త్రీమంకీస్ - 43 | malladhi special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 43

Published Sun, Nov 30 2014 11:05 PM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM

త్రీమంకీస్  - 43

త్రీమంకీస్ - 43

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 43
 
- మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
ఆ రాత్రి అతను తన భార్య పడక గదిలోకి వెళ్ళాడు కానీ ఆమె మొహాన్ని దిండుతో అణచి గాలాడకుండా చేసి చంపే ధైర్యం చేయలేక బయటికి వచ్చేశాడు.
   
 ‘‘అది నా వల్ల కాదు. అందుకు ఎవర్నయినా నియమిస్తాను’’ మర్నాడు ఉదయం గోలచందర్ చెప్పాడు.
 ‘‘బహుశా నేనా పని చేయగలనేమో?’’ మాంచాల చెప్పింది.
 ‘‘వద్దు. నువ్వు దీంట్లో జోక్యం చేసుకోకు. ఎవరినైనా ఏర్పాటు చేస్తాను’’ గోలచందర్ తిరస్కరించాడు.
 ‘‘సరే. అది మీకే వదిలేస్తాను. కానీ దయాహృదయులైన మీరు ఎప్పటికీ చేయలేరని నా నమ్మకం’’ మాంచాల నవ్వుతూ చెప్పింది.
 ‘‘కొందరు ఎంత బీదవాళ్ళంటే వారి దగ్గర డబ్బు తప్ప ఇంకేం ఉండదు. మా ఆవిడ అలాంటిది. దేనికీ డబ్బు ఖర్చు చేయనీదు’’ గోలచందర్ కోపంగా చెప్పాడు.
 ‘‘ఐతే మీరీ ధైర్యం చేయక తప్పదు. రేపు మన ఇంటి అవసరాలని, వెల్లుల్లి కొన్న బిల్లుని ప్రేమతో చెల్లించగలరా?’’ మాంచాల అడిగింది.
 అతను వెళ్ళాక మాంచాల కొద్ది క్షణాలు ఆలోచించి తన స్నేహితురాలి ఇంటి నంబర్ తిప్పింది.
 బెడ్‌రూంలోని లల్లేశ్వరి రిసీవర్ ఎత్తి చెప్పింది.
 ‘‘హలో?’’
 ‘‘లల్లీ! మాంచాలని. నిన్ను నిద్రలేపానా?’’ అడిగింది.
 ‘‘లేదు. ఏమిటి విశేషం?’’
 ‘‘నువ్వు, గోలచందర్ హనీమూన్‌లో తాగిన గులాబీ రేకుల టీ గురించి ఓసారి చెప్పావు గుర్తుందా?’’
 ‘‘అవును?’’
 ‘‘అది ఓరియంటల్ రోజ్ పెటల్ టీ యేనా?’’
 ‘‘అవును.’’
 ‘‘ఐతే వస్తున్నాను. నీకో సర్‌ప్రయిజ్’’ అని చెప్పి మాంచాల రిసీవర్ పెట్టేసి అలమార దగ్గరకి వెళ్ళింది. తలుపు తెరిచి ఆ టీ పెట్టెని, ఓ విషం సీసాని తీసుకుని లల్లేశ్వరి ఇంటికి వెళ్ళింది. బెడ్ రూంలో మంచం మీద దిగులుగా పడుకున్న లల్లేశ్వరికి ఆ పెట్టెని చూపించింది.
 ‘‘ఇదెక్కడిది?’’ ఆమె ఆనందంగా అడిగింది.
 ‘‘ఓ షాపులో దొరికింది. ఇది తాగితే నీకు హనీమూన్‌లోని బంగారు జ్ఞాపకాలన్నీ తిరిగి వస్తాయి అనిపించి నీ కోసం కొన్నాను.’’
 ‘‘మాంచాలా! నా మనసు బాగా లేదు. నిన్న రాత్రి మళ్ళీ మా వారి నించి వెల్లుల్లి వాసన వేసింది’’ బాధగా చెప్పింది.
 ‘‘అదంతా నీ ఊహ మాత్రమే’’ మాంచాల చెప్పింది.
 ‘‘ఇవాళ ఉదయం పదికి గోలచందర్ ఆఫీస్‌లోంచి బయటికి వెళ్ళాడు. ఇంతదాకా నా దగ్గరికి రాలేదు. అది ఊహా?’’
 ‘‘బహుశా అతను వ్యాపార పనుల మీద తిరుగుతూండి ఉండచ్చు.’’
 ‘‘అలాంటప్పుడు అతని సెక్రటరీకి ఆ విషయాలు ఎందుకు తెలియవు?’’
 ‘‘అతని క్లబ్‌కి ఫోన్ చేశావా?’’ మాంచాల అడిగింది.
 ‘‘చేశాను. ఈ రోజంతా రాలేదు.’’
 ‘‘అతను ఆఫీస్‌లో లేకపోవడానికి ఓ డజను వివరణలు ఉండచ్చు. ఊరికే ఇదవక’’ మాంచాల ఓదార్చింది.
 ‘‘నిజమైన వివరణ నన్ను భయపెడుతోంది.’’
 ‘‘ఏమిటది?’’
 ‘‘బహుశా అతను ప్రేమించే అమ్మాయి అతనికి నేతిలో వేయించిన వెల్లుల్లి రేకలని తినిపిస్తూంటుంది.’’
 ‘‘భార్యకి ఓ భర్త మీద అనుమానం కలిగితే భయపెట్టే లక్షల కొద్దీ కారణాలు తడుతూంటాయి.’’
 ‘‘మాంచాలా! ఏం జరుగుతోందో నాకు ఖచ్చితంగా తెలుసు’’ లల్లేశ్వరి స్థ్థిరంగా చెప్పింది.
 ‘‘ఏం జరుగుతోంది?’’
 ‘‘ఏం జరుగుతోందో తెలుసు కానీ ఆ వంటగత్తె, పడకగత్తె ఎవరో తెలియడం లేదు.’’
 ‘‘నీకిప్పుడు కావలసింది వేడి టీ’’ చెప్పి మాంచాల లేచి టీ డబ్బాతో వంట గదిలోకి వెళ్ళింది.
 స్టవ్ మీద నీళ్ళ కెటిల్‌ని ఉంచి, అలమరలోంచి టీ పాట్, కప్పులని తీసి కౌంటర్ మీద పెట్టింది. జాకెట్‌లోంచి విషం సీసా తీసి దాని మూత తీసి ఓ కప్పులోకి కొంత పోసింది. ఆలోచించి మొత్తం అందులోకి కుమ్మరించేసి అందులో టీ బేగ్‌ని వేసి కెటిల్‌లోని వేడి నీళ్ళని పోసింది.
 సెల్‌ఫోన్ మోగడం, తర్వాత బెడ్ రూంలోంచి లల్లేశ్వరి మాటలు వినపడ్డాయి.
 ‘‘ఏమండీ! మీ కోసం చాలాచోట్లకి ఫోన్ చేశాను... ఏమిటి? ఇన్‌కంటేక్స్ ఆఫీస్‌లో ఉన్నారా? అలాగే. మీరు పంపే అతనికి టేబుల్ డ్రాయర్‌లోని కవరిచ్చి పంపుతాను. రాత్రి డిన్నర్‌కి వస్తున్నారుగా? వెల్లుల్లి వాసన వేస్తే మాత్రం మిమ్మల్ని చంపేస్తాను. అదంటే నాకు అలర్జీ. గుడ్ బై’’
 మాంచాల ట్రేతో అక్కడికి వచ్చి టీ కప్పుని ఇస్తూంటే లల్లేశ్వరి చెప్పింది - ‘‘చందూ ఇన్‌కంటేక్స్ ఆఫీస్‌కి వెళ్ళారుట.’’
 (మాంచాలని చంపిందెవరు?)
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement