త్రీమంకీస్ - 50
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 50.
- మల్లాది వెంకటకృష్ణమూర్తి
14
ఉదయం పదకొండున్నరకి గార్డ్ వానర్ సెల్ తలుపు తాళం తీసి తలుపు తెరచి అతనితో చెప్పాడు.
‘‘డాక్టరమ్మ నిన్ను తీసుకురమ్మంది.’’
‘‘రోజూ వెళ్తున్నావు. నీకేమైనా దీర్ఘరోగం కాని, ప్రాణాంతక రోగం కానీ ఉందా?’’ పట్టయ్య అడిగాడు.
‘‘అది ఇవాళ తెలుస్తుంది.’’
వానర్ గార్డ్ వెంట నడిచాడు.
ఆమె గదిలోకి వెళ్ళాక వానర్‌ని చూసి ఆమె అడిగింది.
‘‘హలో. ఎలా ఉన్నావు?’’
‘‘రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు.’’
‘‘వేడి చేసి ఉంటుంది.’’
‘‘మీరు పదేపదే గుర్తుకు వస్తూంటే నాకు నిద్రెలా పడుతుంది?’’
‘‘నిజంగానా అంతగా గుర్తొచ్చానా?’’ డాక్టర్ మూలిక పమిట సర్దుకుంటూ అడిగింది.
‘‘యప్. చాలా.’’
‘‘నా గురించి ఆలోచిస్తూంటే నిద్ర పట్టలేదన్నమాట.’’
‘‘అవును.’’
‘‘ఏం ఆలోచించావు?’’
‘‘షేక్స్‌పియర్ కన్నా అతని భార్య పెద్దదైనప్పుడు నా భార్య నాకన్నా పెద్దదైతే ఏం? అని ఆలోచించాను. మీ జుట్టు అక్కడక్కడ నెరిసినట్లుంది.’’
‘‘బాల నెరుపు మా వంశంలో ఉంది. అందుకే మందార ఆకులతో కాచిన నూనెని రాసుకుంటున్నా. సగం పైనే నల్లబడ్డాయి. నిజంగా కాంప్రమైజ్ అయ్యావా?’’
‘‘బాగా.’’
‘‘అమ్మయ్య.’’
‘‘మూలీ’’ ప్రేమగా పిలిచాడు.
‘‘ఏమిటి?’’
‘‘నాకో ప్రేమ కానుక ఇవ్వవా?’’
‘‘ఏమిటది?’’
‘‘నీ టార్చ్ లైట్.’’
‘‘అది దేనికి?’’
‘‘దాన్ని ఆర్పి వెలిగించి చూస్తూంటే నువ్వే నా జీవనజ్యోతి అని గుర్తుకు వస్తూంటుంది.’’
‘‘అవును. నన్ను తేలిగ్గా గుర్తు తెచ్చుకునే మార్గం అది. కాని నేను ఖైదీలకి ఏమీ ఇవ్వకూడదు అనే నియమం ఒకటి ఉంది.’’
‘‘ఓసారి నియమం తప్పాక ఎన్నిసార్లయినా తప్పచ్చుగా?’’
‘‘నియమం తప్పి ఇంతదాకా నేనేం ఇవ్వలేదే నీకు?’’
‘‘నీ మనసు ఇచ్చావుగా?’’
‘‘అది నువ్వు దోచుకున్నావు తప్ప నేను ఇవ్వలేదు.’’
‘‘ఐతే కళ్ళు మూసుకో.’’
‘‘దేనికి?’’
‘‘టార్చి లైట్‌ని కూడా దోచుకుంటాను.’’
డ్రాయర్ సొరుగులోంచి దాన్ని తీసి బల్ల మీద ఉంచి కళ్ళు మూసుకుని ఒకటి నించి ఐదు లెక్క పెట్టసాగింది. వానర్ దాన్ని అందుకుని జేబులో ఉంచుకున్నాడు. కళ్ళు తెరచి చూసి చెప్పింది.
‘‘అరె! ఇక్కడ టార్చి లైట్ ఉండాలే? నువ్వు కాని చూశావా?’’
‘‘చూళ్ళేదు.’’
‘‘తీసుకున్నావా?’’
‘‘లేదు.’’
‘‘దాంతో ఎందరో చెవులని, నోళ్ళని, గొంతుకలని, కళ్ళని పరిశీలించాను. ఇప్పుడు అది ఎవరి దగ్గరకి వెళ్ళిందో వారి మనసుని పరిశోధిస్తుందన్నమాట.’’
‘‘అవును. నాకు నీ వాచీ కూడా ఇవ్వవా?’’ వానర్ అర్థించాడు.
‘‘వాచీనా?’’
‘‘అవును.’’
‘‘దేనికి?’’
‘‘నీ గుర్తుగా నీ శరీరాన్ని తాకిన వాచీ నా చేతిని తాకుతూంటే నాకు హాయిగా నిద్ర పడుతుంది.’’
‘‘సారీ వార్. ఇవ్వలేను.’’
‘‘ఏం?’’
‘‘టార్చ్ లైట్ జైలుది. వాచీ నా స్వంతం కాబట్టి. అదీకాక టార్చ్ లైట్ సెర్చ్‌లో పట్టుపడ్డా నువ్వు దొంగిలించావని చెప్తే నమ్ముతారు. నా వాచీని నువ్వు దొంగిలించావంటే, నాకు తెలీకుండా అది ఎలా జరిగిందన్న ప్రశ్న వస్తుంది. నువ్వు నాకు తెలీకుండా నా చేతిలోంచి కొట్టేసావంటే నమ్మరు. ఐనా నీ కోరికని కాదనలేను.’’
‘‘థాంక్స్’’ వానర్ చేతిని చాపాడు.
అతని చేతిలో తన చేతి నించి తీసిన గాజుని ఉంచింది.
‘‘బంగారం గాజా?’’
‘‘కాదు. బంగారం రంగు గాజు గాజు.’’
‘‘ఐతే ఒద్దులే. ఇంకొన్ని రోజులేగా. బెయిల్ మీద బయటకి రాగానే మనం కలిసే ఉంటాంగా’’ వానర్ నిరాకరించాడు.
‘‘పోనీ నా బొట్టు బిళ్ళ ఇవ్వనా?’’
‘‘ఒద్దు. నాకు జ్వరం ఉందా?’’
అతని నాడిని పట్టుకుని చూసి చెప్పింది.
‘‘లేదు.’’
‘‘ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా మీకు?’’ వానర్ అడిగాడు.
‘‘ఉంది.’’
‘‘మీ పేరుతోనేనా?’’
‘‘అవును.’’
‘‘మీకు రేపు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే నన్ను ఏడ్ చేసుకుంటారా?’’
‘‘అలాగే. అది బెయిల్ వచ్చాక కదా?’’
(జైల్లో అద్దెకు ఏమేం దొరుకుతాయి?)
- మళ్లీ రేపు
ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com
లెటర్స్
మల్లాది సీరియల్ చాలా బాగుంది. ముఖ్యంగా సమకాలీన సంఘటనలు జోడించి రచయిత రాసిన తీరు చాలా నచ్చింది. అన్వర్ గీత, మల్లాది రాత మన పాఠకులకు పండుగే పండుగ. - ఎం. అజయ్, రామచంద్రాపురం, గుంటూరు జిల్లా
l "Three Monkeys" so far is a fun ride. I laughed out loud when one character says that a pregnant woman should be nicely referred as "Body Builder". There are many other hilarious jokes too in this serial.
- Giridhar G Saint Louis (USA)