే.’’
 ‘‘నా కోసం వచ్చేది మాత్రం మా అన్న గారు కారు. ఆ మార్వాడీ మా అన్న అనుకోకండి.’’
 ‘‘తెలుసు. మీ సంభాషణ విన్నాగా’’ నవ్వింది.
 ‘‘నా పేరు కపీష్.’’
 ‘‘నా పేరు రుధిర. ఎందుకో మిమ్మల్ని చూడాలని అనిపించింది. వచ్చాను.’’
 ‘‘ఎందుకో?’’
 జవాబుగా మధురంగా నవ్వింది.
 ‘‘మీ పేరేం అన్నారు?’’ అడిగాడు.
 ‘‘రుధిర.’’
 ‘‘కలం పేరా?’’
 ‘‘కాదు. మా నాన్న పెట్టిన పేరు.’’
 ‘‘రుధిర అంటే రక్తం అని మీ నాన్నకి తెలుసా?’’
 ‘‘తెలిసే ఆ పేరు పెట్టారు. డాక్టర్లు తమ కూతుళ్ళకి శుశ్రుత అని, నటీనటులు తమ కూతుళ్ళకి అభినయ, సితార అని, రచయితలు లిపి లేదా కావ్య అని పేర్లు పెడుతూంటారు చూశారా? అలా మా నాన్న గూండా కాబట్టి కావాలనే రుధిర అనే పేరు పెట్టారు.’’
 ‘‘ఓ! ఐతే సరే.’’
 ‘‘మీరేం చేస్తూంటారు?’’
 ‘‘ఇంజనీరింగ్ చదివాను.’’
 ‘‘అది కాదు. ఏం డిపార్ట్‌మెంట్?’’
 ‘‘ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్.’’
 ‘‘అది కాదు. మర్డర్లా? జేబు దొంగతనాలా? చీటింగ్ కేసులా? చెయిన్ స్నాచింగ్‌లా?’’ నవ్వింది.
 ‘‘బేంక్ దొంగతనం.’’
 ‘‘ఐతే మా అన్న అభ్యంతరం చెప్పరు.’’
 ‘‘మీ అన్న కూడా గూండాయేనా?’’
 ‘‘అవును.’’
 ‘‘ఏ డిపార్ట్‌మెంట్?’’
 ‘‘అన్నీ. లేండ్ సెటిల్‌మెంట్లు, బెదిరించడాలు, కాలో, చెయ్యో తీసేయడాలు... అలాంటివన్నీ. మీరు ఇంజనీర్ అన్నారు. నేను టెన్త్ ఫెయిల్డ్.’’
 ‘‘మీరేం చేస్తూంటారు?’’
 ‘‘ఎంబామింగ్.’’
 ‘‘సారీ?’’
 ‘‘మనుషులు చచ్చిపోతారు కదా?’’
 ‘‘అవును.’’
 ‘‘వాళ్ళ దూరపు బంధువులు వచ్చే దాకా శవం పాడవకుండా ఎంబామింగ్ చేస్తూంటాను.’’
 ‘‘భయం వేయదా?’’
 ‘‘వాటికే నేనంటే భయం. ‘మెల్లిగా... మెల్లిగా’ అంటూంటాయి’’ నవ్వింది.
 ‘‘ఓ! మీ అన్న గారికి బెయిల్ ప్రయత్నం చేస్తున్నారా?’’
 ‘‘లేదు. అతను ఇప్పటికే బెయిల్ జంపింగ్ చేయడంతో బెయిల్ ఇవ్వరు.’’
 ‘‘బెయిల్ జంపింగ్ అంటే బెయిల్ మీద బయటకి వెళ్ళి...’’
 (డుబ్బు అంటే?)
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement