త్రీమంకీస్ - 51
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 51
- మల్లాది వెంకటకృష్ణమూర్తి
‘‘కాదు. రేపే పంపుతాను.’’
‘‘రేపటికల్లా బెయిల్ రాదే?’’
‘‘అవును. రాదు. మనిషి ఆశాజీవి కదా? రేపు కూడా ఇదే డైలాగ్ చెప్తాను. జైల్లో ఉన్నన్ని రోజులూ మర్నాడే విడుదల అని నమ్ముతూంటే జైలు జీవితం చులాగ్గా సాగిపోతుందని ఎవరో ఫేస్‌బుక్‌లో పెడితే చదివాను.’’
‘‘మంచి ఫిలాసఫీ.’’
‘‘నీ మెళ్ళోని అదేమిటి? తాయెత్తా?’’ వానర్ అడిగాడు.
‘‘కాదు. జెహర్ మోడీ అనే చెట్టు బెరడు. దీన్ని సర్పగంధి అని కూడా అంటారు.’’
‘‘దేనికది?’’
‘‘పాము కాని, తేలు కాని కరిచిన చోట దీన్ని నీళ్ళల్లో అరగదీసి రాస్తే చాలు. విషం దిగుతుంది. ఓసారి శ్రీశైలం అడవులకి వెళ్ళినప్పుడు తెచ్చాను. అక్కడ చాలా ఔషధ చెట్లుంటాయి. ఆర్నెల్లకోసారి వెళ్ళి కావలసినవి తెచ్చుకుంటూంటాను.’’
‘‘ఈసారి మనిద్దరం కలిసి వెళ్దాం.’’
‘‘మన హనీమూన్ అక్కడే చెంచుల గూడెంలో. అది మిగిలిన అన్ని ప్రదేశాలకన్నా గొప్పగా ఉంటుందని గేరంటీ.’’
‘‘ఎలా చెప్పగలవు?’’
‘‘వీర్యవృద్ధికి, స్తంభనా శక్తికి అక్కడ మంచి ఔషధ చెట్లు ఉన్నాయి.’’
‘‘గ్రేట్.’’
‘‘మీకు ఆస్తమా లేదుగా?’’
‘‘ఊహూ. ఏం అలా అడిగారు?’’
‘‘ఫాంస్‌ఫాసిస్ అనే ఆయుర్వేదం మందు దానికి నా దగ్గర సిద్ధంగా ఉంది. ఇంకా అల్సర్, కుష్ఠు, సోరియాసిస్, డయాబెటిస్, తామర లాంటివి ఉంటే చెప్పండి. ఔషధ మొక్కలతో నేనే స్వయంగా మందులు చేశాను.’’
‘‘దైవవశాత్తు అలాంటివేం ఇంకా లేవు.’’
‘‘ధన్వంతరీ పూజ చేసి హనీమూన్‌కి వెళ్దాం.’’
‘‘ధన్వంతరిలా ప్రేమ కూడా మనుషులకి చికిత్స చేస్తుంది.’’
‘‘అవును. దాన్ని తీసుకునే వారికే కాదు, ఇచ్చే వారికి కూడా ప్రేమ చికిత్స చేస్తుంది వార్’’ మూలిక చెప్పింది.
‘‘ఇక్కడ వాచీ దొరుకుతుందా?’’ తిరిగి వస్తూ వానర్ గార్డ్‌ని అడిగాడు.
‘‘దేనికి? ఏదైనా అపాయింట్‌మెంట్ ఉందా? దాన్ని మిస్ అవుతావనా?’’ గార్డ్ వెటకారంగా అడిగాడు.
‘‘అవును. భలే కనిపెట్టావే. ఎంత?’’
‘‘స్వంతానికా? అద్దెకా?’’
‘‘అద్దెకి కూడా దొరుకుతాయా?’’
‘‘సరైన అద్దె చెల్లిస్తే ఇక్కడ అద్దెకి అమ్మాయి కూడా దొరుకుతుంది. సెల్‌ఫోన్ అద్దె రోజుకి ఐదు వందలు. అందులోనే టైం కూడా ఉంటుంది’’ గార్డ్ చెప్పాడు.
‘‘సెల్‌ఫోన్‌లో నేను మాట్లాడటానికి బయట నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు. అంతా లోపలే ఉన్నారు. వాచీ చాలు. రోజుకి ఎంత అద్దె?’’
‘‘వంద. నిజంగా నీ దగ్గర డబ్బుందా?’’ గార్డ్ ఆశగా అడిగాడు.
‘‘నిజంగా వాచీ ఉందా?’’ జేబులోంచి వానర్ వంద రూపాయల నోటుని తీసి చూపించి అడిగాడు.
‘‘ఉంది. సరే. అరగంటలో తెస్తాను.’’
‘‘ఇదిగో సామీ వాచీ’’ ఇరవై నిమిషాల్లో గార్డ్ వానర్‌కి కటకటాల్లోంచి ఓ వాచీని అందించాడు.
‘‘ఇది కరెక్ట్ టైమేనా?’’ అది నడుస్తోందో లేదో పరీక్షించాక వానర్ అడిగాడు.
‘‘అవును. డబ్బివ్వండి.’’
‘‘మళ్ళీ రేపు వచ్చి వంద తీసుకో. ఉంటే’’ వంద నోటు ఇచ్చి చెప్పాడు.
‘‘ఏం? రేపటికి వాచీ ఉండకుండా ఏమవుతుంది?’’
‘‘వాచీ కాదు. నువ్వుండకపోవచ్చు. లేదా నేను ఉండకపోవచ్చు.’’
‘‘నువ్వెక్కడికి వెళ్తావు? నేనెక్కడికి వెళ్తాను?’’ అతను పెదవి విరిచి చెప్పాడు.
‘‘ఎవరు ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలుసు?’’ వానర్ నవ్వాడు.
ఎప్పటిలానే సాయంత్రం జైలర్ రోల్ కాల్ తీసుకున్నాక మర్కట్ వైతరణి దగ్గరకి వెళ్ళాడు.
‘‘హలో’’ ఆమె పలకరించింది.
‘‘హలో. నువ్వు ఈ డ్రెస్‌లోకన్నా టి షర్ట్, జీన్స్‌లలో బావుంటావు’’ మర్కట్ చెప్పాడు.
‘‘మళ్ళీ ఊహల్లో విప్పి కట్టావా?’’
‘‘ఎప్.’’
‘‘నేను చీరలు కట్టను. ఇంటి దగ్గర అవే వేసుకుంటూంటాను.’’
‘‘మినీ స్కర్ట్, టాప్‌లలో కూడా నువ్వు అదరహో.’’
‘‘పిచ్చివాడా! అసలవేం లేకపోతే ఇంకా టాప్‌గా ఉంటాను.’’
జైలర్ గట్టిగా ఈల వేసి చెప్పాడు.
‘‘టైమప్. అంతా మీమీ సెల్స్‌కి వెళ్ళండి.’’
‘‘రేపు మళ్ళీ కలుద్దాం’’ వైతరణి చెప్పింది.
తను ఆ రాత్రే సొరంగంలోంచి జారుకుంటున్నాడని, మర్నాడు కలవడని మర్కట్ వైతరణికి చెప్పలేదు.
‘‘అలాగే. రేపు కలుద్దాం’’ చెప్పాడు.
ఈలోగా కపీష్ దుర్యోధన్ దగ్గరకి వెళ్ళి చెప్పాడు - ‘‘తాబేలు, కుందేలు గుర్తున్నాయిగా? మమ్మల్ని కూడా కలుపుకుని తీసుకెళ్ళారా సరే. లేదా మీరూ వెళ్ళలేరు. పైగా అంత పెద్ద సొరంగం తవ్వినందుకు మీ ముఠాని తీహార్ జైలుకి తరలిస్తారు. జాగ్రత్త.’’
(తప్పించుకునేటప్పుడు సొరంగంలో
వారికి ఏమి కనిపించింది?)
- మళ్లీ రేపు
ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com
లెటర్స్
ఆసక్తిగా, ఆహ్లాదంగా సాగే కథ రాస్తున్న మల్లాది గారికి కృతజ్ఞతలు.
- గౌస్ మీరావలి (gmgousemeeravali@gmail.com)
l All thanks to Malladi venkatakrishna Murthy garu.
Amazing series novel which is very entertaining and can read it daily with smile on our faces. - priya thakur